అనుకరణ అనర్థదాయకం

24 Jun, 2018 01:41 IST|Sakshi

బౌద్ధవాణి

ఒక అడవిలో ఒక సింహం ఉంది. అది ఒక గుహలో నివసిస్తూ, అనేక జంతువుల్ని వేటాడి తిని జీవిస్తోంది. ఒక రోజున ఆ సింహం ఒక అడవిదున్నను వేటాడి, కడుపు నిండా తిని, నెమ్మదిగా తన గుహకి వస్తూఉండగా, ఒక నక్క ఎదురైంది. సింహాన్ని చూసిన నక్కకు భయం వేసింది. పారిపోడానికి కాళ్లు రాలేదు. వెంటనే ఆలోచించి, సాష్టాంగ పడింది. అలా నేలమీద బొక్కబోర్లాపడ్డ నక్కని చూసి, ‘‘నక్కా! ఏమిది?’’ అని అడిగింది సింహం. ‘‘స్వామీ! నేను ఇకనుండి మీ దాసుణ్ణి. మీ సేవకుణ్ణి. మీతోనే ఉంటాను’’ అంది. ‘‘సరే’’ అని నక్కను తీసుకుపోయింది సింహం. ఆ నాటినుండి తాను వేటాడిన మాంసంలో నక్కకీ వాటా ఇచ్చింది. కొన్నాళ్లకి నక్క బాగా బలిసి దుక్కలా తయారైంది. తన బలానికి తానే అబ్బుర పడింది. ఆ వెంటే అహంకారం పొడసూపింది. 

‘‘ఎప్పుడూ ఈ సింహమేనా వేటాడేది? నేనూ వేటాడతాను. నేనే మాంసం తెచ్చి ఈ సింహానికి పెడతాను. సింహం పాటి శక్తి నాకు లేదా?’’ అనుకుని ఒకరోజు ఈ విషయం సింహంతో చెప్పింది. 
సింహం వద్దని నక్కని వారించింది. ‘‘స్వామీ! నేనూ నీలా వేటాడగలను చూడు’’అంటూ పర్వతం మీదికి వెళ్లి కలియజూసింది. దానికి కొండకింద వెళ్తున్న ఏనుగు కనిపించింది. మోరెత్తి ఊళ వేసి ఎగిరి ఏనుగు కుంభస్థలం మీదికి దూకింది. ఏనుగు తొండంతో నక్కని చుట్టి, కాలికింద వేసి తొక్కి చంపింది. ఈర్ష్య, అసూయ, అర్థరహితమైన ఆలోచనలు ఎంతటి అనర్థాలో తెలియ చెప్పిన బుద్ధోపదేశం ఇది. 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

మరిన్ని వార్తలు