మనుషులు రాళ్లు, రప్పలు కాదు, అలా చేయకుండా ఉండటానికి | Sakshi
Sakshi News home page

మనుషులు రాళ్లు, రప్పలు కాదు, అలా చేయకుండా ఉండటానికి..బుద్ధుడు ఏం చెప్పాడంటే

Published Mon, Aug 28 2023 10:22 AM

Buddha Explains Dharma Drishti With His Students - Sakshi

శీలభ్రష్టత అంటే వ్యభిచరించడం ఒక్కటే కాదు. అసత్యాలు పలకడం, దొంగిలించడం, నిండు ప్రాణాలు తియ్యడం, మత్తుపానీయాలు సేవించడం. ఇవన్నీ శీలభ్రష్టతలే! ఈ దోషాలు లేని వ్యక్తి గానీ, సమాజం గానీ నైతికంగా దిగజారదు. తప్పు చేయడం తప్పు కాదు. తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి తప్పు అని తెలిశాక కూడా అవే తప్పులు చేయడమే పెద్ద తప్పు. తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవడాన్ని మరలా ఆ తప్పుని చేయకపోవడాన్ని బుద్ధుడు ధర్మతాదృష్టి అంటాడు. ఒక భిక్షువు వెనుకటి అలవాటుని మానుకోలేక సారాయి సేవించాడు. అతను భిక్ష కోసం వెళ్ళినప్పుడు గృహస్తులు చక్కగా భోజనం పెట్టారు. ధర్మ ప్రవచనం విన్నారు. ఆ తరువాత మోమాటం పెట్టి పానీయానికి బదులు పులిసిన ద్రవాన్ని ఇచ్చారు.

అది సారాయి లాంటిదే అని తెలిసి కూడా నిగ్రహించుకోలేక కొద్దిగా సేవించాడు. కానీ.. ఆ తరువాత ఎంతో తప్పుచేసిన వాడిగా మధనపడ్డాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చాక తన మిత్ర భిక్షువులు ఒకరిద్దరికి చెప్పుకున్నాడు. అయినా ఆ భిక్షువు మనస్సు శాంతించలేదు. ఏదో ఒకమూల తప్పుచేశాను అనే భావన తొలుస్తూనే ఉంది. చివరికి బుద్ధుని చుట్టూ బౌద్ధసంఘం చేరి ఉంది. అప్పుడు బుద్ధుడు ఆ భిక్షువుని శాంతపరచి, అందరితో పాటు కూర్చోబెట్టి–‘‘భిక్షువులారా! తెలిసో తెలియకో తప్పులు, దోషాలు కలిగినప్పుడు వాటిని కప్పిపుచ్చుకునే వారు దుశ్శీలురు. కానీ కొందరు తమ దోషాన్ని విజ్ఞులకీ మిత్రులకీ చెప్పుకుంటారు.

ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా నడుచుకుంటారు. ఇలా సరిదిద్దుకునే పద్ధతిని ‘ధర్మతా దృష్టి’ అంటారు.వీరు పసిపిల్లలతో, ఆవుతో సమానం’’ అంటూ భిక్షు సంఘాన్ని కలయ చూశాడు. ఆ భిక్షువు వంక పరిశీలనగా చూశాడు. అతనిముఖంలో తొంగి చూసే సిగ్గు, బిడియం పోయాయి. మనోనిర్మలత అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. బుద్ధుడు మరలా– ‘‘భిక్షువులారా! ఒక పసిబిడ్డ వెల్లికిలా పడుకుని ఉంటాడు గదా! ఆ పసితనంలో కూడా ఆ బిడ్డ తన చేతితో గానీ, కాలితో గానీ.. అగ్నిని ముట్టుకుంటే ఏం చేస్తాడు? చాలా వేగంగా.. ఆ చేతినో, కాలినో వెనక్కి ముడుచుకుంటాడు. అలాగే ధర్మతాదృష్టి కలిగిన వారూ తమ దోషాన్నుండి అంతే వేగంగా వెనక్కి మళ్ళుతారు. గట్టున మేస్తూ ఉన్న ఆవు ఆకలితో ఉండి, తాను ఆబగా మేస్తూ కూడా తన దూడను గమనిస్తూనే ఉంటుంది.

అలాగే ఈ ధర్మతాదృష్టి కలిగిన వారు తమ దోషాల్ని తామే సరిదిద్దుకుంటూ.. ఆవులా జాగ్రత్తగా ఉంటూ తమ జ్ఞానాన్ని, శీలాన్నీ వృద్ధి చేసుకోవాలి’’ అని చెప్పాడు. ఆ భిక్షువుకి మనస్సులోని అల్లకల్లోలాలు శాంతించాయి. తన మీద తనకు ధైర్యం వచ్చింది. ధర్మసాధనలో అందరికంటే ముందు శిఖరాగ్రానికి చేరాడు. ఇలాంటి దృష్టి సంపన్నుడు ధర్మబలుడై లోకోత్తరుడౌతాడు. మనుషులు మానూ మాకులూ, రాయీ రప్పలూ కాదు ఏం దోషం చేయకుండా పడి ఉండటానికి. తాను సమాజంలో, సమాజం తనలో ఉండి నడిచేవారు. సమాజ హితాన్ని కోరే వారు ధర్మతాదృష్టితో తమని తాము సంస్కరించుకుంటూ, సమాజాన్ని సంస్కరించాలి. ఇదే ఉత్తమ ధర్మం. అత్యుత్తమ ధర్మం.  అలాంటి మార్గాన్ని అందించిన తథాగత బుద్ధుడు సదా స్మరణీయుడు! 

– డా. బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement