చావో... బతుకో తేల్చుకోమన్నారు...

22 Dec, 2016 09:32 IST|Sakshi

స్టార్‌ ఎఫర్ట్‌

బజరంగి భాయీజాన్‌తో పాటు, భర్‌ దో జోలి మేరి వంటి పాటలతో ఎప్పుడూ మనకి టచ్‌లో  ఉండే గాయకుడు అద్నాన్‌సమి... బరువు తగ్గడం అనే విషయంలో ఒక అద్భుతం. ఇటీవల హైదరాబాద్‌లో సార్క్‌ ఛాంబర్‌ వుమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ కౌన్సిల్, ఫిక్కి వైఎఫ్‌ఎల్‌ఒ ఆధ్వర్యంలో నిర్వహించినవెల్‌నెస్‌ రూల్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు వెయిట్‌ లాస్‌కు సంబంధించి ఆయన పంచుకున్న అనుభవాలు ఇవి.

‘‘నేను లావుగా ఉన్నప్పుడు నా మోకాలి చిప్పలను కూడా నేను చూసుకోలేని పరిస్థితి. నిద్రలేమితో పాటు ఎన్నోరకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. మరోవైపు మా నాన్నగారికి పాంక్రియాట్రిక్‌ కేన్సర్‌ ఉందని 1989లో నిర్ధారించారు. ఆయనకు చికిత్స కోసం లండన్‌లో ఉన్న సమయంలో ఆయన నన్ను వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు.  ఆ పరీక్షల్లో... నేను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని డాక్టర్‌ తేల్చారు. అది కూడా మా తండ్రిగారి ముఖం మీదే. అప్పుడు ఆయన ముఖం నిజంగా నేను చూడలేకపోయాను. అంత ఆవేదన చెందారు. ఆయన నన్ను ఒకటే కోరారు. ఎప్పుడూ నా కళ్ల ముందు అంటే నాకంటే ముందు తాను చనిపోవాలని అనుకుంటున్నా అని. దాంతో ఆయన అన్న ఆ ఒక్క వాక్యం బరువు తగ్గించుకునేందుకు కారణమైంది. అప్పుడే నా 230 కిలోల బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డాను. మొత్తం 6 సంవత్సరాల్లో 160కిలోలు తగ్గాను. నా అనుభవంలో నేను చెప్పగలిగిందేమిటంటే... బరువు తగ్గడం అనేది 20శాతమే శారీరకం కాగా 80 శాతం మానసికం. నేను మానసికంగా ధృఢ నిర్ణయం తీసుకోబట్టే దీనిని సాధించగలిగాను’’ అంటూ వివరించారు అద్నాన్‌.

ఎమోషనల్‌ ఈటర్‌...
అద్నాన్‌... బేరియాట్రిక్‌తో సహా ఎటువంటి వెయిట్‌లాస్‌ సర్జరీలు చేయించుకోలేదు. పూర్తిగా సహజమైన పద్ధతుల్నే ఆశ్రయించారు. పంచదార కలపని టీ తాగడంతో ఆయన రోజు ప్రారంభమయ్యేది. ఒక టీస్పూన్‌ ఫ్యాట్‌ ఫ్రీ డ్రెస్సింగ్‌తో వెజిటబుల్‌ సలాడ్‌ లంచ్‌లో తప్పనిసరిగా ఉండేది. అదే విధంగా తండూరి ఫిష్‌ కూడా ఉండేది. వైట్‌రైస్, బ్రెడ్, పంచదార, నూనెల నుంచి దూరం జరిగి కేవలం వెజ్‌ సలాడ్స్, పాప్‌కార్న్, తండూరి ఫిష్, బాయిల్డ్‌ దాల్, నూనెలు కలపని కూరలు వాడారు. ఏ రకమైన ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ జోలికి పోలేదు. సుగర్‌ ఫ్రీ డ్రింక్స్, డైట్‌ ఫడ్జ్‌ స్టిక్స్, డైట్‌ ఐస్‌ లాలీస్‌... వంటివి ఆహారంలో భాగమయ్యాయి. పూర్తిగా కార్బోహైడ్రేట్స్‌ రహిత ఆహారం, ప్రొటీన్‌ డైట్‌ తీసుకున్నారు.  లో కేలరీ డైట్‌ ప్లాన్‌ మీద ఆధారపడ్డాను. కేవలం డైట్‌ ద్వారానే 40 కిలోల బరువు తగ్గాను. అప్పుడు వ్యాయామాలు ప్రారంభించి రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేశారు. న్యూట్రిషనిస్ట్‌లతో నిరంతరం చర్చిస్తూ ఉండడం వల్ల తానో ఎమోషనల్‌ ఈటర్‌ని అని తెలుసుకున్నారు. అంటే... ఆనందంగా ఉన్నా, విషాదంలో ఉన్నా తినడం అలవాటైంది. అదే ఆయన్ని అధిక బరువు బాధితుడిగా మార్చిందని అర్ధమై మానసిక చిత్త చాంచల్యం తొలిగించుకున్నారు అద్నాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ముంబయికి చెందిన ప్రశాంత్‌ సావంత్‌ వ్యవహరించారు. రన్నింగ్‌ చేసేందుకు నా శరీరం సహకరించదని భావించి ముందు సాధారణ వాకింగ్‌ చేయించడం, ఇలా నా శరీరానికి తగ్గట్టుగా వ్యాయామం చేయిస్తూ ఆయన అద్నాన్‌ను సాధారణ బరువుకు తీసుకువచ్చారు.

మరిన్ని వార్తలు