ఆరాధనా స్థలాలుగా... మన కుటుంబాలు

12 Mar, 2015 23:18 IST|Sakshi
ఆరాధనా స్థలాలుగా... మన కుటుంబాలు

విశ్వాసి వాక్యం
 
అకుల అనే యూదు క్రైస్తవుడు అతని భార్యయైన ప్రిస్కిల్ల ఆదిమకాలపు ఆదర్శమయమైన విశ్వాసి జంట. అపొస్తలుడైన పౌలుకు పరిచర్యలో వారు సహాయకులు. ఎంతో ప్రతికూలత మధ్య పౌలు స్థాపించిన కొరింథీ, ఎఫెసీ చర్చిలు ఆ పట్టణాల్లో అకుల, ప్రిస్కిల్ల గృహాల్లోనే ఆరంభమయ్యాయి. పైగా అపొల్లో అనే మహావిద్వాంసుణ్ణి వారు ఎఫెసులో తమ ఇంటిలో చేర్చుకుని క్రీస్తు మార్గాన్ని విశదీకరించి తర్ఫీదునిస్తే ఆయన గొప్ప సువార్త ప్రబోధకుడయ్యాడు (అపొ.కా. 18)
 
మా చర్చిలో మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం తెలుసా? అంటారు చాలామంది గొప్పగా. అకుల, ప్రిస్కిల్ల అనే ఈ దంపతులైతే తమ కుటుంబాన్నే చర్చిగా, బైబిలు కళాశాలగా మార్చుకున్నారు. పగ, వైషమ్యాలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజంలో దేవుని భయం, ప్రేమ పునాదిగా కలిగిన ఇలాంటి విశ్వాస కుటుంబాలు ఎడారిలో సెలయేళ్లవంటివే కదా! ఆత్మీయ పునాదులు, విలువల మీద కట్టబడిన కుటుంబాలతోనే పటిష్టమైన సమాజం నిర్మితమవుతుంది. పిల్లల పెంపకంలో అందుకే తల్లిదండ్రులది కీలకమైన పాత్ర. కరెన్సీ కట్టల్ని వేటాడే విద్యల్లో మన పిల్లలు ఆరితేరేందుకు ఆరాటపడుతున్నాం కాని అంతిమంగా ఆత్మీయత రూపంలో వారెలాంటి మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో ఆలోచించడం లేదు.

ఆవిరి యంత్రాలతో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం వేస్తున్న వెర్రితలల ఆధునిక యుగంలో మనుషులు కూడా మనసులేని యంత్రాలుగా మారి, ఒకనాటి శాంతి, ఆనందాలు ఆవిరైపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. అన్నీ చూస్తూ కూడా అలాంటి రాక్షస సమాజంలోనికే మన పిల్లల్ని నెడుతున్నాం. దేవుడు మాత్రమే ఇచ్చే శాంతిని, నిజమైన ఆనందాన్ని, లోకం ఇచ్చే విలాసాలు, వినోదాల్లో పొందే అవివేకానికి ‘ఆధునికత’ అనే పేరు పెట్టి మురిసిపోతున్నాం. మన కుటుంబాలు దేవునికి ఆరాధనా స్థలాలు, బైబిలు బోధనా కేంద్రాలుగా ఉంటే దేవునికి మహిమ, మనకు పరలోకానందం. దేవుడు, ఆయన విధివిధానాల మీద కట్టబడిన విశ్వాస కుటుంబాలు వినూత్న సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. దేవునికి దూరంగా బతకడమే ఆనందమనుకుంటే నీటికోసం ఎండమావుల్ని ఆశ్రయించడమే.
 మితిమీరిన వేగం, హింసాత్మకత నిండిన నేటి ‘ప్రగతిశీల సమాజం’లో జీవన సాఫల్యంతో హాయిగా కన్నుమూసే భాగ్యం కోల్పోయాం. బి.పి., షుగర్ వంటి జీవనశైలి రోగాలతో, బుల్లెట్ గాయాలతో కన్నుమూసే నిస్సారపు సమాజాన్ని నిర్మించుకున్నాం. ‘దేవుని సన్నిధి’ అనే అగ్ని మండే బలిపీఠాలుగా మన కుటుంబాలు, చర్చిలు ఉండాలి. అది సకల విధాలైన అపరిశుద్ధతనూ దహించి వేసి శాంతిని, ఆనందాన్ని మనలో నింపుతుంది.
 - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్
 

మరిన్ని వార్తలు