రుచుల గుట్ట

12 Dec, 2016 14:30 IST|Sakshi
రుచుల గుట్ట

ప్రాంతాలు వేరు కావచ్చు. ప్రాంతాల పేర్లు మారొచ్చు.మనుషుల్ని ఎప్పటికీ కలిపి ఉంచేవి కిచెన్‌లే!
ఈ జిల్లా... ఆ జిల్లా అని లేదు. ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని లేదు. ‘భోజనం రెడీ’ అవగానే... మనుషులంతా ఒక్కటే..
భూగోళమంతా... విస్తరే! ఈ వారం సాక్షి ఫ్యామిలీ యాదాద్రి భువనగిరి నుంచి...క్యారియర్‌ తెచ్చింది.టేస్ట్‌ చెయ్యండి.


పుంటికూర (గోంగూర)బోటి
కావాల్సినవి:  పుంటికూర ఆకులు – 250 గ్రాములు, బోటి (మేక మాంసం) – 500 గ్రాములు, కొత్తిమీర – తగినంత, పుదీన – గుప్పెడు, ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), అల్లం– వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, మసాలా – టీ స్పూన్, గసగసాలు – టీ స్పూన్‌
తయారీ విధానం: ∙మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. పొయ్యి మీద గిన్నెపెట్టి నూనె వేసి, వేడిచేయాలి. ఆ తరువాత అల్లం– వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు చేయాలి.  ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి దించాలి.  

పచ్చికొబ్బరి షర్బత్‌
కావాల్సినవి:  బెల్లం –1 కిలో, నీళ్లు – 2 లీటర్లు, పచ్చి కొబ్బరి – 250 గ్రాములు, పచ్చిసోంపు – 150 గ్రాములు,
కొత్త కుండ – 1
తయారీ: ∙ముందుగా పచ్చికొబ్బరిని, సోంపును కచ్చా పచ్చాగా దంచుకొని ముద్ద చేయాలి. ఆ తరువాత గిన్నెలో 2 లీటర్లు నీళ్లు పోసి, బెల్లం తురుము వేసి, గరిటెతో కలుపుతూ కరిగించాలి. ఈ బెల్లం నీళ్లను ఒక కొత్త కుండలో పోసి, మరికొద్దిసేపు ఒక గరిటెతో కలపాలి. కొబ్బరి, పచ్చిసోంపు ముద్ద వేసి, పైకి కిందకు కలపాలి. దానిని ఓ రెండు గంటలు ఉంచి, తరువాత తాగితే రుచిగా ఉంటుంది.

చింతచిగురు ఎండుచేపలకూర
కావాల్సినవి: చింతచిగురు – రెండుకప్పులు, వట్టిచేపలు (ఎండుచేపలు/రొయ్యలు) – 100 గ్రాములు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు, కారం – టీ స్పూన్‌ (తగినంత), ఉప్పు – తగినంత, నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు, అల్లం – వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌
తయారీ: ∙పొయ్యి వెలిగించి, మూకుడు పెట్టి వేడి అయ్యాక, కడిగి ఆరబెట్టిన ఎండు చేపలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన మిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అందులో అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలిపి  తర్వాత కరివేపాకు, పసుపు వేయాలి. రెండు నిమిషాల తర్వాత నలిపిన చింతచిగురు వేసి, కలపాలి. ఎండుచేపలను వేసి, కలిపి అందులో కారం, ఉప్పు వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాల తర్వాత మరోసారి కలియబెట్టి, వేగాక అందులో గరంమసాలా వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి.

మలిదముద్దలు
కావాల్సినవి: బియ్యప్పిండి/ సజ్జపిండి/ గోధుమపిండి – కిలో, బెల్లం  – 500 గ్రాములు, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడినన్ని, యాలకుల పొడి‡– రెండు టీ స్పూన్లు, బాదం పప్పులు – 2 టేబుల్‌ స్పూనులు (ముక్కలు చేసినవి), జీడిపప్పులు – 2 టేబుల్‌ స్పూన్లు (ముక్కలు చేసినవి)
తయారీ: ∙ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ రొట్టె పిండిలా ముద్ద చేసుకొని, పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొట్టెల పీట మీద రొట్టె మాదిరి మందంగా ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి, రొట్టెను రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత దానిని ఒక గిన్నెలో ముక్కలు ముక్కలుగా చేసుకొని, బెల్లం తురుము వేయాలి. వేడివేడిగా ఉన్న రొట్టె ముక్కలను, బెల్లంతో కలుపుతూ, యాలకుల పొడి, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు పోయాలి. మళ్ళీ కలపాలి. ఆ తర్వాత కావల్సిన పరిమాణంలో గుండ్రంగా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ముద్దలు రుచిగా, బలవర్ధకంగా ఉంటాయి.

చెన్నంగి(కసివింద)ఆకు పచ్చడి
కావాల్సినవి: చెన్నంగి ఆకు–2 కప్పులు, ఎండు మిరపకాయలు –10, మిరియాలు – 10, వెల్లుల్లి రెబ్బలు –5, జీలకర్ర – టీ స్పూన్, చింతపండు– 10 గ్రాములు, మినప్పప్పు – 2 టీ స్పూన్‌లు, కరివేపాకు– రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె–2 టీ స్పూన్లు

తయారీ: ∙పొయ్యి మీద మూకుడు పెట్టి మిరియాలు, జీలకర్ర, మినపప్పు వేయించుకోవాలి. తీసి గిన్నెలో వేసి, మూకుడులో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చెన్నంగి ఆకు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. చింతపండులో నారలు లేకుండా తీసి, మూకుడులో కొద్దిగా వేయించుకోవాలి. వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని తగినంత ఉప్పువేసి, మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజూ రెండు ముద్దలు తింటే ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది.  
ఇన్‌పుట్స్‌: వెల్మినేటి జహంగీర్, మోత్కూరు; మహ్మద్‌ జమాలుద్దీన్, భువనగిరి టౌన్‌ ;  ఎం.వెంకటరమణ, భువనగిరి ఖిల్లా

మరిన్ని వార్తలు