లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు

28 Feb, 2018 00:52 IST|Sakshi
రామజోగయ్య శాస్త్రి, పాటల రచయిత

నేను నా దైవం

రామజోగయ్య శాస్త్రి, పాటల రచయిత

ఆడ ఏడనో కొండమీద  కూసొని ఉంటాడు. ఈడ ఏడనో మనం మట్టిలో దొర్లాడుతుంటాం. ఓపారి సూడాలని ఓసారి దరిచేరాలని శానా ఆశ ఉంటుంది. దేవుడు కొండమీద ఉండనీ.. ఆకాశం అవతల ఉండనీ..
మన భుజమ్మీద  ఒక చేయి ఉండనే ఉంటుంది. దేవుడంటే మిత్రుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అంటూ... ‘సదాశివా సన్యాసి తాపసి కైలాసవాసి..’ పాటను అందించి మనందరి మనసులు గెలుచుకున్న రచయిత రామజోగయ్యశాస్త్రి గారితో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!

పాటల రచయితగా వెలుగొందడం  దైవ రచన అంటారా, మీ స్వయంకృషి అంటారా? 
మనలోని ప్రతీ ఒక్కరి జీవితం డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. నా జీవితం కూడా భగవంతుని దయగానే భావిస్తున్నాను. ప్రపంచంలో వేలాది విషయాలు ఉన్నప్పుడు నాకు ఈ ‘అక్షరం’ మీదనే ఎందుకు జిజ్ఞాస కలిగింది? అదే నాకు అన్నం పెట్టేదిగా ఎలా అయ్యింది. ఇది తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ రంగంలోకి రావడానికి, నిలదొక్కుకోవడానికి దైవం ప్రేరణ తప్పక ఉంది. ఇంజనీరింగ్‌ చదివాను. ఉద్యోగం చేస్తూనే నా ఇష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడటం అంటే ఇష్టం. ఆ ప్రయత్నంలో ఉండగానే పాట రాయాలనే ఆలోచన కలిగింది. నా ప్రయత్నమేదీ వృథా కాలేదు. ఇప్పటికీ నా ప్రతి అడుగులోనూ భగవంతుని అనుగ్రహం ఉంది. అయితే, దైవ కృప ఒక్కటే సరిపోదు. మన స్వయంకృషి ఉండాలి. మనమేదీ చేయకుండా భగవంతుని మీద వదిలేయడం సరైనది కాదు. ఉదయం పూజాధికాలు ముగించుకున్న తర్వాత రాయడం పనిగా పెట్టుకుంటాను. రాసే పనిలో లేనప్పుడు చదువుతాను. ఈ ధ్యాసలో పడితే అన్నం, నీళ్లు కూడా గుర్తుకురావు. జీవితంలో నిలదొక్కుకోవడానికి విధి మనకు కొన్ని అవకాశాలను ఇస్తుంది. వాటిలో అమితంగా నచ్చినదాన్ని పట్టుకుంటాం. దానిని వదలకుండా ఆ పనికి కావల్సిన వనరులన్నీ సమకూర్చుకోగలగాలి. సమర్థతను పెంపొందించుకోవాలి. చేసే సాధన ఎంత ఉంటే దైవం ఆశీస్సులు అంతగా ఉంటాయని నమ్ముతాను. 

చాలా మంది రచనలు చేసేటప్పుడు ముందు వారి ఇష్టదైవం పేరును రాస్తుంటారు. మీరూ అలా రాసే రచన మొదలుపెడుతుంటారా?
ఒకటి కాదు మూడు రాస్తాను. మొదటగా శ్రీ గురుభ్యోనమః అని రాసుకుంటాను. ఆ విధంగా ముందు గురువును తలచుకుంటాను. తర్వాత ‘సాయి ప్రసాదం’ అని రాస్తాను. ప్రతీ అక్షరం సాయిబాబా ప్రసాదంగా భావిస్తాను. మా ఇంటి పేరు కూడా సాయిప్రసాదం అనే ఉంటుంది. ఇక ఏ పని చేసినా ఓర్పుగా, శ్రద్ధగా చేయడం అనేది ముఖ్యం. ఇదే విషయాన్ని సాయిబాబా సూక్తుల ద్వారా తెలియజేశారు. అందుకే పేజీకి ఒక మూలన ‘శ్రద్ధ– సబూరి’ అని రాసుకుంటాను. ఒక పాట ఎన్ని సార్లు రాసినా, ఎన్ని పేజీలు రాసినా.. ప్రతీ ఒక్క పేజీ మీద ఈ మూడు పదాలు తప్పనిసరిగా ఉంటాయి. 

మీలో ఆధ్యాత్మికత పెంపొందడానికి చిన్నప్పుడు ఇంట్లో అమ్మనాన్నలు చేసే పూజలు, తరచూ దేవాలయ సందర్శనలు దోహదపడ్డాయంటారా?
మన సంస్కృతి, సంప్రదాయాలు ఆధ్యాత్మికత వైపు నడిపించే సాధనాలు. అవి నిన్నటి తరం నుంచి నేటి తరానికి, నేటి తరం నుంచి రేపటి తరానికి చేరుతుంటాయి. దైవానికి సంబంధించిన అంశాలు కూడా పెద్దవారి నుంచే పిల్లలు అందిపుచ్చుకుంటారు. మా అమ్మ (సరస్వతమ్మ) రాముడి భక్తురాలు. భద్రాచల రాముడికి మొక్కుకున్నాక నేను పుట్టానని, రాముడి భిక్ష అని భావిస్తూ నాకు ‘రామజోగయ్య’ అని పేరు పెట్టింది. అమ్మ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి నేనూ కొన్ని అలవర్చుకున్నాను. సాహిత్యంపైన ప్రేమ అక్కడినుంచే వచ్చి ఉంటుందని నా భావన. అయితే, భగవతారాధనలో నిత్యం చేసే క్రతువుల కన్నా ఆధ్యాత్మికానందం ఎవరికి వారు మనసు లోతుల్లో నుంచి పొందాలి. ఇది వారి మానసిక పరిణతిని బట్టి ఉంటుంది. నా చిన్నతనంలో గుళ్ల వద్ద తరచూ  కొన్ని భక్తి పాటలు చెవిన పడుతుండేవి. వాటిలో మనసులో బలంగా నాటుకుపోయినవి ‘శివ శివ శంకర.. భక్తవ శంకర శంభో హరహర మహాదేవ..,’, ‘రామనీలమేఘశ్యామ కోదండ రామా.. రఘుకులాద్రి శోమ పరంధామ సార్వభౌమ..’ అనే పాటలు. ఇవి చెవిన పడితే చాలు ఇప్పటికీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం మనసును తట్టిలేపుతుంది. ఇక ‘పిబరే రామరసం..’ అనే కీర్తన ఏ రూపంలో, ఏ సందర్భంలో, ఎక్కడ విన్నా పరవశానికి లోనవుతుంటాను.

ఇతర కవులు రాసిన పాటల పరవశం గురించి చెప్పారు. మరి మీరు రాసిన దేవుడి పాటల్లో మీకు బాగా నచ్చినవి..
రెండు పాటలు ఉన్నాయి. ‘సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి..’ అనే పాట నాకు చాలా ఇష్టమైనది. ఈ పాటకు జరిగిన కృషి, తపనను మర్చిపోలేను. ప్రతి పదమూ ఓ అద్భుతంగా అమరింది. ఈ పాట ద్వారా నాకు ఎక్కడలేని గుర్తింపు లభించింది. అంతకుముందు సినీ పరిశ్రమలోనూ, బయట రామజోగయ్యశాస్త్రిని చూసిన విధానం వేరు. ఈ పాట తర్వాత నాకో గుర్తింపు, ప్రత్యేకత లభించాయి. మరో పాట నాగార్జున నటించిన సాయిబాబా సినిమాలో ‘నీ పదముల ప్రభవించిన గంగా యమున.. మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణ..’ అద్భుతం అనిపిస్తాయి. ఆ బాబాయే దయతలచి నా చేత ఈ పాట రాయించాడా అనిపిస్తుంది.

దేవుడు మీకు అక్షరరూపంలో సరస్వతిని ఇచ్చాడు. అలాంటì  అక్షరాన్ని కమర్షియల్‌ పాటలకు వాడటం గిల్ట్‌గా ఎప్పుడైనా భావించారా?
ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, భగవంతుని స్తుతించే కీర్తన అయినా, డ్యూయెట్, ఐటమ్‌ సాంగ్‌.. ఏదీ వేరు కాదు. ఇది దైవం నాకు ఇచ్చిన పని. నేటి తరానికి తగ్గట్టుగా ఉంటూనే విలువలు కోల్పోకుండా ఆ పరిధిలోనే నన్ను వరించిన పనులు చేస్తాను. నా ద్వారా ఎప్పుడూ చెడు రాదు. సాయి ప్రసాదం అని ఎప్పుడైతే రాసుకున్నానో అది భగవంతుని ప్రసాదంగానే భావించి భక్తిగా నా పనిని పూర్తిచేస్తాను.

ఒక దశకు వచ్చాక.. అంటే ఆర్థికంగా స్థిరపడ్డాక ఎవరికైనా ఇక దేవుడితో పని లేదనిపిస్తుందా? అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా?
ఆర్థికపరమైన విషయానికి, ఆధ్యాత్మికంగా దైవంతో కనెక్టివిటీ ఉండటానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ రెండూ వేరు వేరు విషయాలు. దేవుడు మనకు మంచి ఆలంబన. నా దృష్టిలో అయితే మంచి మిత్రుడు. మోటివేషనల్‌ స్పిరిట్‌. నా ఏకాగ్రతను ఇనుమడింపజేసే ఒక అంశం. నన్ను సరైన పద్ధతులు, కట్టుబాట్లలో ఉంచి పోషించే విషయం. నా కష్టనష్టాలు చెప్పుకునే కేంద్రస్థానం. ఇవన్నీ ఆర్థికంగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండవు. కొంతమందికి దైవం మూర్తి స్వరూపంగా ఉంటాడు, కొంతమందికి భావనా స్వరూపంగా ఉంటాడు. అది వారి ఆలోచనా విధానం బట్టి ఉంటుంది. ఎవరెలా పూజించినా ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉంది. ఆ శక్తికి అందరం ఎప్పుడూ అనుసంధానమై ఉండాల్సిందే! డబ్బులు ఉండటం, లేకపోవడం అనేది సమస్య కాదు. దేవుడితో మన సంబంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉందా లేదా అనేది తరచి చూసుకోవాలి. అలాగే, ప్రపంచంలో మనశ్శాంతిని మించిన సంపద లేదు. దేవుడితో ఎంత కనెక్ట్‌ అయి ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటాం. ఎంత ఎత్తులకు ఎదుగుతున్నా భగవంతునితో కనెక్టివిటీ శాశ్వతంగా ఉండాలి. 

మీరు ఎప్పుడూ నుదుటన బొట్టుతో కనిపిస్తారు. ఈ రంగంలోకి వచ్చాకనే ఇలా బొట్టు పెట్టుకోవడం ప్రారంభించారా? దీని వెనుక ఉన్న సందర్భం ఏంటి?
పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవడం మనందరి అలవాటు. ఒకసారి ఇంట్లో ఏదో పూజ జరిగి బయటకు వెళ్లినప్పుడు బొట్టు పెట్టుకొని ఉన్నాను. కలిసినవారు బొట్టుతో బాగున్నానని చెప్పారు. అసలు విషయం ఏంటంటే నా నుదురు విశాలంగా ఉంటుంది. నుదురు మధ్యలో ఏదో ఒకటి ఉంచాలి. బొట్టు పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. 

మీ బాల్యంలో దేవుడు, ఇప్పుడు దేవుడు? ఈ రెండింటి మధ్య మీ ఆలోచనలు..
సంప్రదాయ కుటుంబంలో పుట్టినా, హేతుబద్ధమైన విషయాల పట్ల అవగాహనతో ఉండేవాడిని. ఎప్పుడూ నన్ను నేను సద్విమర్శ చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ప్రక్రియ నా ఎదుగుదలకు బాగా దోహదపడింది. ఎప్పుడూ విరగబడి ఛాందసంగా పూజలు చేసింది లేదు. అలాగని అస్సలు పూజలు చేయకుండా లేను. అమ్మానాన్నలకు ఒక్కడినే కొడుకును. చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు రాముడు, కృష్ణుడు, గణేషుడు .. అని పూజించినవారున్నారు. అయితే, నాదైన జీవితంలో ప్రవేశించాక మాత్రం ‘సాయిబాబా’ ఆలంబన అయ్యాడు. నాకు తెలియకుండానే నా జీవితంలో బాబాగారు ప్రవేశించారు. దేవతలందరిలోనూ ముందువరసలో బాబా ఉంటారు. అందరు దేవతలను ఆయనలో చూసుకుంటాను.  

పాట రాసే ముందు మంచి పదాలను ఇవ్వమని దేవుడిని తలుచుకుంటారా? 
పని ఇచ్చిన వారు.. అంటే పాట రాయమని చెప్పినవారు నాకు దైవ సమానులే! నాకు ఓ పనిని అత్యంత నమ్మకంగా అప్పజెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా ఆ పనిని చేయాలి. అదే నేను చేసే పూజ.  
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

మరిన్ని వార్తలు