భారత్‌.. స్వేచ్ఛా విపణి | Sakshi
Sakshi News home page

భారత్‌.. స్వేచ్ఛా విపణి

Published Wed, Feb 28 2018 12:49 AM

Modi Hails Korea-India Business Forum - Sakshi

న్యూఢిల్లీ: అధిక వృద్ధి బాటలో ముందుకెళుతున్న భారత్‌ వంటి స్వేచ్ఛా విపణి ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకు భారత్‌ గమ్యస్థానంగా మారిందన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) సంయుక్తంగా నిర్వహించిన భారత్‌–కొరియా బిజినెస్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు.

భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు రావాలని, ఇక్కడ పెట్టుబడులకు పూర్తి భద్రతనిస్తున్నామని మోదీ తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా.. అనేక అవరోధాలు తొలగించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా వివిధ రంగాల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు సడలించినట్లు ప్రధాని వివరించారు. కార్పొరేట్లపై పన్ను భారం తగ్గే విధానాలు అమలు చేస్తున్నామన్నారు.  

‘కొనుగోలు శక్తి పరంగా భారత్‌ ఇప్పటికే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. నామినల్‌ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పరంగా  త్వరలో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద దేశంగా అవతరించబోతోంది. ప్రజాస్వామ్యం, డిమాండు, జనాభాపరమైన ప్రయోజనాలు అత్యధికంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్‌ ఒకటి.

కాబట్టి పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధానంగా తయారీ రంగాన్ని భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నాం‘ అని నరేంద్ర మోదీ చెప్పారు. దేశీయంగా సాఫ్ట్‌వేర్‌ .. ఐటీ పరిశ్రమ, ఆటోమొబైల్స్, ఉక్కు, నౌకా నిర్మాణం, నౌకాశ్రయాలు మొదలైన రంగాల్లో కొరియా సంస్థలకు అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.   

ఒకటే జీఎస్టీ శ్లాబు సాధ్యం కాదు: జైట్లీ
ఎన్నో వ్యత్యాసాలతో ఉన్న మన దేశంలో ప్రస్తుతానికి జీఎస్టీలో ఒకటే పన్ను శ్లాబు సాధ్యపడదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. దేశంలో పన్ను నిబంధనలను పాటించడం మెరుగుపడితే అప్పుడు తదుపరి సంస్కరణలు చేపడతామని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్‌–కొరియా వ్యాపార సదస్సులో పాల్గొన్న జైట్లీ ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

కాగా, 7– 8 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించే సామర్థ్యం భారత్‌కు ఉందని జైట్లీ పేర్కొన్నారు. వచ్చే 10–20 ఏళ్లలో భారత్‌ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా ఉంటుందన్నారు. ‘‘అంతర్జాతీయ వాతావరణం సమస్యల్లో ఉన్నప్పటికీ భారత్‌ గత కొన్ని సంవత్సరాలలో తానేంటో నిరూపించుకుంది. అవసరమైతే తనను తాను సరిదిద్దుకోగలదు. అవసరమైతే అధిక వృద్ధి రేటు కొనసాగించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

రెట్రోస్పెక్టివ్‌ పన్ను
రెట్రోస్పెక్టివ్‌ పన్నుపై (చట్టరూపం దాల్చక ముందు నుంచి అమలు చేయడం) మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ప్రత్యక్ష పన్ను వసూళ్ల విధానంపై ఉన్న అపనమ్మకాలు అన్నింటినీ తొలగించాం. పన్నుల పరంగా మరింత స్పష్టతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చాం’’ అని జైట్లీ చెప్పారు.

మోదీ హయాంలో మార్కెట్‌ 13 % వృద్ధి
పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గత నాలుగేళ్లలో మన స్టాక్‌ మార్కెట్‌ 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందిందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. ఇక్కడ సీఐఐ నిర్వహించిన భారత్‌–కొరియా వాణిజ్య సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొరియాతో ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవలసి ఉందన్నారు. విదేశాల నుంచి ముఖ్యంగా కొరియా నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలన్న ప్రధాని మోదీ స్వప్నం సాకారం కావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement