తూఫాన్‌ మెయిల్‌

29 Dec, 2019 04:48 IST|Sakshi

తూఫాన్‌ బైక్‌ జంప్, గ్లాస్‌ బ్రేక్‌ ఉందని తెలియగానే పరుగెత్తు కొచ్చింది.

ఆరేడు సంవత్సరాల క్రితం ఆమె, ఫైటర్‌ బలదేవ్‌ల ప్రేమ వివాహానికి ముఖ్యమైన సపోర్ట్‌ ఇచ్చినవాడే తూఫాన్‌.

‘‘అమ్మ నన్ను వేకువనే లేపేది. సద్దు చేయకుండా ముఖం కడిగించేది. తరువాత  గది తలుపు మూసి చీకట్లోనే తాళం వేసి, మా ఇద్దరి ప్లాస్టిక్‌ చెప్పులను చేత్తో పట్టుకునేది. ‘తేలిగల్లీ’ చివరివరకు సద్దుకాకుండా నడిచి, మెయిన్‌ రోడ్డు  చేరాక నిలబడి, చెప్పులు వేసుకుని పెద్దపెద్ద అంగలతో దగ్గర్లోని అంధేరి స్టేషన్‌కు, అక్కడ టికెట్టు తీసుకుని మొదటి లోకల్‌ ట్రైన్‌ పట్టుకుని ధైసర్‌ స్టేషన్లో దిగేవాళ్ళం. నేను నాన్నను చూడబోయే సంతోషంలో ఉండేవాణ్ణి.  వేకువ నాలుగుంపావు అవుతున్నట్టే ఇద్దరం అధీరులయ్యేవాళ్ళం. ఎందుకంటే ఉత్తరం నుంచి వచ్చే తూఫాన్‌ మెయిల్‌ శరవేగంతో వస్తుంది. ఈ నిర్జనమైన స్టేషన్లో కసువు, దుమ్ముధూళినంతా సుడిగాలిలా లేపి హోరుమని అరనిముషంలో దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగదు.

అయితే దాన్లోంచి నా తండ్రి దూకుతాడు. కేవలం దూకడు. పొట్టకొక మూటను కట్టుకుని ప్రాణాంతకంగా దొర్లి, ఏదేదో భంగిమలో పడి తూఫాన్‌ మెయిల్‌ రేపిన ధూళిమేఘం కరిగిపోయేంతలో లేచి కుంటుతూ చేతిలో ఉన్న సంచిని మా వైపు విసరి పొట్టకు బిగించిన మూటతో ఫ్లాట్‌ఫామ్‌  చివరన ఎదురుచూస్తున్న ఇద్దరితో కలిసి బయటికి వెళ్ళిపోయేవాడు. అదొక్క క్షణమే మేమిద్దరం అతన్ని చూసేది. అతను పడ్డప్పుడు మేము అతని దగ్గరికి పరుగెత్తడానికీ లేదు. దూరంలో తూఫాన్‌ మెయిల్‌ వెనుకవుండే ఎర్రదీపం క్రమంగా మరుగయ్యేలోపు అతడు దేకుతూ లేచి సంచిని మా వైపు విసరి, ఒక విధంగా మా ఇద్దరిని చూసి, చేయూపి మరుగయ్యేంత వరకు మేము విగ్రహాల్లా నుంచుని చూస్తుండేవాళ్ళం. తరువాత అమ్మ పరుగెత్తి సంచిని తీసుకుని వచ్చేది. 

మేము ఇల్లు చేరేసరికి తేలిగల్లీ అప్పుడప్పుడే లేస్తూవుండేది. తలుపు తెరిచి హడావుడిగా సంచి నుంచి అమ్మ కొత్తబట్టలు, చిరుతిళ్ళు, రేకులతో చేసిన ఆటబొమ్మలు తీసేది. ప్లాస్టిక్‌ కవర్లో పెట్టి చుట్టిన డబ్బూ ఉండేది. దాన్ని వెంటనే ట్రంక్లో పెట్టేది. తరువాత ఎప్పుడు లెక్కపెట్టేదో ఏమో. సంతోషం కలిగినా కలగనట్టు ఉండేది. ఇరుగుపొరుగువారి నుంచి ఏదేదో దాచిపెడుతున్నట్టుగా ఉండేది. నాన్న ఎందుకు ఇంటికి రాడు? అతడి గుండెకు అంటిపెట్టుకున్న మూట ఏమిటి? అతను ఎవరి వెంబడి వెళ్ళాడు? అతను తూఫాన్‌ మెయిల్‌ ఆగే దాదర్‌ స్టేషన్లో ఇతర ప్రయాణికులతోపాటు దిగకుండా, ఈ నిర్జనమైన ధైసర్‌ స్టేషన్లోనే ఎందుకు ఇలా ప్రమాదకరంగా దూకాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ అమ్మ కేవలం ‘ష్‌ ష్‌’ లతో నియంత్రించేది. ఆ అరనిముషంలోనే లేచి, మా వైపు చూసి, చేయూపి కుంటుతూ తరలిపోయిన నాన్న ముఖం ఎన్నో రోజుల వరకూ మాసిపోకుండా మనస్సులో నిలిచివుండేది. ఆ ముఖంలో నవ్వే లేదన్నది తలుచుకుంటే భయం వేస్తుండేది. ఇలా ఈ అర్ధరాత్రి సమయంలో ఆరేడుసార్లు అరస్వప్నంలా కనిపించిన నాన్న ఇంటికి మరెన్నడూ రానే లేదు.

వారానికొకసారి నిర్ణయించిన రోజున వెళుతున్న అమ్మ తరువాత ప్రతీవారం ఒక్కతే వెళ్ళి ఒట్టి తిరిగొచ్చేది. మణుగుల భారపు తూపాన్‌ మెయిల్, శరవేగంతో ధూళితో కూడిన సుడిగాలిని రేపి వెళ్ళిపోయేది. దానిలోంచి ఏ ఆకృతి కూడా బయటికి దూకేది కాదు. రానురానూ రైల్లోంచి సంచి అయినా బయిటికి విసరి వేయబడిందేమోనన్నట్టు మొత్తం ఫ్లాట్‌ఫామ్‌ను చూసి వచ్చేదట. సంవత్సరాల పొడుగునా ఎదురుచూసి ఎదురుచూసి ఆమె కూడా లేకుండా పోయింది. అయితే తూఫాన్‌ మెయిల్‌ మాత్రం నిగూఢంగా వేకువను చీల్చుకుని వెళుతూనే ఉండేది.

ఒకరోజు మున్నా అనబడే నా పేరును తూఫాన్‌ అని మార్చేసుకున్నాను. ఆ విధంగా నా వేకువ లోకపు సాటిలేని సాహసి నాన్న, నిర్భయంగా నన్ను పెంచిన అమ్మ వీళ్ళిద్దరూ నాకు తోడుగా ఉన్నారని అనిపిస్తుంది’’– అని తీరం నుంచి పదిపదహారు అడుగుల దూరంలో ఉన్న ఓడలో భారీ గాజుగోడలతో తయారైన చిన్నసెట్‌ ఒకదాన్ని సిద్ధం చేస్తున్న యూనిట్‌ కుర్రవాళ్ళనే చూస్తూ స్టంట్‌ కళాకారుడు తూఫాన్‌ మాటలు ఆపాడు. ఆసక్తిగా ఆలకిస్తున్న మధువంతి అతడి ముఖాన్ని చూడకుండా తానూ ఆ ఓడనే  చూస్తోంది.

కులాబాద్లోని పాడుబడ్డ పాత మిల్లుకాంపౌండ్లో సముద్రపు ఒడ్డున నౌకాంగణంలో ఫైటింగ్‌ సీన్‌ చిత్రీకరణ వుండగా, మరొకపక్కన గ్రూప్‌ డాన్స్‌ దృశ్యం ఉంది. నృత్యబృందంలో ఒకరైన మధువంతి రిహార్సల్‌ మధ్యన తూఫాన్‌ బైక్‌ జంప్, గ్లాస్‌ బ్రేక్‌ ఉందని తెలియగానే పరుగెత్తు కొచ్చింది. ఆరేడు సంవత్సరాల క్రితం ఆమె, ఫైటర్‌ బలదేవ్‌ల ప్రేమ వివాహానికి ముఖ్యమైన సపోర్ట్‌ ఇచ్చినవాడే తూఫాన్‌. అందువల్ల షూటింగ్‌ సమయంలో ఇలా అకస్మాత్తుగా ఒకే లొకేషన్లో కలిసినప్పుడంతా వచ్చి తన సంసారంలోని సాధారణ సుఖదుఃఖాల తీరుతెన్నుల గురించి అన్ని విషయాలు మాట్లాడి వెళుతుండేది. ఈరోజు కూడా అలాగే ఏదో ముఖ్యమైనదే చెప్పాలని వచ్చినామె ఈనాటి గ్లాస్‌ బ్రేక్‌ సందర్భం చూసి కాస్త ధైర్యాన్ని కోల్పోయింది. ఎందుకంటే సామాన్యంగా గ్లాస్‌ బ్రేక్‌ దృశ్యమంటే మనిషెత్తు గాజు గుండా బైక్‌ నుంచి దూకటం. తూఫాన్‌ ఈ మధ్యని సంవత్సరాలలో గ్లాస్‌ బ్రేక్‌ ప్రవీణుడనిపించుకున్నాడు.

ఈనాటి దృశ్యంలో ఓడలోనే బైక్‌ నడుపుకుంటూ వచ్చి అక్కడి చిన్న గ్లాస్‌ సెట్లోని గాజును విరగ్గొట్టి దూకి పది అడుగులు సముద్రాన్ని లంఘించి ఒడ్డున బైక్తో ల్యాండ్‌ కావాలి. ఏదో చెప్పాలని వచ్చినామె అనుమానంతో నుంచున్నప్పుడు తూఫానే ముందుగా–‘‘ఏమే మధూ, ప్రతీసారి నా పేరు ‘తూఫాన్‌’ ఎలా వచ్చిందని అడుగుతుంటావు కదా, ఇదిగో చెబుతాను విను’’ అని, ఎన్నడూ మాట్లాడనివాడిలా, ఇప్పుడు వదిలేస్తే మరెన్నడూ సమయం దొరకనివాడిలా దాచిపెట్టిన గాయంలా ఉన్న తూఫాన్‌ మెయిల్‌ విషయాన్ని చెప్పి ముగించాడు. ముందుగానే బాహువులు, తొడలు, భుజాలు అన్ని చోట్లా కవచాలు తొడుక్కుని యంత్ర రోబోలా కూర్చున్న తూఫాన్‌ తన కథకు ఎలా ప్రతిస్పందించాలో తెలియక తబ్బిబ్బవుతున్న మధువంతిని– ‘‘వెళ్ళు వెళ్ళు...డాన్స్‌ మాస్టర్‌ విజిల్‌ వేస్తోంది చూడు. మీ హీరోయిన్‌ వచ్చేవరకు ఒన్‌...టూ...త్రీ...ఫోర్‌... ఒన్‌...టూ...త్రీ... ఫోర్‌...అని డ్రిల్‌ చేస్తూనే ఉండు. వెళ్ళు వెళ్ళు’’ అని నవ్వుతూ వీపు తట్టాడు. మధువంతి, ‘‘నీ స్నేహితుడు బలదేవ్‌ నా ప్రాణాలు తింటున్నాడు. అదంతా తరువాత చెబుతాను. సునీల్‌ శెట్టి సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి కదా, ఇప్పుడన్నీ లవ్‌ స్టోరిలే. ఫైటింగ్‌ ఉండటమే తక్కువ. ఇలాంటి సమయంలో పని వచ్చినా–లేదు చేయను అంటాడు. ఇన్సూరెన్స్‌ లేదు, మెడికల్‌ లేదు, ఎందుకు ప్రాణాన్ని కష్టపెట్టుకోవాలి అంటూ ఇంట్లోనే కూర్చుంటాడు. సరేలే, తరువాత చెబుతాను’’ అంది.

‘‘లంచ్లో నాన్‌ వెజ్‌ తీసుకో. నువ్వు తినవు. తెలుసు. అయితే నేను ప్యాక్‌ చేసుకుని వెళతాను. సోనికి యూనిట్‌ లోని నాన్‌వెజ్‌ అంటే పంచప్రాణాలు’’–అని లేచి నుంచుంది. లేచి నుంచున్నప్పుడు రాజస్థానీ ఘాగ్రాఛోళీలో ఆమె పొట్ట పెద్దగా కనిపించి–‘‘ఏమిటే, ప్రొడక్షన్‌ నెంబర్‌ టూనా? ఫైటింగ్‌ వదలి బలదేవ్‌ ఇంట్లో బెడ్రూమ్‌ సీన్‌ మొదలు పెట్టాడేమే?’’– అన్నాడు. తూఫాన్ను గిచ్చి–‘‘థూ, నాకు వేరే పనిలేదా? ఉన్న ఒక్క బిడ్డను పెంచడానికే ఈ నడివయస్సులో ఈ ఎండలో ఈ పగటివేషం వేసుకుని రోజుకొక్క చరణానికి వందసార్లు కష్టపడుతున్నాను’’ అని నవ్వి– ‘‘ఊటీ గీటి ఔట్‌  డోర్‌ అయినా ఇప్పుడు నేను రెడీ. బలదేవ్‌ ఇల్లు చూసుకోనీ. సోనీని ఇంగ్లీషు మీడియంలో వేయాలి’’–అని ఎగిరి దూకి మధువంతి డ్యాన్స్‌ ఫీల్డ్‌ వైపు పరుగెత్తింది. ఆమె అలా బలవంతంగా దూకటంలో తన వయస్సును తక్కువ చేసుకుని నృత్యవృత్తిలో కొనసాగాలనే ప్రయత్నాన్ని చూసినటై్ట తూఫాన్కు బాధ కలిగింది. భారంగా పరుగెడుతూ మధువంతి డాన్స్‌ మాస్టర్‌ విజిల్కు కదులుతున్న యాభైమంది డాన్సర్ల వరుసను చేరుకుంది.

తన షాట్‌కు ముందు ఒక నిమ్మకాయసోడా తాగే అలవాటున్న తూఫాన్కు యూనిట్‌ కుర్రవాడు ‘‘బాస్, సోడా కొట్టనా?’’ అన్నాడు. ‘‘వద్దు, కాస్తా ఆగు’’ అన్న తూఫాన్‌ చెవిలో మేకప్‌ మహాలె, ‘‘తూఫాన్‌! గ్లాస్బ్రేక్కు ఎంత  మాట్లాడావు? ఎప్పటిలా కేవలం ఇరవై వేలకేనా? ఇది కేవలం గ్లాస్బ్రేక్‌ కాదయ్యా, నీటి పైనుంచి జంప్‌ కూడా ఉందికదా. డబల్‌ అడగాలి నువ్వు. ఏదైనా అయితే ఇరవై వేలూ ఆస్పత్రికి సమర్పించాలి కదా? అటు తరువాత బ్యాండేజి బిగించుకుని, ప్లాస్టర్‌ వేసుకుని వారాలకొద్దీ ఆస్పత్రి బ్రెడ్డు తింటావు. అడుగు. డబల్‌ అడుగు. ఇప్పటికీ సమయం దాటిపోలేదు. నువ్వు తప్ప గ్లాస్బ్రేక్కు ఇంకెవరూ ఇప్పుడు దొరకరు. విను, ముప్ఫయి అయినా అడుగు’’ అని ప్రోత్సహిస్తుండగా, రెచ్చిపోయిన తూఫాన్, ‘‘చుప్‌ రే, తల తినకు. మాట జరిగిన తరువాత అయిపోయింది. ఆ మాత్రం నిజాయితీ లేకపోతే ఎలా?’’ అని రెండు చేతులనూ గాలిలో గుండ్రంగా తిప్పుతూ భుజాల కండరాలను వదులు చేసుకోసాగాడు.

మహాలె చెప్పిన దాంట్లో లేదు. ప్రతీ గ్లాస్బ్రేక్‌ తరువాత కూడా అంబులెన్స్‌. స్ట్రెచర్, గాయాలు, ఆస్పత్రి అంటూ మంచానపడే కాలం ఎంతోకొంత ఉండనే ఉండేది. ‘బాద్‌ షా’లో షారూక్‌ఖాన్‌ డూప్‌గా ఎముకలు విరగ్గొట్టుకున్నప్పుడు, తేలిగల్లీలోని ఆగదిలో పడివున్న తూఫాన్‌ క్షేమసమాచారాలు అడగడానికి ఒక అర్ధరాత్రి గప్‌ చుప్‌గా షారూక్‌ఖాన్‌ మారువేషంలో రాజులా వచ్చిపోవటం తప్ప పరిశ్రమకు చెందిన ఎవరూ అతడి వైపు పొరబాటున కూడా చూడానికి రాలేదు. ఈ లైను తీరే అది. ఒక అద్భుతమైన గ్లాస్బ్రేక్‌. తరువాత అజ్ఞాతవాసం. తూఫాన్‌ పదే పదే ఆలోచించాడు.

ఈ బైక్‌ స్టంట్‌లోని నిజమైన మజా, అసలైన మజా ఉన్నదెక్కడ? షాట్‌కు ముందు మనస్సును కమ్ముకునే విచిత్రమైన శూన్యముందికదా అదేనా? లేదా తరువాత కలిగే దిలాసానా? లేదా ఆలోచనే లేకుండా స్టంట్‌ జరిగిపోయే ఆ క్షణమా? అసలైన మజా ఏది? మధువంతి భర్త ఫైటర్‌ బలదేవ్‌ అభిప్రాయమే వేరు. అతడి ప్రకారం ‘బతికిపోవటమే అసలైన మజా! బతికిపోయానన్నది మనస్సుకు తెలియడానికన్నా ముందు శరీరానికి తెలిసిపోతుంది కదా, అది, అది అసలు మజా’ అని అంటాడతను. అతను అలా అన్నప్పుడంతా తూఫాన్‌ మెయిల్‌ తన ఒంటిమీదుగా సాగిపోయినట్టు అనిపించేది. అది  కనుమరుగయ్యేలోపు, తన కర్తవ్యంలో కించిత్తూ లోపం కలగని గొప్పదనంలో పడినచోటినుంచి దేకుతూ, లేచిన నాన్న ఆకృతి మెల్లగా కళ్ళకు కట్టేది.

ఓడకు, ఒడ్డుకు మధ్యనున్న అంతరాన్ని తదేకచిత్తంతో చూస్తున్న తూఫాన్‌ దృష్టిని ఆకర్షించేలా దూరం నుంచి ఒక గొడవ వినిపించింది. తిరిగి చూస్తే డాన్స్‌  ఫీల్డ్‌ నుంచి మధువంతి బిగ్గరగా అరుస్తూ ఒక దృశ్యంలోని సన్నివేశంలో ఇటువైపు పరుగెత్తుకు వస్తోంది. ఆమెను తరుముతూ, ఏదేదో బిగ్గరగా అరుస్తూ ఒకడొస్తున్నాడు. ఇదేం దృశ్యమయ్యా? అని కుతూహలం కలుగుతుండగా జనం తమతమ పనులు మాని వాళ్ళిద్దరి వెనకే వినోదం చూసేవారిలా గుంపుగా కదులుతూ పరుగున రాసాగారు. అరే! బలదేవ్‌ కదా? రిస్కే వద్దని సోమరిపోతులా ఇంట్లో కూర్చున్నవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎలాంటి గొడవ లేవదీశాడు? భార్యాభర్తల ఈ బహిరంగ నాటకం తనవైపే వస్తోంది కదా అనిపించి లేచి నుంచునే లోపు పరుగెత్తే ప్రేక్షకబృందాన్ని  వెన్నునంటి పెట్టుకుని రొప్పుతూ ఇద్దరూ వచ్చి ఎదురుగా నుంచున్నారు.

‘‘చెప్పు, చెప్పు, మాటమాటకూ తూఫాన్కు చెప్తానని అంటావు కదా. ఏమి చెప్తావో చెప్పు. ఇక్కడే నా సమక్షంలోనే అంతా జరగిపోనీ’’ అని అరుస్తూ బలదేవ్‌ ఒక చేత్తో ‘మాట్లాడు’ అన్నట్టు ఆమెను తోశాడు. యంత్రమానవుడి దుస్తుల్లో విచిత్రంగా నుంచున్న తూఫాన్‌ –‘‘అరే, అరే...ష్‌...ష్‌...మెల్లగా, ఏమిటి తమాషా –అందరి ముందు... ష్‌ ష్‌’’ అని తన రెండు చేతులతో గొంతు తగ్గించమని కోరి, గుమిగూడినవారితో, ‘‘నేను చూసుకుంటాను, మీరంతా మీమీ పనులకు వెళ్ళండి’’ అన్నట్టు కనుబొమలు ఎగరేశాడు. బలదేవ్‌ వాళ్ళంతా చెదరిపోవటం కోసం ఎదురుచూడకుండా మధువంతిని, ‘‘చెప్పు, చెప్పు’’ అని పట్టుకుని ఊపాడు. మధువంతి, ‘‘రోజూ ఇంట్లో నన్ను వేధించుకుని తినేవాడు.

ఇప్పుడు చూడు, ఎలా ఇక్కడికి వచ్చి యూనిట్‌ వాళ్ళ ముందు నన్ను వేలం వేస్తున్నాడు. పదేపదే బేషరమ్, సిగ్గులేనిదానా అని తిట్టడం వింటూ వచ్చాను. నిన్న రాత్రి ఏమైందో తెలుసా? నా అయిదేళ్ళ సోనీ, ‘మమ్మీ, శరమ్‌ అంటే ఏమి? నీకెందుకు శరమ్‌ లేదు’ అని అడిగింది. దానికి నేను ఏమని చెప్పాలి? దాని ముందు నన్ను ఇలా...’’ అని వెక్కసాగింది. దానికోసమే ఎదురుచూస్తున్నవాడిలా బలదేవ్, ‘‘చూడు తూపాన్, ఎలా అందరి ముందు సిగ్గులేకుండా ఏడుస్తుందో. సిగ్గన్నదే లేదు, ఇదే ఇదే...’’ అని చిన్నస్వరంతో అంటూ పళ్ళు కొరికాడు. తూఫాన్‌ ‘‘బస్‌ చుప్‌’’ అనగానే ఆమె ఏడుపు, అతడి అట్టహాసం రెండూ ఒక్కసారిగా మందగించాయి.

మధువంతి ఇప్పుడు స్పష్టంగా మ్లాడసాగింది. ‘‘సారీ తూఫాన్, నీకు నీదే జీవన్మరణమైన జంప్‌ ఉంది. ఇప్పుడు నీ బుర్రను మేము పాడు చేయకూడదు. అయితే ఈ మూర్ఖుడు నా డాన్స్‌ రిహార్సల్సు్న అక్కడ దాగి కూర్చుని చూస్తున్నాడు. ఇక్కడ నేను దొంగతనం చేస్తున్నానా? ఇలా అతను దొంగతనంగా మాటువేసి, నామీద నిఘా పెట్టడానికి? ఛీ...ఇప్పడు వద్దు బలదేవ్, తరువాత మాట్లాడుదాం, గ్లాస్బ్రేక్‌ పూర్తికానీ ప్లీజ్‌’’ ఆ మాత్రం అని తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. బలదేవ్‌ ‘‘చాలు, ఆగవే’’ అని అనగానే నిలబడిపోయింది.

‘‘తూఫాన్, నీకు తెలియదు. ప్రతీ రోజూ నా ముందు ఈమె నాటకం ఆడుతుంది. నేను ఈమెను ముట్టుకుని దగ్గరికి లాక్కుంటే సిగ్గుపడుతున్నట్లు ప్రవర్తిస్తుంది. ఎలా సిగ్గుపడుతున్నట్టు చేస్తుందనుకున్నావ్‌?  సినిమాలో మొదటిరాత్రి తలమీది కొంగును హీరో జరిపేటప్పుడు హీరోయిన్‌ సిగ్గుతో కళ్ళు మూసుకుంటుందికదా అలా! నాకేమీ తెలియదనుకుంటోంది. అది అబద్ధపు సిగ్గు. హీరోయిన్‌ కావాలనుకునే కల. మళ్ళీమళ్ళీ ఆ సీన్ను అభినయిస్తుంది. హీరోయిన్‌ కావటమంటూ నుదుట రాయలేదు. మూడుకాసుల ఎక్స్‌ ట్రా అయ్యింది. భర్త కంట్లో దుమ్ముకొడుతోంది. సిగ్గుపడుతోంది...’’

మధువంతి రెండు చేతులతో ముఖం దాచుకుని కూర్చుంది. ఆమెను చూడటం అటుండనీ, అక్కడ కళ్ళు తెరుచుకుని ఉండటమూ దుస్సాధ్యమై తూఫాన్‌ ముఖం తిప్పుకుని దూరంలోని నిశ్శబ్దమైన, నిర్జనమైన ఓడలను చూశాడు. దాన్నీ ఆపి తన కాలి లోహపు పాదరక్షల నట్టుబోల్టులను సవరిస్తూ బిగించసాగాడు.  బలదేవ్‌ ఆవేశాన్ని మెల్లగా తగ్గించేటటువంటి మౌనం అక్కడుంది. ఈ మౌనం మీది పట్టు ఎక్కడ తప్పిపోతుందో అన్నట్టు మళ్ళీ నోరు తెరిచాడు...‘‘అప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ, ఆ డమ్మి డాన్స్‌ మాస్టరు రిపీట్‌ అని విజిల్‌ చేసినప్పుడంతా అందరితో కలిసి దుపట్టా లేని గుండెలను ముందు వెనుకలకు వేగంగా ఊపుతున్నావు. స్టాప్‌ అన్నప్పుడు నిలుపుతున్నావు. మళ్ళీ విజిల్‌ వేయగానే మళ్ళీ ఒన్‌ టూ త్రీ ఫోర్‌ గుండెలను కదిలించడం, ‘ఇంకా వేగంగా’ అని డమ్మి చెబితే ఊపిరి తీసుకుని తీసుకుని వేగంగా కదిలించటం’’ భరించలేక మధువంతి ముఖం దాచుకుని, ‘‘ఛీ’’ అని చేతులు తీసి, అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి , ‘‘అది నా వృత్తి, నా వృత్తి ’’ అని అరిచింది.

‘‘అలాంటప్పుడు, ఇంట్లో ఎందుకు సిగ్గుపడతావ్‌? కావాలనే కదా. అంతా అబద్ధం, అబద్ధమే’’ అనబోయిన బలదేవ్‌కు చెప్పదలుచుకున్నది చెప్పడానికిS కావటం లేదుకదా అనే నిరాశ పొంగుకు వచ్చి, మాటలాపి, రెండు చేతులతో ఏవో హావభావాలు చేసి, అది చాలక దుఃఖం పొంగుకు వచ్చి తడబడసాగాడు. ‘‘అరే, అరే బలదేవ్‌...బలదేవ్‌...నువ్వు ఫైటర్వి. ఇలా ఎమోషనల్‌ అయితే ఎలా ...ఛీ’’– అని అంటున్న  తూఫాన్‌ లోహకవచపు భుజంమీద ఒరిగి బలదేవ్‌ రోదించసాగాడు. లైట్‌ బాయ్స్‌ అందరూ ‘‘బలదేవ్‌ ఏడుస్తున్నాడు... బలదేవ్‌  ఏడుస్తున్నాడు’’ అని అరుస్తూ వచ్చారు. ఒక విధమైన  నవ్వుతో మధువంతి ‘‘భార్య మీద దొంగతనంగా నిఘా పెట్టడానికి వచ్చాడు. మగవాడంట మగవాడు. ఎలా ఏడుస్తున్నాడు చూడు, మీనాకుమారిలా’’ అని గొణుగుతూ బలదేవ్‌  చెవి దగ్గరికి వెళ్ళి ‘‘పబ్లిక్లోనైనా సిగ్గుపడు’’ అని గుసగుసగా కసిరి అతడిని తూఫాన్‌ బాహువుల నుంచి దూరంగా జరిపింది.

నలుగురు మనుషులు వచ్చి బలదేవును ఓదార్చుతూ క్యాంటిన్‌ వైపు పిల్చుకునిపోయారు. మధువంతి తన రాజస్థానీ ఘాగ్రా కుచ్చెళ్ళనంతా సరిచేసి విదిల్చుకుని, ‘‘తూఫాన్‌ గుడ్‌ లక్‌’’ అని కరచాలనం చేసి, తరువాత అందరం కలిసి ఖీమాపావ్‌ తిందాం’’ అని తనలో ఆరిన ఉత్సాహానంతా  తనలోకి పోగుచేసుకోవడానికి ప్రయత్నిస్తూ లంగాను రెండు చేతులతో కొద్దిగా ఎత్తి పట్టుకుని భారంగా కదులుతూ తన బృందం వైపు పరుగెత్తింది. ఆమెను చూస్తుండగా తూఫాన్కు, వేకువలో తనను లేపి తండ్రి మెరుపు దర్శనానికి సిద్ధంచేసి బయలుదేరదీస్తున్న అమ్మ గుర్తొచ్చింది. అమ్మ అప్పుడు, దాదాపు ఇదే వయస్సులో ఉండేదని స్ఫురించింది.  విచిత్రమైన సంకటం కలిగింది.

బలదేవ్‌ ప్రాణాలను పిండేస్తున్న ఈ మధువంతి సిగ్గు ఎలాంటిది? తనకిప్పుడు మనస్సు దూరంలో పెద్దదానిగా కనిపించే అమ్మ, నిజానికి అప్పుడు ఈ మధువంతి అంతే ఉండేది కదా? ఆమె అప్పటి సిగ్గు పోరాటం ఎలాంటిది? ఒక్కొక్కసారి టేక్‌ లో బైక్‌ దూకించడంలో అదుపు తప్పి కర్కశంగా నేను పడతాను కదా అప్పుడు నేను మెల్లగా లేచేటప్పుడు, మిగిలినవారు వచ్చి బైకుని ఎత్తి నిలబెడుతారు కదా, ఆ మౌనంలో ఎందుకు సిగ్గు ఉండదు? మధువంతికి మండే ఎండలో వేలాది కన్నుల ఎదుట దుపట్టా లేని బిగువైన రవిక తొడుక్కున్న గుండెలను ఒక మాటకు వందసార్లు కదిలించేటప్పుడు కలగని అవమానం, బలదేవ్‌ చెప్పకుండా వచ్చి దొంగతనంగా చూసి, ఎత్తి చూపి మాట్లాడినపుడు ఎందుకు కలుగుతుంది? నా ఒంటరి తల్లి పదే పదే అంటున్న ‘ష్‌ ష్‌ ష్‌’ ఆమె లజ్జా స్వరమె ఉండిందా? అది ఆమెదే అయిన లోకాన్ని నియంత్రిస్తూ ఉండిందా?

మెల్లగా తూఫాన్‌ అంచువైపు  కదలసాగాడు. వేకువలో ఆ నిర్జనమైన స్టేషన్లో శరవేగంతో పరుగెడుతున్న రైలు నుంచి  ఉపేక్షింపబడిన, త్యజించబడిన ప్రాణిలాపడి, మెల్లగా లేచే నాన్న భంగిమలో, దాన్ని రెప్ప వాల్చకుండా చూస్తున్న మా ఇద్దరి నిశ్చలమైన స్థితిలో లవలేశమైనా అవమానం లేదుకదా! దాన్ని తూఫాన్‌ మెయిల్‌ ఎగరేసుకుని పోయిందా? లేదా జీవనానికై, కనీసం అన్నానికై ఎన్నుకున్న వృత్తికి తనకు తానే ఒక మర్యాద ప్రాప్తమౌతుందా?

‘‘షాట్‌ రెడీ’’ అనే కేక వినిపించింది. లైట్లు వెలిగాయి. యుద్ధప్రాతిపదికన కుర్రవాళ్ళు ముందూ వెనుకలా పరుగెత్తసాగారు. అంబులెన్స్, స్ట్రెచర్లు, ఫీల్డ్‌ సమీపంలో నిలబెట్టారు. యూనిట్‌ కుర్రవాడు వచ్చి సోడా కొట్టి అందులోనే నిమ్మకాయ పిండి ఇచ్చాడు. దాన్ని తాగిన తూఫాన్‌ తాత్కాలికంగా వేసిన చిన్న చెక్కపలక మీద టక్‌ టక్‌ మని లోహపు అడుగులు ఊన్చూతూ నీటిని దాటి ఓడ డెక్‌ చేరాడు. చెక్కపలకను తీసేయటం జరిగింది. బైకు మీద నెమ్మదిగా కూర్చున్నాడు.

నౌకాంగణంలో అతను ల్యాండ్‌ చేయవలసిన  స్థలంలో సున్నపు పొడిని చల్లి గుర్తించటం జరిగింది. ఒక వైపు నుంచి డాన్స్‌ పాటలోని శబ్దాలు తేలితేలి వస్తున్నాయి. మరొక వైపు అనేక పచ్చరంగు జనరేటర్ల అశ్వశక్తి చప్పుడు వినవస్తోంది. హెల్మెట్‌  వేసుకున్న వెంటనే అన్ని సద్దులూ దూరమయ్యాయి. ఎదుటి ఒడ్డులోని సర్వస్వమూ ఇప్పుడు ఈ క్షణంలో కొంచెం వెనక్కు జరిగి, ఒక ఘనమైన లజ్జలో ఉంది. దూకడానికి కావలసిన వేగాన్ని సంపాదించడానికి డెక్‌ మీద తాను వెళ్ళవలసిన దారినీ, భేదించవలసిన గాజుగోడనూ  ఒకసారి చూసి ఎర్రరంగు సిగ్నల్‌ రాగానే కాస్త పొడుగ్గా పైకి జరిగి బైక్‌ కిక్‌ కొట్టాడు. హఠాత్తుగా దూరం నుంచి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేకువజాములోని తూఫాన్‌ మెయిల్‌ హోరు సమీపించసాగింది.

మరిన్ని వార్తలు