అపర్ణశాల

3 Jun, 2020 04:32 IST|Sakshi

అద్భుతమైన మూలాలు ఆమెవి.. నాన్న వైపు .. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అనిన రాయప్రోలు సుబ్బారావు... అమ్మ వైపు.. స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య.. సాహిత్యం, స్వాతంత్య్ర సమరం.. రెంటికీ వారసురాలు రాయప్రోలు సుబ్బారావుకి మనమరాలు.. పట్టాభి సీతారామయ్యకు మునిమనమరాలు! అయితే ఈ వైభవం మాత్రమే ఆమె ఉనికి కాదు! తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఆమె అపర్ణ రాయప్రోలు. శోధన కోసం.. బోధన కోసం ఏ దేశమేగినా అక్కడ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌. వలసల మీద పరిశోధన చేశారు.. దాన్ని ‘నెగోషియేటింగ్‌ ఐడెంటిటీస్‌ .. విమెన్‌ ఇన్‌ ది ఇండియన్‌ డయాస్పొరా’ అనే పుస్తకంగా ప్రచురించింది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ. ఈ అస్తిత్వమే ఇవ్వాళ ఆమెను ఇక్కడ పరిచయం చేస్తోంది.. సికింద్రాబాద్‌లో పుట్టిపెరిగారు అపర్ణ. సెయింట్‌ ఆన్స్, కోఠీ విమెన్స్‌ కాలేజ్‌లు ఆమెకు విద్యను అందించిన వేదికలు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎమ్మే సోషియాలజీ, ఎమ్‌ఫిల్‌ కూడా చేసి పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో పీహెచ్‌డీ చేశారు. ఈ దేశం నుంచి అమెరికా వెళ్లిన మొదటి తరం వలస కుటుంబాల్లోని మహిళల మీద. పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయం కేంద్రంగా ఆమె పరిశోధన సాగింది.

‘1960ల్లో ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్లిన వాళ్లకు ఆ గుడి ఒక బడి లాంటిది. ఆ గుడే కేంద్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మొదలు సంస్కృతం వరకు అన్ని భాషల బోధన జరిగేది. శాస్త్రీయ సంగీతం, నృత్యాలూ పిల్లలకు నేర్పించేవారు. అలా మొదటి తరం వలసలోని మహిళలు సెకండ్‌ ఇండియాను క్రియేట్‌ చేశారు’ అని చెప్తారు అపర్ణ. పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నాక కొన్నాళ్లు అక్కడే బోధనావృత్తిలో కొనసాగారు. తర్వాత ఇండియా వచ్చేసి ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో బోధకురాలిగా చేరారు. కొన్నాళ్లున్నాక భర్త వినోద్‌ పావురాలతో కలిసి హైదరాబాద్‌ వచ్చేశారు. తర్వాత పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌ రావడంతో ఈసారి రెండో తరం మీద అంటే అక్కడే పుట్టి పెరిగిన భారతీయ సంతతి మీద పరిశోధన చేశారు.

‘ఇండియన్‌ అమెరికన్‌ ఐడెండిటీ మీద నా రీసెర్చ్‌ మొదలైంది 1998–99 ప్రాంతంలో. ఆ పిల్లలు వాళ్ల ఐడెంటీపట్ల చాలా క్లారిటీతో ఉన్నారు. అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ (ఏబీసీడీ) అంటూ మనమే కన్‌ఫ్యూజన్‌ అవుతున్నాం తప్ప వాళ్లకేం కన్‌ఫ్యూజన్‌ లేదు. అమెరికా అంటే నేషన్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ కదా.. అందులో వాళ్లూ భాగమనే ప్రాక్టికల్‌ థింకింగ్‌తో ఉన్నారు’ అంటారు ఆమె. ప్రస్తుతం ... రివర్స్‌ మైగ్రేషన్‌ మీద రీసెర్చ్‌ మొదలుపెట్టారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ల మీద. ‘ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అవకాశాలు అన్ని చోట్లా ఒకేరకంగా ఉంటున్నప్పుడు అమెరికాలోనే ఉండాల్సిన అవసరం లేదు.. అక్కడ నేర్చుకున్నది ఇక్కడికొచ్చి అమలు చేయాలనే ఆలోచనతో ఈ రివర్స్‌మైగ్రేషన్‌ మొదలైంది. ఇదీ మహిళల మీదే చేస్తున్నాను. ఇక్కడికి వస్తున్న వాళ్లలో ఐటీ నిపుణులు, ఇతర  రంగాలతోపాటు అంట్రప్రెన్యూర్స్‌గా స్థిరపడాలనే అమ్మాయిలూ ఉన్నారు’ అంటూ వివరిస్తారు అపర్ణ.

డైవర్సిటీ ఇండియాకు మోడల్‌
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా దేశంలో ఏ యూనివర్శిటీలో లేని ఓ కొత్త  స్టడీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు ‘స్టడీ ఇన్‌ ఇండియా’ పేరుతో విదేశీ విద్యార్థుల కోసం. ఇది నాలుగు వారాల కోర్స్‌. అమెరికా, స్కాండినేవియా దేశాల విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఒకసారి పిట్స్‌బర్గ్‌ నుంచి మా ప్రొఫెసర్‌ వచ్చారు ఇక్కడికి (హైదరాబాద్‌). ఇస్లామిక్, హిందూ కల్చర్, క్రిస్టియన్‌ బ్రిటిష్‌ సెటిల్మెంట్స్, పార్సీలు, గురుద్వారాలు, ఆఫ్రికన్స్‌.. ఇలా విశిష్టమైన ఈ సిటీ కల్చర్‌కు ముచ్చటపడ్డారు. డైవర్సిటీ ఇండియాకు హైదరాబాద్‌ను మించిన మోడల్‌ ఉంటుందా ... ఫారిన్‌ స్టూడెంట్స్‌ కోసం స్టడీ ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేయొచ్చు కదా అని అడిగారు. అవును కదా అనిపించింది మాక్కూడా. ఆలస్యం చేయకుండా ఆ ప్రయత్నంలో పడ్డాం.

1998లో మొదలుపెట్టాం. నిరాటంకంగా సాగుతోంది. మా ఈ ప్రోగ్రామ్‌ను చూసి పలు యూనివర్శిటీలకు యూజీసీ సిఫారసు చేస్తోంది ఇలాంటి కోర్స్‌ను ప్రవేశపెట్టమని. ఈ కోర్సు ద్వారా విదేశీ విద్యార్థులు ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు దక్షిణాసియా అభివృద్ధి, మీడియా, డిజిటలైజేషన్‌ వంటివాటి మీద అధ్యయనం చేస్తారు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎంత ఉత్సాహంగా ఉంటారంటే తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృత భాషలు నేర్చుకుంటారు.

ఇక్కడి సంస్కృతి మీదా ఆసక్తి చూపిస్తుంటారు’ అని చెప్పుకొచ్చారు అపర్ణ. ఇంతేకాకుండా సోషియాలజీలో జెండర్‌నూ చేర్చి బోధిస్తున్నారు. పరిశోధనల్లో అడిగే ప్రశ్నలలో, మెథడాలజీలోనూ మార్పులు తీసుకు రావడానికి శ్రమిస్తున్నారు. వలసల పరిశోధనే కాకుండా లింగ వివక్ష, జెండర్‌ సోషలైజేషన్‌ మీదా చాలా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. ‘అమ్మాయిలకు తన హక్కుల గురించి చెప్తున్నాం. అలాగే అబ్బాయిలకు తన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా చెప్పాలి. ఇదంతా సిలబస్‌లో భాగం కావాలి’ అంటారు రాయప్రోలు అపర్ణ. – సరస్వతి రమ

తాత, ముత్తాతల జ్ఞాపకాలు
రాయప్రోలు సుబ్బారావు మా తాతగారు. ఆయన రెండో కొడుకే మా నాన్నగారు రాయప్రోలు శ్రీనివాస మార్తాండ. ఆర్‌ఎస్‌ మార్తాండ్‌గా సుప్రసిద్ధులు. కవి. తాతగారి రాసే తత్వం మా ఇంట్లో నాన్నకు వచ్చినట్టుంది. మాకు రాలేదు మళ్లీ. అంటే జర్నల్స్‌కు వ్యాసాలు అవీ రాస్తాం కాని.. ఇలా కవిత్వం మాకు అబ్బలేదు. తాతగారి గురించిన జ్ఞాపకాలు అంటే మా ఇంట్లో ఉన్న లైబ్రరీనే. ఆయన గురించి పరిశోధన చేయడానికి ఎవరెవరో ఇంటికి వస్తూండేవారు. వాళ్లతో తాతగారు మాట్లాడుతుంటే వినడం.. ఇవే గుర్తు. ఇక అమ్మ (రాజేశ్వరి) వైపు అంటే.. ఆమె సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రబ్యాంక్‌ వ్యస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారికి మనవరాలు. మా అమ్మ తన పదకొండేళ్ల వయసులోనే మా ముత్తాతతోపాటు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎన్వలప్‌ కవర్ల వెనక ‘ది హిస్టరీ ఆఫ్‌ కాంగ్రెస్‌’ రాశారట. మా అమ్మకూ అలా కవర్ల వెనక రాసే అలవాటు ఉండేది’’ అంటూ తాత, ముత్తాతల గురించి తనకు తెలిసిన విషయాలను పంచుకున్నారు రాయప్రోలు అపర్ణ.

మరిన్ని వార్తలు