Terrace Garden: ఇల్లే నందనవనం.. టెర్రస్‌ గార్డెనింగ్‌తో ఎన్నో ఉపయోగాలు

15 Nov, 2023 15:29 IST|Sakshi

గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి.

రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు,ఆకుకూరలు,పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు.

ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్‌. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.

సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి..

నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్‌, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు.

ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల శ్రమ..

ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు.మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు.

అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు.

సంతపేట విజయలక్ష్మి ఇంట్లో వివిధ రకాల మందారం మొక్కలు ఉన్నాయి. అందులో పత్తి మందారం వెరీ స్పెషల్‌. ఇది తెలుపు రంగులో పూస్తుంది. మధ్యాహ్నానికి లేత పింక్‌ కలర్‌లోకి మారుతుంది. సాయంత్రానికి ముదరు పింక్‌ కలర్‌లోకి మారుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగించే పూల మొక్కలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

ఆపిల్‌..

ఆపిల్‌ మొక్కను పెంచేందుకు సుకన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందుగా ఆపిల్‌ విత్తనాలను 15 రోజుల పాటు ఫ్రిజ్డ్‌లో ఉంచారు. మొలక వచ్చాక వాటిని కోకోపిట్‌లో ఉంచి తర్వాత కుండీలో పెట్టారు. మూడు సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. దీనిని తొట్టెలోంచి తీసి భూమిలో పాతాలి. ఐదు నుంచి ఏడేళ్లు వచ్చాక కాయలు కాస్తుందని చెబుతున్నారు సుకన్య.

ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్‌..

ఇంటి పంటలు పండించే వారి కోసం నగరంలో ‘ప్రకాశం మిద్దెతోటల పెంపకం’ అనే ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఆలపాటి సుకన్య అడ్మిన్‌గా ఉన్నారు. ఆమెతో పాటు సంతపేటకు చెందిన డి.విజయలక్ష్మి ప్రధానంగా ఉంటూ ఇంటి పంటలు పండించే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకూ 130 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి రఘోత్తమరెడ్డి, రిటైర్డ్‌ బ్యాంకు ఆఫీసర్‌ అప్పారావు తదితరులను తీసుకువచ్చి సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ గ్రూపు నడుస్తోంది. ఇంటి పంటలపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తామని అడ్మిన్‌ సుకన్య చెబుతున్నారు.

ఐదేళ్ల నుంచి..

మొదట్లో పూల మొక్కలు పెంచా. ఆ తర్వాత సేంద్రియ ఎరువులతో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెంచుతున్న విధానాన్ని తెలుసుకున్నా. వాటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. రకరకాల పూల మొక్కలతో పాటు కాయగూరలు, పండ్లను పెంచుతున్నా. రెండో అంతస్తులో వీటిని పెంచుతున్నా. తొలినాళ్లలో వీటిని సంరక్షించేదాన్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లో పనిచేస్తున్నా భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలలుగా మొక్కలు సంరక్షిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడంతో సంతృప్తినిస్తోంది. 
– డి.విజయలక్ష్మి, సంతపేట, ఒంగోలు

సొంతంగా ఎరువుల తయారీ..

మామగారు ఆలపాటి సత్యనారాయణ పొగాకు వ్యాపారి. ఆయన బెంగళూరు నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చేవారు. అలా ఇంట్లో మొక్కలు పెంచడం అలవాటైంది. క్రమంగా కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నా. కిచెన్‌ వేస్ట్‌తో ఎరువులు తయారు చేస్తున్నా. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నా. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నా. అమెరికాలో ఉంటున్న కుమారుడు సైతం రకరకాల కాయగూరలను పెంచుతున్నారు. పెరటి మొక్కల పెంపకంపై నగరవాసులకు ఆసక్తిని పెంచేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక గూప్‌ను ఏర్పాటు చేశాం. ప్రసుతం 130 మంది సభ్యులు ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రూప్‌ను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నాం. 
– ఆలపాటి సుకన్య, మారుతీనగర్‌, ఒంగోలు

ఎన్నో ఉపయోగాలు..

పూల మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలు పెంచడం ఆహ్లాదాన్ని ఇస్తుంది. కూరగాయల సాగు చేయడం ద్వారా రసాయనాలతో పండే కూరగాయలకు దూరంగా ఉంటూ మన చెట్లకు పండే కూరగాయలు తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్ల మొక్కలు పెంచడం ద్వారా రసాయనాలు లేని పండ్లను తినొచ్చు. మార్కెట్లో దొరికే పండ్లలో రసాయనాలతోనే పెంచి రసాయనాలతోనే వారిని పండేలా చేస్తారు. దీంతో అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మన ఇంట్లో పండిన పండ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి.

మరిన్ని వార్తలు