వంట పండింది

25 May, 2018 00:05 IST|Sakshi

బీడు భూములు ఆవురావురుమంటుంటే రైతుల కడుపులు సెగలు కక్కవా?!గుండె.. కుంపటి మీద ఉన్నట్లుండదా?!జీవితం.. వంటచెరకులా కాలిపోదా?!కానీ నందిపాడు రైతులు..కడుపు సెగలను, గుండె మంటలనువంటసేద్యంగా మార్చుకున్నారు!పంట పొమ్మంటే వంట రమ్మంది. నీరు లేక పంట ఎండితే మంట మీద వంట పండింది.

పదిమందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత రైతు. అలాంటి అన్నదాత నేడు ఆకలితో అలమటిస్తున్నాడు! పండించిన పంటలకు ధరలు లేక, పంటసాగుకు నీరులేక ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతున్నాడు. ఆ పంటలకు కూడా గిట్టుబాటు లేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం కష్టమని భావించిన  నందిపాడు గ్రామంలోని రైతులు చేతిలోని నాగలి వదలలేక, తరతరాలుగా వస్తున్న భూమిని పోగొట్టుకోలేక జీవనం సాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషించారు. చివరకు ప్రత్యామ్నాయంగా వంట చేయడంపై దృష్టి సారించారు! అలా ఈ రైతులు జీవనోపాధి కోసం చేస్తున్న వంట పనులు ఇప్పుడు గ్రామంలోని అందరికీ బతుకు బాట వేశాయి. నేడు  గ్రామంలో సుమారు 150 మందికి పైగా వంటను తమ వృత్తిగా మార్చుకున్నారు.  కృషి, పట్టుదల ఉంటే కష్టాలను గట్టెక్కవచ్చని నిరూపించి ఒక వైపు పొలంలో సాగుచేస్తూనే, మరోవైపు వంటలో ప్రావీణ్యం పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నందిపాడు గ్రామంలోని రైతులు. కడప జిల్లా ఖాజీపేట మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం నందిపాడు. 83 పక్కాగృహాలు ఉన్నాయి. 737 మంది జనాభా. సుమారు 160 ఎకరాల సాగుభూమి ఉంది. అంతా చిన్నకారు రైతులే. కేసీ కాలువ నుంచి నీరు వస్తుంది. అయితే ఈ గ్రామం చివరి ఆయకట్టు అయినందున కాలువకు నీరు సక్రమంగా రాదు. గ్రామ సమీపంలో చెరువు ఉన్నప్పటికీ ఆ చెరువుకు కేసీ కాలువ నీరు వచ్చేందుకు అధికారిక తూము లేదు. భూమాయపల్లె కాలువ నుంచి వచ్చే నీరు ఆ చెరువుకు వస్తుంది. కేసీ కాలువకు నీరు సక్రమంగా అందితే అందరూ వరి సాగుచేస్తారు. లేకపోతే పత్తి పంట వేస్తారు.

సాగు నుంచి వంట వైపు
వ్యవసాయం రైతుల కన్నీటి కష్టాలు తీర్చడంలేదు, ఏం చేయాలి? అని రైతులు ఆలోచిస్తున్న తరుణంలో అదే గ్రామంలో ఉన్న నారాయణ అనే వ్యాపారి ఉపాధి కోసం వంటమాస్టర్ల దగ్గర సహాయకుడిగా పని చేసేవాడు. అలా తన వెంట ఆయన కొందరు గ్రామస్తులను వంట సహాయకులుగా తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వారు ఐదేళ్ల తర్వాత మెల్లగా పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. వంట మాస్టర్లుగా మారారు!  సొంతంగా వివాహాలతోపాటు ఇతర శుభకార్యాలు, డిన్నరు,్ల క్యాటరింగ్‌ కాంట్రాక్టులు, ఉత్సవాలకు ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారు. వారి కింద కూడా వంట చేసేందుకు వెళ్లిన వారు కొద్దికాలానికి తిరిగి వంట మాస్టర్లుగా మారారు. ఇలా గ్రామంలో ఇప్పుడు సుమారు నూటాయాభై మంది వంట చేసేందుకు వెళుతున్నారు. వీరిలో ఇరవై మంది వరకు వంటమాస్టర్లు ఉన్నారు. ఒక్కొక్క వంట మాస్టర్‌ చేతి కింద పదిమంది సహాయకులు ఉంటారు. వంటలు చేయడంతోపాటు భోజనాలు వడ్డించేందుకూ వారు వెళుతుంటారు. అలా గ్రామంలోని వారందరికీ వ్యవసాయంతోపాటు అదనపు ఉపాధి వంట చేయడం వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపింది.

విద్యార్థులు సైతం
గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వంట చేయడంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. గ్రామంలో చాలా మంది వంటలకు వెళుతుండటంతో  విద్యార్థులు కూడా వారిని అనుసరిస్తున్నారు. వారిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్‌లలో వడ్డించేందుకు వెళుతుంటారు. రోజుకు రూ 350 నుంచి 400 సంపాదిస్తున్నారు. వీళ్లలో కూడా వంట మాస్టర్‌లు అయినవారున్నారు. 

నందిపాడు వంటలు 
‘ఆహా ఏమి రుచి .. తినరా మైమరచి..’ అన్నట్లుగా ఉంటాయి.. నందిపాడు వంట మాస్టర్లు వండిన వంటలు. శాకాహారంలోని అన్ని రకాల వంటలు, అలాగే  ఉదయం టిఫిన్‌లో అన్ని రకాలు,  మాంసాహార వంటలు కూడా భలే రుచిగా ఉంటాయని సమీప జిల్లాల్లో సైతం పేరు తెచ్చుకున్నారు.  గతంలో ఖాజీపేట మండలంలోని వివాహాలకు మాత్రమే పరిమితమైన వారు ఇçప్పుడు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి వంటలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ వంటలు చేసినా అక్కడ మన్నన పొందుతున్నారు. ఇలా నందిపాడు గ్రామంలోని వారు వ్యవసాయ వృత్తిని వదలకుండానే, వంట చేస్తూ తాము జీవిస్తూ ఇతరులకు జీవనోపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

హెల్పర్‌గా వెళ్లి మాస్టర్‌ని అయ్యా
నాకు ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. పంట సాగుచేసినా కుటుంబ ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో 1998 లో వంటమాస్టర్లకు హెల్పర్‌గా వెళ్లాను. ఆరేళ్లు పని నేర్చుకున్న తరువాత 2004 నుంచి నేను వంటలు చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా వంటలు చేస్తున్నాం. నాతోపాటు, నా దగ్గర పనిచేస్తున్న చాలామందికి ఉపాధి కలుగుతోంది.
– తాటిగొట్ల నాగసేనారెడ్డి, వంటమాస్టర్‌ 

చదువుకుంటూనే వంటకు వెళ్లా
డిగ్రీ ఇటీవలే పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి వంట మాస్టర్లకు సహాయకుడిగా వెళ్లేవాడిని. అలా నాలుగేళ్లు పనిచేశాను. తర్వాత  వంటమాస్టర్‌గా మారి, వివాహాలకు, శుభకార్యాలకు వంట చేస్తున్నా. ఇక్కడ నిలదొక్కుకున్నాక మాకున్న ఎకరా భూమితోపాటు మరో 3 ఎకరాలు గుత్తకు తీసుకుని సాగు చేస్తున్నాను. 
– నాగముని, పట్టభద్రుడు

ఫీజుకు, ఖర్చులకు పనికొచ్చింది
ఎస్‌వీ కాలేజీలో ఈకామ్‌ సెకండియర్‌  చదువుతున్నాను. ఖాళీ దొరికితే మా గ్రామంలోని వంట మాస్టర్లకు సహాయకునిగా వెళుతున్నాను. అలా వచ్చిన డబ్బుతో నా ఫీజులు నేనే కట్టుకుని, నా ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటున్నాను. ఇలా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మంచి వంటమాస్టర్‌ కావాలన్నదే నాప్రయత్నం.. 
– నవనీశ్వర్, విద్యార్థి

ధర లేకే దారి మార్చాను
నాకున్న 2 ఎకరాల పొలం లో ఇటీవలే పత్తిపంట సాగుచేస్తే ధర లేక పూర్తిగా నష్టపోయాను. అందుకే మా గ్రామంలో వంటలు చేసేవాళ్లతో వెళ్లి, నేనూ వంట చేయడం నేర్చుకున్నాను. ఐదేళ్ల నుంచి వంటమాస్టర్‌గా చేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు పది మంది పనిచేస్తున్నారు. 
– ఎన్‌. సుబ్బారెడ్డి, రైతు

చదువుతోపాటు పార్ట్‌ టైమ్‌గా
ఖాజీపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మాగ్రామంలోని వారందరూ వంట మాస్టర్ల కింద పనిచేయడంతోపాటు వడ్డించేందుకు వెళుతుంటారు. నేను కూడా వెళుతున్నాను. పని ఏదైనా సంతోషంగా చేయడం ముఖ్యం. వ్యవసాయం చేస్తూనే, వంట కూడా నేర్చుకున్నాను. 
– నాగేశ్వర్, విద్యార్థి  

మరిన్ని వార్తలు