చదువులమ్మ ఈ కలెక్టరమ్మ | Sakshi
Sakshi News home page

చదువులమ్మ ఈ కలెక్టరమ్మ

Published Fri, May 25 2018 12:13 AM

Chhattisgarh IAS Officer Helps Tribal Kids and Trafficking Victims - Sakshi

ప్రియాంకా శుక్లా లాంటి కలెక్టర్‌లు జిల్లాలో పది కాలాలపాటు కొనసాగితే గ్రామాలు బాగుపడతాయి. గ్రామ స్వరాజ్యం అనే గాంధీజీ కల కూడా నెరవేరుతుంది.

వేసవి సెలవులంటే పిల్లలందరికీ సంతోషమే. కానీ టెన్త్, ట్వెల్త్‌ క్లాస్‌ పిల్లలకు కాదు. పరీక్షలు పూర్తయ్యాయని ఊపిరి పీల్చుకునేంతలో ‘పరీక్షల ఫలితాలు’ అంటూ పేపర్లు, టీవీలు పరిస్థితిని వేడెక్కిస్తాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలైతే... ‘ప్రపంచంలోని ర్యాంకులన్నీ మా సంస్థవే’ అన్నంతగా ప్రకటనలతో ఊదరగొట్టేస్తాయి. అదే సమయంలో ఈ హడావుడి అంతా ఏమీ లేకుండా మరుసటి రోజు పేపర్లలో ‘గవర్నమెంట్‌ స్కూల్లో చదివి 9.5 జీపీఏ తెచ్చుకున్న మట్టిలో మాణిక్యం’ అంటూ చిన్న వార్తలు రెండు మూడు కూడా ఉంటాయి. అలాంటి మాణిక్యాలు మా దగ్గర వందల్లో ఉన్నాయంటున్నారు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాష్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంకా శుక్లా. 

‘అక్షరవాసీ’లను చేశారు!
జాష్‌పూర్‌ జిల్లాలో 143 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 51 పాఠశాలలు ఈ ఏడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. టెన్త్‌ క్లాస్‌లో జిల్లాలో 89 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు, పన్నెండవ తరగతిలో 93 శాతం పాసయ్యారు. ఇది ఆ రాష్ట్రం యావరేజ్‌ పాస్‌ (68, 77 శాతం) కంటే ఎక్కువ. ఇంతమంది మణిపూసలు ఉన్నారంటే ఈ జిల్లాలో విద్యావంతులు ఎక్కువగా ఉండి ఉంటారు అనుకుంటే పూర్తిగా పొరపాటు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కి మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంటుంది జాష్‌పూర్‌ జిల్లా. జిల్లాలో 67 శాతం మంది ఆదివాసీలే. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో నూటికి తొంభై మంది ఆ కుటుంబాల్లో తొలితరం అక్షరాస్యులే. అయినా సరే అద్భుతమైన ఫలితాలను సాధించారు.

పట్టుపట్టి చదివిస్తున్నారు
రెండేళ్ల కిందట ఆ జిల్లాకి కలెక్టర్‌గా ప్రియాంకా శుక్లా వచ్చారు. డాక్టర్‌ కోర్సు చేసి, ఆ తర్వాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అవడం ఆమె జీవితంలో ఒక ట్విస్ట్‌. బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాను సమూలంగా మార్చేయాలని ‘యశస్వీ జాష్‌పూర్‌’ ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టారామె. యశస్వీ జాష్‌పూర్‌ అంటే విజయవంతమైన జాష్‌పూర్‌ అని అర్థం. ప్రధానంగా విద్యావ్యవస్థ మీద ‘మిషన్‌ సంకల్ప్‌’ అనే ప్రోగ్రామ్‌తో దృష్టి పెట్టారామె. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థీ పాస్‌ అవ్వడమనేది ఓ కలగా ఉండేదప్పటికి. అలాంటిది స్కూలు ప్రధానోపాధ్యాయులను, పదవ తరగతి, పన్నెండవ తరగతికి పాఠాలు చెప్పే టీచర్లను సమావేశ పరిచి, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో పాసయ్యి తీరాలని టార్గెట్‌ పెట్టారు ప్రియాంక.

ప్రతి విద్యార్థికీ ఓ వెబ్‌ పేజీ!
‘యశస్వీ’లో భాగంగా జిల్లా విద్యాధికారితో నెలనెలా సమీక్షలు జరుపుతూ.. యూనిట్‌ టెస్ట్, త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షలు... ఇలా ప్రతి పరీక్షల ఫలితాలతో జిల్లా కేంద్రంలో వెబ్‌ పోర్టల్‌ నిర్వహించారు ప్రియాంక. అందులో జిల్లాలోని ప్రతి విద్యార్థికి ఒక పేజీ ఉంటుంది. ఆ విద్యార్థి ఏయే పరీక్షల్లో ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారో ఉంటుంది. ఏయే రోజుల్లో స్కూలుకు రాలేదో ఉంటుంది. అలాగే టీచర్ల హాజరు కూడా. జిల్లా కేంద్రం నుంచే ఈ పర్యవేక్షణ అంతా జరుగుతుంది. ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రతిభ గురించి టీచర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేవారు ప్రియాంక. ఈ రకంగా పాఠాలు చెప్పించి, పరీక్షలకు నలభై రోజుల ముందు ‘మిషన్‌–40’ పేరుతో పునఃశ్చరణ తరగతులను నిర్వహించేలా చూశారు. అంతటి శ్రమకు అందిన ఫలితాలే పైన మనం చెప్పుకున్నవి. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో టెన్త్‌లో టాపర్‌ యజ్ఞేశ్‌ సింగ్‌ చౌహాన్‌ 98.33 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. అతడు జాష్‌పూర్‌ జిల్లా కుర్రాడే. 

భద్రతకు ‘బేటీ జిందాబాద్‌’ 
ఈ దఫా జిల్లాలో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. గ్రామాల పాఠశాలల మీద తానింతగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదేనంటారు ప్రియాంక. ఏ ఆడపిల్ల కూడా తనకు అవకాశాలు లేని కారణంగా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేక మరొకరి మీద ఆధారపడకూడదు. ప్రతి అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడాలి, అలా నిలబడడానికి కావలసిన చదువును వాళ్ల దగ్గరకు చేర్చడానికే
ఇదంతా’ అంటున్నారామె.అంతేకాదు, మహిళల స్వయం స్వావలంబన సాధనకు ‘బేటీ జిందాబాద్‌’ అనే బేకరీ ప్రోగ్రామ్‌ కూడా ప్రారంభించి అక్రమ రవాణా బాధితులకు రక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు ప్రియాంక. వారికి బేకరీ ఉత్పత్తుల తయారీలో శిక్షణనిప్పించి బేకరీ పెట్టుకోవడానికి సహాయం చేస్తున్నారు. ఈ పథకాలు, ప్రయత్నాలన్నీ ప్రియాంక అనుకున్నట్లే అమలైతే చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. జాష్‌పూర్‌లో నూటికి నూరు శాతం విద్యార్థులు పాసవడం అనే ఆమె కల కూడా నెరవేరినట్లే. 
– మంజీర 

Advertisement
Advertisement