పెరుగు... ఎండ విరుగు

2 Jun, 2018 00:51 IST|Sakshi

వెళ్లేదేది ఊరికే వెళ్లదు. ఎండలు వెళ్లే ముందు  చివరి ప్రతాపం చూపబోతున్నాయి. ఆరోగ్యాన్ని హడలగొట్టబోతున్నాయి. భయం లేదు. పెరుగు ఉంది. పెరుగుతో చేసిన పదార్థం ఉంది. పెరుగుట.. ఎండ విరుగుట కొరకే.

దహీ ఆలూ కర్రీ
కావలసినవి: బంగాళ దుంపలు – పావు కేజీ; క్యాప్సికమ్‌ తరుగు – పావు కప్పు; పుల్ల పెరుగు – 100 గ్రా.; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; లవంగాలు – 5; బిరియానీ ఆకు – 3; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; గరం మసాలా – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – గ్లాసుడు; కొత్తిమీర – కొద్దిగా
తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, పెరుగు వేసి చిక్కగా గిలకొట్టాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, జీలకర్ర, లవంగాలు, బిరియానీ ఆకు వేసి కలపాలి  గరం మసాలా, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలిపి నీళ్లు పోసి మరోమారు కలపాలి ∙చిక్కగా చేసుకున్న మజ్జిగ వేసి బాగా కలియబెట్టాలి ∙ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళ దుంప ముక్కలు వేసి కలిపి, చిన్న పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

గుజరాతీ కడీ
కావలసినవి: సెనగ పిండి – రెండు టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు; పుల్ల పెరుగు – 2 కప్పులు; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా మధ్యకు కట్‌ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; పోపు కోసం... నూన – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పెరుగు, నీళ్లు, సెనగ పిండి వేసి చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు గిలకొట్టాలి ∙ఈ మిశ్రమానికి ఉప్పు, పంచదార, పసుపు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి, నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి, మరుగుతున్న కడీలో వేసి బాగా కలిపి, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి ∙అన్నం లేదా కిచిడీలోకి రుచిగా ఉంటుంది.

అవిసె గింజల రైతా
కావలసినవి: అవిసె గింజలు – ఒక టేబుల్‌ స్పూను (నూనె లేకుండా వేయించి పొడి చేసి వాడాలి); సొరకాయ తురుము – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – అర కప్పు; జీలకర్ర పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు

తయారీ:  ∙ఒక పాత్రలో నీళ్లు, సొరకాయ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి నాలుగు నిముషాలు ఉడికించి దించేయాలి. ∙ఒక పెద్ద పాత్రలో మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి, ఉడికించుకున్న సొరకాయ తురుము జత చేసి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి.

క్యారెట్‌ పెరుగు కట్‌లెట్‌
కావలసినవి:  కోడిగుడ్లు – 4 (బ్లెండర్‌లో వేసి గిలకొట్టాలి) క్యారెట్లు – 8 (మీడియం సైజువి, తొక్క తీసి తురమాలి) కొత్తిమీర తరుగు – పావు కప్పుసెనగ పిండి – పావు కప్పుఉప్పు – తగినంతమిరియాల పొడి – కొద్దిగాఆలివ్‌ ఆయిల్‌ – 3 టేబుల్‌ స్పూన్లుగట్టి పెరుగు – ఒక కప్పునిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూనుఉప్పు – కొద్దిగా

తయారీ:
∙ఒక పాత్రలో గిలకొట్టిన కోడిగుడ్డు సొన, క్యారట్‌ తురుము, కొత్తిమీర తరుగు, సెనగపిండి వేసి గరిటె జారుగా కలపాలి.
∙స్టౌ మీద పాన్‌ ఉంచి వేడయ్యాక, రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ వేసి పాన్‌ అంతా పట్టేలా గరిటెతో పరవాలి.
∙అర కప్పు క్యారట్‌ మిశ్రమాన్ని పెనం మీద పాన్‌ కేక్‌ మాదిరిగా మందంగా సరిచేయాలి.
∙బాగా కాలి బంగారు రంగులోకి వచ్చే వరకు సుమారు మూడు నిమిషాలు ముందుకు వెనుకకు తిప్పి ప్లేటులోకి తీసుకోవాలి.
∙ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టి, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలిపి, నిమ్మ రసం జత చేయాలి.
∙చిన్న బాణలిలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి, పెరుగులో వేయాలి.
∙తయారుచేసి ఉంచుకున్న క్యారెట్‌ పాన్‌కేక్‌లను ప్లేట్‌లో ఉంచి, అందించే ముందు తయారుచేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని పాన్‌కేక్‌ల మీద వేసి అందించాలి.

పెరుగు స్మూతీ
కావలసినవి: పెరుగు – ఒక కప్పు; అరటి పండు – ఒకటి; ఏలకుల పొడి – చిటికెడు ; పంచదార – మూడు టీ స్పూన్లు; కుంకుమ పువ్వు – చిటికెడు; జీడిపప్పు పలుకులు – తగినన్ని
తయారీ:  ∙ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ∙పంచదార, పెరుగు జత చేసి మరోమారు మిక్సీ పట్టి. గ్లాసులోకి తీసుకుని ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచి తీసేయాలి. ∙కుంకుమ పువ్వు, జీడిపప్పు పలుకులు జత చేసి చల్లగా అందించాలి.

పెరుగు – ప్రయోజనాలు
పాలను బాగా కాచి, చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు, కొంచెం చిక్కని మజ్జిగను కలిపి (తోడు వేసి), నాలుగైదు గంటల పాటు కదపకుండా ఉంచితే అది పెరుగుగా మారుతుంది. వాస్తవానికి పాలు శరీరానికి చలవ (శీత వీర్యం) చేస్తాయి. కాని పెరుగు (దధి) వేడి (ఉష్ణవీర్యం) చేస్తుంది. ఆవు, గేదె, మేకల పాలు మనకి సాధారణంగా లభిస్తుంటాయి. దాదాపు అన్ని జంతువుల పాలూ శీత వీర్యమే. ఒక్క... గుర్రం, గొర్రె పాలు మాత్రం ఉష్ణ వీర్యం. రుచిని బట్టి పెరుగును ఐదు రకాలుగా విభజించింది ఆయుర్వేదం... 1. మందం: పూర్తిగా తోడుకునే ముందు కొంచెం చప్పగా తియ్యగా ఉంటుంది. 2. స్వాదు: పూర్తిగా తోడుకొని తియ్యగా ఉంటుంది. 3. స్వాద్యమ్లం: కించిత్‌ పులుపు కలిగి తోడుకుంటుంది. 4. ఆమ్లం: పుల్లగా తోడుకుంటుంది. 5. అత్యమ్లం: పులుపు అధికంగా ఉంటుంది.

గుణకర్మలు: ‘మందం’ మలమూత్రాలను సాఫీ చేస్తుంది. కాని శరీరానికి వేడి చేస్తుంది. ‘స్వాదు’ స్రోతస్సులతో అవరోధం కలుగచేస్తుంది. (దీనికి ‘అభిష్యంది’ అని పేరు). రక్తస్రావాన్ని అరికడుతుంది. శుక్రవర్ధకమై శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. కఫాన్ని, కొవ్వు (మేదస్సు) ను పెంచుతుంది. బలకరమై నరాలకు శక్తినిస్తుంది. పెరుగు రుచి పులుపుగా మారుతున్నకొద్దీ‘అగ్నిదీప్తి’ (ఆకలి) ని పెంచుతుంది. కాని పిత్త ప్రకోపాన్ని చేస్తుంది. అంటే కంఠం, కళ్లు మండటం, పళ్లు లాగటం, రక్తవికారం కలిగి రక్తస్రావం అధికం అవుతుంది.

ఆవు పెరుగు గుణాలు:
గవ్యం దధి విశేషేణ స్వాద్యమ్లంచ రుచిప్రదంపవిత్రం దీపనం హృద్యం పుష్టికృత్, పవనాపహం‘‘ఉక్తం దధ్నామ శేషాణాం మధ్యే గవ్యం గుణాధికం ‘‘(భావప్రకాశ సంహితా)కొంచెం పులుపు, ఎక్కువ తీపి కలిగిన రుచితో ఉండి, ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి గుండెకు కూడా శక్తిని ఇస్తుంది. నాడీ వ్యవస్థను పటిష్ఠ పరుస్తుంది. (వాతహరం) అందువల్ల∙ఇది చాలా ‘పవిత్ర’మని చెప్పబడింది.
గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన దీనిని బరువైన ఆహారంగా చెప్పారు. శుక్రవర్థకం, కఫకరం, అభిష్యంది, రక్తాన్ని దూషిస్తుంది.
మేక పెరుగు: అజం దధి ఉత్తమం గ్రాహీ లఘు దోష త్రయాపహ‘శశ్యతే శ్వాసకాసార్శః క్షయకార్మ్యేషు దీపనం‘‘ఇది శరీరానికి చాలా మంచిది. తేలికగా జీర్ణం అవుతుంది. నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. ఆకలిని పెంచి కృశత్వాన్ని తగ్గించడం ద్వారా కావలసిన బరువును పెంచుతుంది. త్రిదోష హరం. దగ్గు, ఆయాసం, పైల్స్‌ (మూల శంక), క్షయ రోగాలను తగ్గించడానికి దోహదపడుతుంది.1. పాల మీద మీగడను తొలగించి లభించే ద్రవాన్ని సంస్కృతంలో ‘మస్తు’ అంటారు. ఇది నీరసాన్ని తగ్గిస్తుంది. లఘువు, బలకరం, రుచికరం. దాహాన్ని పోగొడుతుంది. పంచేంద్రియాలకు ప్రసన్నత కలిగిస్తుంది. మృదు విరేచనకరం. బరువును కూడా తగ్గిస్తుంది. 

పెరుగును సేవించడానికి నిషేధ కాలం...
రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). ఒకవేళ తినాలనుకుంటే కొద్దిగా నెయ్యి కాని, పంచదార కాని కలిపి తినాలి. పెరుగును వేడి చేసి తినకూడదు. శరత్, వసంత, గ్రీష్మ ఋతువులలో పెరుగును ఎక్కువగా తినకూడదు. చాలా కొద్దిగా తినొచ్చు. మజ్జిగ (తక్రం) ఎక్కువగా తీసుకోవచ్చు.

ఎక్కువగా తీసుకోవడం వలన అనర్థాలు:
పైన చెప్పిన గుణధర్మాలను విడిచిపెట్టి, క్రమశిక్షణ రహితంగా పెరుగును అతిగా సేవిస్తే, ‘జ్వరం, చర్మరోగాలు, రక్తస్రావం, తల తిరగడం (భ్రమ), రక్తహీనత (పాండు రోగం), కామలా (పచ్చ కామెర్లు) మధుమేహం వ్యాధులకు దారితీయొచ్చు.
– డా. వృద్ధుల లక్ష్మీ నరసింహశాస్త్రి,
ఆయుర్వేద వైద్య నిపుణులు

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకు లకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు.
నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌.  mail : familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. 
మా చిరునామా :  సాక్షి వంటలు,  సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్‌–34.  

మరిన్ని వార్తలు