నువ్వు చేసే పనిలో నైపుణ్యమే యోగ

21 Jun, 2018 00:12 IST|Sakshi

యోగాను మనకు అందించిన పతంజలి మహర్షి, భగవద్గీతలో శ్రీకృష్ణుడుకూడా ‘యోగః కర్మసు కౌశలమ్‌’ (నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగ)  అంటారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు.


యోగా వలన కలిగే లాభాలు అనేక విధాలుగా ఉంటాయి. మొట్టమొదటి లాభం యోగా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన లేని జీవితాన్ని గడపటానికి మార్గాలను, విధానాలను యోగా మనకు చూపుతుంది. యోగా మానవాళికి లభించిన అత్యుత్తమమైన సంపద. సంపద అంటే ఏమిటి? మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేదే సంపద. ఈ దృష్టితో చూసినప్పుడు యోగా మనకు పూర్ణ సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి యోగా మానవాళికి సంపద. హింస లేని సమాజం, అనారోగ్యం లేని శరీరం, విచలితం కాని మనస్సు, సందేహాలు లేని బుద్ధి, గాయాలు లేని చిత్తం, బాధలు లేని ఆత్మ – ఇవన్నీ ప్రతి వ్యక్తికీ జన్మహక్కులు. మానవుని జీవితపు పరమార్థమైన ఈ లక్ష్యాన్ని, ఆనందాన్ని అందుకోవటానికే మన ప్రయత్నాలన్నీ. వాటిల్లో యోగా ఒక మార్గం.

పుట్టుకతోనే మనం యోగులం
యోగా అంటే శారీరకమైన వ్యాయామాలు వేయటం అని మనం అనుకుంటాం. 1980, 90లలో నేను ఐరోపా దేశాలలో పర్యటించినప్పుడు అక్కడి ప్రధాన సామాజిక వర్గాలలో యోగాను అంగీకరించేవారు కాదు. నేడు ఆ పరిస్థితి మారి, ప్రజలు యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించటం చూస్తే నాకు ఆనందంగా ఉంది. ప్రపంచమంతటా విశ్రాంతికి, ఆనందానికి, సృజనాత్మకమైన బుద్ధికి యోగా పర్యాయపదంగా మారింది. పేరొందిన వ్యాపార సంస్థలు తమ వాణిజ్య ప్రకటనలలో యోగాసనాలు వేస్తున్న లేదా ధ్యానం చేస్తున్న చిత్రాలను చూపిస్తున్నారు. తద్వారా మానసిక ప్రశాంతతను సూచిస్తున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, మనం అందరమూ యోగులుగానే పుట్టాం.

శిశువు కూడా యోగా టీచరే!
చిన్నారి శిశువును గమనిస్తే మీకు వేరే యోగా టీచర్‌ అక్కర్లేదు. ప్రపంచంలో 3 నెలల నుండి 3 సంవత్సరాల వయసు ఉన్న ఏ శిశువైనా సరే అన్ని యోగాసనాలూ వేస్తుంది. వారు శ్వాసించే విధానం, నిద్రించే విధానం, నవ్వే తీరు ప్రతిదీ యోగానే. చిన్నారి ఒక యోగా గురువు, యోగి. అలా ఉండటం వల్లనే చిన్నారి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అక్కడ ఆనందం ఉంటుంది. చిన్నారి శిశువు రోజుకు 400 సార్లు చిరునవ్వులు చిందిస్తుంది. యోగా వలన మరొక ముఖ్య ప్రయోజనం ఏమంటే అది మనిషి ప్రవర్తనలో మార్పును తెస్తుంది. ఎందుకంటే మనిషికి గల ఒత్తిడిపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒత్తిడిని తొలగించి వేయటం ద్వారా యోగా ప్రజలలో సుహృద్భావనను, చక్కని వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనః ప్రకంపనలను పెంపొందించటంలో యోగా సహాయపడుతుంది.

బాగా గ్రహిస్తే బాగా చెప్పగలం
మాట్లాడటం కంటే మన స్థితి ద్వారా, ప్రకంపనల ద్వారా ఎక్కువ తెలియజేయగలుగుతాం. ఆధునిక భౌతిక శాస్త్రమైన క్వాంటమ్‌ ఫిజిక్స్‌ పరిభాషలో చెప్పాలంటే మనం అందరమూ ప్రకంపనలను వివిధ పౌనఃపున్యాలలో వెలువరిస్తూ ఉంటాం. ఎవరితోనైనా మనకు మాటలు సరిపడకపోతే ‘మా వేవ్‌ లెంగ్త్‌ సరిపోవటం లేదు’ అనటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఎంత బాగా విషయాన్ని అవతలివారికి చెబుతున్నామనేది మనం అవతలివారి నుండి విషయాన్ని ఎంత బాగా గ్రహిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే యోగా, మన బుద్ధిని స్వచ్ఛంగా ఉంచి, విషయాల్ని సరిగ్గా గ్రహించటంలో తోడ్పడుతుంది. అంతేకాక యోగా మన వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించటంలో సహాయపడుతుంది. యోగాను మనకు అందించిన పతంజలి మహర్షి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ‘యోగః కర్మసు కౌశలమ్‌’ (నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగ) అంటారు.

భిన్న దృక్పథాల సమన్వయం
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు. నీవు ఉన్న పరిస్థితులలో ఎంత బాగా నీ భావాలను వ్యక్తీకరిస్తావు, ఎంత నైపుణ్యంగా వ్యవహరిస్తావు అనేదే యోగా. నవీన కల్పనలు, సద్యఃస్ఫూర్తి, సృజనాత్మకమైన భావవ్యక్తీకరణ.. ఈ మూడూ యోగా వలన కలిగే అదనపు ఫలితాలు. యోగాతో ఇవి మనకు సహజంగా లభిస్తాయి. యోగా ఎల్లప్పుడూ భిన్న దృక్పథాల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తుంది. యోగా అంటే కలయిక అని అర్థం. అనేక విధాలుగా ప్రవర్తిల్లే జీవితపు స్థితిగతులను సమైక్యపరచటమే యోగా. మనం ఏ మతాచారాలను పాటిస్తున్నా, ఏ ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నా సరే, వాటికి అతీతంగా ప్రతి ఒక్కరం కోరుకునేది నవ్వుతూ ఆనందంగా ఉండాలనే కదా. విషాదానికి మూలకారణం ఏమిటో తెలుసుకున్నప్పుడే ఆనందం మనకు లభించగలదు. విశాల దృక్పథం లేకపోవటం, ఒత్తిడి, ఆందోళన.. ఇవి విషాదానికి కారణాలు. 

జాతీయ స్థూల ఆనందం
ఐరోపా సమాఖ్యలో కొంతకాలంగా జి.డి.హెచ్‌ (స్థూల జాతీయ ఆనందం) గురించి మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి నుండి స్థూల జాతీయ ఆనందం వైపు పయనిస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు అద్భుతంగా ఉపయోగపడే పనిముట్టు మన చేతిలో ఇప్పుడు ఉంది. నేడు జనాభాలో అత్యధికులు మానసికమైన కుంగుబాటుతో బాధపడుతున్నారు. మందులు వేసుకోవటం ఒక్కటే దానికి జవాబు కాదు. మనలో ఉత్సాహాన్ని పెంచి ఆనందాన్ని ఇవ్వటానికి ఒక సహజమైన విధానం.. మనం గాలి పీల్చేటంత సహజమైనది కావాలి. అటువంటి ఆనందం కోసమే ప్రతి ఒక్కరూ వెతికేది. ఒత్తిడులు, ఆందోళనలు, రోజువారీ జీవితంలో మనకెదురయ్యే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ ముఖంలో చిరునవ్వులు పూయించటమే యోగా ముఖ్య ఉద్దేశం. 
∙శ్రీశ్రీ రవిశంకర్‌
 

మరిన్ని వార్తలు