రంగు పొర

12 Dec, 2016 14:47 IST|Sakshi
రంగు పొర

చూపుకు రంగుంటుంది. నలుపు.. తెలుపు.. ఎరుపు.. నీలం. చూపుకు రంగేంటి?!
తెలుపంటే... పవిత్రం. నలుపంటే... మలినం. ఎరుపంటే... విప్లవం. నీలం అంటే... ఆకాశమంత.

మగవాడి చూపులో కూడా ఇన్ని రంగులు ఉంటాయి!
రంగులను బట్టి కూడా మగవాడి చూపు ఉంటుంది!!
ఆ రంగుల్లో కొన్ని... ‘పొర’ల్లా  పరుచుకుంటాయి. ఆ పొరలు విడిపోవాలి.
నోరు మంచిదైతే... ఊరు మంచిదవుతుంది.
కన్ను మంచిదైతే... కాపురం బాగుంటుంది.

 

తొలిరాత్రి ముగిసింది..
‘రజనీ! ప్లీజ్ ఆ చీర మార్చుకొని హాయిగా నైటీ వేసుకోవచ్చు కదా!’
అప్పటికి అయిదోసారి బతిమాలుతున్నాడు నవీన్.
‘అరే.. నేను చీరలో ఉండడం వల్ల నీకేంటి ఇబ్బంది? ఎందుకంత ఫీలవుతున్నావ్ నవీన్?’ భర్త ప్రవర్తన వింత
అనిపించడంతో ఆశ్చర్యంగా అడిగింది రజని.
‘నాకేం ఇబ్బంది. ఆ తెల్ల చీరతో నువ్వే ఇబ్బంది పడ్తున్నావేమో.. నైట్‌వేర్‌లో అయితే ఫ్రీగా ఉంటావ్ కదా అని అంతే..’ అన్నాడు భుజాలెగరేస్తూ!
తన మాట కాదని నొప్పించడమెందుకని ‘సరేలే.. మార్చుకుంటా’ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది రజని.
రజని ఇలా గదిలోకి రాగానే నవీన్ అలా వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నవ్వుకుంది ఆమె.
అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు పాలిపోయిన మొహంతో. తేడా గమనించింది.
‘స్టమక్ అప్‌సెట్ ఏమో’ అనుకొని ఊరుకుంది. తన చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రజని చెప్పింది యాంత్రికంగా విన్నాడే కాని అతని మనసు మనసులో లేదు. నిద్రపోయిన భార్య మొహాన్ని తదేకంగా చూస్తున్నాడు. ‘ఎంత అమాయకంగా కనపడుతోంది.. నన్ను మోసం చేస్తోందా? తాను నిజంగానే మోసపోయాడా? అందుకే ఫస్ట్‌నైట్ అంత స్మూత్‌గా జరిగిపోయిందా? గాడ్.. అయితే బ్యాచ్‌లర్స్ పార్టీ రోజు తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నిజమేనా? నిజమే..’
నవీన్‌కి తలలో బాంబు పేలినట్టయింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎలా అడగాలి? ఏమని మొదలుపెట్టాలి? ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది.

మరుసటి రోజు..
రజని చాలా క్యాజువల్‌గా... హ్యాపీగా కనపడుతోంది. రొమాంటిక్ జోక్స్ వేస్తూ ఉడికిస్తోంది. ‘ఏమీ తెలీనట్టు ఎంతలా నటిస్తోంది? రెండోరాత్రికే ఈ కవ్వింపు జోక్స్‌ఏంటో.. ఆ ఎక్స్‌పీరియెన్స్ అంతకు ముందు లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయ్? జాణ.. ’ కసిగా అనుకున్నాడు నవీన్ మనసులో.అనుమానం అతణ్ణి మనిషిలా ఉండనివ్వట్లేదు. ఉచ్చనీచాలు మరిచేలా చేస్తోంది. చేసింది. ఆ రాత్రే ఆమెకు టార్చర్ మొదలుపెట్టింది అతని మైండ్‌లో తిష్ఠ వేసి.

 ‘ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?’ అద్భుతంగా నటించాడు.
 ‘మా మేనత్త పెట్టిన చీర. రెండో రాత్రి కట్టుకోమని చెప్పింది’ సిగ్గుపడుతూ.
 ‘నేనొకటి అడగనా?’ అన్నాడు.
 ‘ఊ.. అడుగు’ గారంగా అన్నది.
 ‘కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చదివావ్ కదా..’ ఆగాడు.
 ‘అవును..పీజీ కూడా కో-ఎడ్డే. క్లాస్‌మేట్స్ అందరం కలిసి గోవా టూర్ కూడా వెళ్లామని చెప్పాను కదా. ఫోటోలు కూడా చూశారు కదా. వండర్‌ఫుల్‌డేస్.. భలే ఎంజాయ్ చేసేవాళ్లం.’ ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లింది రజని.
 ‘అదే.... ఆ టైమ్‌లో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉ...న్నా..’ రజని కళ్లల్లోకి చూస్తూ ఆగాడు.

చాలా మామూలుగా.. హాయిగా నవ్వింది రజని. ‘మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా నాకు బాయ్‌ఫ్రెండ్సే..’ నవ్వుతూనే అనేసి బాల్కనీలోకి వెళ్లిపోయింది.
తనకు కావాల్సిన సమాధానం కాదు అది. కొంపదీసి తన మనసులో ఉన్నది అర్థమైందా ఏంటీ ఆమెకు. అర్థంకానీ.. అసలు విషయం బయటపడుతుంది అనుకున్నాడు. బాల్కనీలో ఉన్న రజని కళ్లల్లో సన్నటి నీటి పొర.
ఆ సంఘర్షణ, అనుమానాలతో నాలుగు రోజులకే హానీమూన్ ట్రిప్ ముగించుకొని ముభావంగా ఇంటికి బయలుదేరింది ఆ జంట.

మూడు నెలలు గడిచాయి...
ఇంట్లో వాతావరణాన్ని, తమ మధ్య కమ్యూనికేషన్‌ను నార్మల్‌గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తోంది రజని. కానీ కుదరనివ్వట్లేదు నవీన్. ఆమె ప్రతి కదలికను అనుమానంగానే చూస్తున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ ఇవ్వబోతుంటే మొహం తిప్పుకొని వెళ్లిపోతాడు. లేదంటే ఆమె వ్యక్తిగతానికి సంబంధించి ఆరా తీస్తాడు. ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. అవి ఎంతలా శ్రుతిమించాయంటే కాలేజ్ డేస్‌లో ఆమె ప్రవర్తన గురించి ఎంక్వయిరీ చేసేంతనగా. ఆమె ఫ్రెండ్స్‌కే ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి కూపీ లాగుతున్నాడు. అయినా సహిస్తోంది. పెళ్లికి ముందు తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనీ... తనకెవరితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్స్ లేవనీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బతిమాలుతోంది. సంసారాన్ని నరకం చేయొద్దని ప్రాథేయపడింది. చివరకు అతని అనుమానం పోవడానికి ఏం చేయమన్నా చేస్తానంది. ‘అయితే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం.. రా’ అన్నాడు స్థిరంగా.

ఆ మాటకు షాక్ అయింది రజని. కోపం, అసహ్యం, బాధ, తన మీద తనకు జాలి.. కలిగాయి. గుండె పగిలేంత దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకొని ‘వెళదాం పద’ అంది.

అయితే...
పరీక్ష చేయడానికి డాక్టర్ ససేమిరా అంది. పైగా నవీన్‌ను చెడామడా తిట్టింది. అమ్మాయికి పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్ లేదు అనడానికి మొదటి రాత్రి రక్తస్రావం కావడం ఏ రకంగా ప్రామాణికం అని నిలదీసింది. చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇదేనా? అంటూ గడ్డిపెట్టింది. హైమన్ (కన్నెపొర) ఎంత సున్నితంగా ఉంటుందో? ఏయే సందర్భాల్లో చిరిగిపోయే అవకాశాలుంటాయో వివరించింది. భార్యాభర్తల దాంపత్యానికి నమ్మకం పునాది.. అనుబంధానికి అండర్‌స్టాండింగ్ ఉండాలి అంటూ క్లాస్ తీసుకొని పంపించింది.

ఇంటికొచ్చాక...
గదిలోకి వెళ్లిపోయి.. సూట్‌కేస్‌తో బయటకు వచ్చింది రజని. హతాశుడయ్యాడు నవీన్. ‘ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావ్ రజనీ?’ ఈసారి నవీన్ షాక్ అయ్యాడు. ‘నీ అనుమానంతో నేనింకా అవమానపడదల్చుకోలేదు. నీకు తెలియని ఇంకో విషయం... స్కూల్ డేస్ నుంచి కూడా నేను సైక్లింగ్ చాంపియన్‌ని’అంటూ బయటకు నడిచింది రజని.

నేపథ్యం
రజని, నవీన్... ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఆమె ఎంబీఏ. అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. చక్కటి ఈడూజోడు.. అన్ని విధాలా తగిన సంబంధం అని రెండు కుటుంబాల వాళ్లూ అనుకొని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికి ముందు బ్యాచ్‌లర్స్ పార్టీలో తన భార్య గురించి, తన అత్తగారింటి వైభోగం గురించి చెబుతూ నవీన్ మురిసిపోతుంటే అసూయపడ్డ అతని స్నేహితుడొకడు.. ‘ఒరేయ్.. అంత సోషల్‌మూవింగ్ ఉన్న అమ్మాయి పెళ్లికి ముందే అన్ని చేసుంటుంది జాగ్రత్తరోయ్’ అని కూశాడు. ‘ఎలా తెలుస్తుందిరా’ అని అడిగాడు అమాయకంగా. వాడు చెప్పాడు. అందుకే ఫస్ట్‌నైట్ అయ్యాక వాష్‌రూమ్‌లోకి వెళ్లి చీర చూశాడు నవీన్. రజని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. జీవనసహచరిని దూరం చేసుకున్నాడు.
 
అదో పెద్ద మూఢనమ్మకం!
మన సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకం... మొదటి రాత్రి తెల్లచీర ధరించాలని, మరునాడు దాన్ని పరీక్షించాలని, మరక ఉంటే ఆమె వర్జిన్ అనీ, లేకుంటే కాదని! నేటికీ చాలామంది మగవాళ్ల మెదళ్లను తొలుస్తున్న పురుగు ఇది. ప్రతిదానికీ సైన్స్ రీజన్ చెప్తున్నా అర్థం కావట్లేదు.. చేసుకోవట్లేదు. నవీన్ ఇందుకు అతీతుడేం కాదు. నవీన్ చేసిన పని మెంటల్ క్రూయల్టీ. హిందూ వివాహచట్టం ప్రకారం భార్య శీలాన్ని శంకించడం, ఆమె శీలవతి కాదని ప్రచారం చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం వంటివన్నీ మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఐపీసీ 498ఏ కింద కేస్ కూడా నమోదు చేయవచ్చు.- ఇ.పార్వతి, అడ్వకేట్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌

- సరస్వతి రమ

మరిన్ని వార్తలు