కొత్తమ్మాయి!

16 Sep, 2018 23:33 IST|Sakshi

ఆర్షి బెనర్జీ

కెనడాలో పది రోజులపాటు జరిగిన ‘టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ నిన్నటితో ముగిసింది. ‘స్పెషల్‌ ప్రెజెంటేషన్స్‌’ సెక్షన్‌ కింద ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అవకాశం పొందిన ఫ్రెంచి సినిమా.. ‘మాయ’లో ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్‌ అమ్మాయి ఆర్షి బెనర్జీ కెరీర్‌కు ఆ ముగింపు ఒక ప్రారంభాన్ని ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఆర్షి నటనకు అంతగా అభినందనలు లభించాయి!

ఆర్షి బెనర్జీ : ఈ యువ మోడల్‌కు అనుకోకుండా ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించే అవకాశం చేజిక్కింది. అది కాస్తా టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవ ఎర్ర తివాచీపై నడిచేలా చేయడం ఆమెను మరింత ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది.

మోడలింగ్‌ ఏజెన్సీ ‘ఇనేగా’ 19 ఏళ్ల  మోడల్‌ ఆర్షి బెనర్జీని ఓ ఫ్రెంచ్‌ సినిమా ఆడిషన్‌కు రాగలరా అంటూ ఆహ్వానించినపుడు ఆమె పెద్దగా  ఆశలు పెట్టుకోలేదు. అయితే ఆడిషన్‌ పాసైన ఆమెకు ఏకంగా టైటిల్‌ రోలే లభించడంతో ఆనందంతో తబ్బిబ్బు అయ్యింది. తను నటించిన ఆ  రొమాంటిక్‌ డ్రామా.. ‘మాయ’ టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితం అవుతుందనైతే ఆమె ఏమాత్రం ఊహించలేదు. ‘మాయ’ ఫ్రెంచి చిత్రం. మియా హన్సెస్‌ లవ్‌ ఆ చిత్ర దర్శకురాలు. ఆర్షి బెనర్జీ ఇండియా అమ్మాయి.

కమ్మని కబురొచ్చింది!
30 ఏళ్ల ఫ్రెంచ్‌ వ్యక్తికి, టీనేజీ గోవా అమ్మాయి మధ్య సాగే ప్రేమాయణం చుట్టూ తిరిగే ఫ్రెంచ్‌–ఇంగ్లిష్‌ సినిమా ‘మాయ’. ఈ చిత్రంలోని పాత్ర కోసం 16–18 ఏళ్ల లోపు ఇండియన్‌ అమ్మాయి కోసం అన్వేషణ సాగింది. ఆ సినిమాకు కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న నందిని శ్రీకాంత్‌ ప్రయత్నాలు ఆర్షిని కలుసుకోవడంతో ముగిశాయి. ఆర్షి ఆడిషన్‌కు వెళ్లొచ్చింది. ఆ తర్వాత జలుబు బారిన పడి తన అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆర్షికి నందిని నుంచి ఫోన్‌ వచ్చింది.

డైరెక్టర్‌ హన్సెన్‌  దాదాపు 200 మందికి పైగా ఆడిషన్‌ టేపులను పరిశీలించాక ఆర్షిని కలుసుకునేందుకు మాత్రమే ఉత్సాహం కనబరుస్తున్నారన్నది కబురు.  సినిమా ఆడిషన్‌లో పాల్గొన్న అనుభవం లేకపోవడంతో ఆర్షి మొదట  కొంత నెర్వస్‌గా ఫీలైంది. రచయిత, దర్శకురాలు అయిన హన్సెస్‌ చిత్రాలేవి ఆర్షి అంతకు ముందు చూసి ఉండకపోవడంతో ఆమె తీసిన సినిమాల గురించి తెలుసుకుంది. వాటిలో ‘థింగ్స్‌ టు కమ్‌ (2011), ‘గుడ్‌బై ఫస్ట్‌ లవ్‌’ (2016) సినిమాలు ఆర్షికి నచ్చాయి.  

అమ్మ నుంచి ఇన్‌స్పిరేషన్‌
నటి, టెక్స్‌టైల్‌ డిజైనర్‌గా పేరుతెచ్చుకున్న తన తల్లి  రతులా బెనర్జీ అడుగుజాడల్లోనే ఆర్షి ముందుకు సాగింది. ఆర్షి ముంబైలోని ర్యాన్‌ గ్లోబల్‌ స్కూల్లో చదువుకుంది. క్లాస్‌లోనే పొడగరి కావడంతో స్కూల్‌లో వేసే నాటకాల్లో ఆమెకు టీచర్, నాయనమ్మ వంటి  పాత్రలే ఇచ్చేవారు. ఒక దశలో కాస్మటిక్‌ సర్జన్‌ కావాలని కోరుకున్నా.. సినిమాలే ఆమెకు లోలోపలి ‘ప్యాషన్‌’. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టి, ముందుగా స్టిల్‌ కెమెరా ముందు తన ప్రతిభ చాటుకుంది ఆర్షి. ‘మాయ’ ఫిల్మ్‌లో పాత్ర కోసం కొంకణి భాష నేర్చుకుంది. ఇది తన పాత్రకు మరింత దగ్గరయ్యేలా చేసింది.

మొత్తం మహిళా నేతృత్వం!
కథలో.. తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్న ఫ్రెంచ్‌ వ్యక్తితో ఈ అమ్మాయి ప్రేమలో పడుతుంది. అతడి పేరు గాబ్రియల్‌. వార్‌ రిపోర్టర్‌. సిరియాకు బందీగా ఉండి ఎలాగో ఇండియా వస్తాడు. అక్కడ ఆర్షికి పరిచయం అవుతాడు. మాయ (ఆర్షి బెనర్జీ) అతడిని ప్రేమిస్తుంది. ఇలాంటి థీమ్‌తో కథ నడిపించడానికి కథన కౌశలం కావాలి. హీరో, హీరోయిన్‌ సన్నిహితంగా కనిపించే సన్నివేశాలను కూడా దర్శకురాలు  గొప్పగా, కళాత్మకంగా చిత్రీకరించడాన్ని చూసి ఆర్షితో పాటు ఆమె తల్లి రతులా కూడా థ్రిల్‌ ఫీల్‌ అయ్యారు.  డైరెక్టర్‌ మియా హన్సెస్‌ ఈ పాత్రను అందంగా మలిచారని, ఎక్కడా తప్పుడు అభిప్రాయాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని రతులా.. హన్సెస్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ చిత్రంలోని వివిధ విభాగాలకు మహిళలే నేతృత్వం వహించడంతో  ప్రతీరోజు ఏడెనిమిది గంటలు మాత్రమే ఈ బృందం పనిచేసింది. అందులోనూ వారాంతపు సెలవులు ఎంజాయ్‌ చేశారు. ప్రతిష్టాత్మక టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ ఆర్షి నటనకు తగిన గుర్తింపు లభించడంతో.. ఫ్రెంచ్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌ ఫిల్మ్స్‌లోనూ అవకాశం వస్తుందని నమ్ముతున్నారు ఆర్షి అండ్‌ టీమ్‌. ఇక.. ధర్మ లేదా యాష్‌రాజ్‌ నిర్మాణసంస్థలో నటించే  అవకాశం లభిస్తే తన కంటే అదృష్టవంతురాలు ఎవరుంటారని నవ్వుతూ అంటోంది ఆర్షి బెనర్జీ.  

– కె.రాహుల్‌

మరిన్ని వార్తలు