కోలుకున్న కోవిడ్‌ విజేతా... వెల్‌కమ్‌ బ్యాక్‌

23 Apr, 2020 04:41 IST|Sakshi

స్వాగతం అందరూ చెబుతారు. పున:స్వాగతం చెప్పడమే అసలైన గొప్పతనం. అంటువ్యాధికి తనామనా భేదం లేదు. మన తప్పు లేకపోయినా అది బాధిస్తుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు విజేతలు. వారి పట్ల ఆదరంగా ఉండాలి మనం. పలకరించి ధైర్యం చెప్పాలి మనం. భౌతిక దూరమే తప్ప మానసిక దూరం లేదని చెప్పాలి మనం. అందుకే ఇప్పుడు అవసరమైన మాట... ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’.

రాత్రి పదిన్నర అయి ఉంటుంది. సైకియాట్రిస్ట్‌ సెల్‌ మోగింది. ఆ టైమ్‌లో పేషెంట్స్‌ సాధారణంగా ఫోన్‌ చేయరు.. ఎంతో అవసరమైతే తప్ప. ‘హలో’అన్నాడు సైకియాట్రిస్ట్‌.
అవతలి వైపు నుంచి మెల్లగా ఏడుపు వినిపిస్తూ ఉంది. ఇలా కొంతమంది స్త్రీలు వొత్తిడి తట్టుకోలేక ఫోన్‌ చేసి ఏడుస్తుంటారు. ఇక్కడ ఏడుస్తున్నది స్త్రీ కాదు. పురుషుడు. ‘ఎవరు?’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. అవతలివైపు నుంచి కొద్దిగా గొంతు పెగిలించుకునే ప్రయత్నం. ‘డాక్టర్‌... నా జీవితం ఎప్పటికైనా బాగుపడుతుందంటారా?’ ప్రశ్న చిన్నదే. దాని వెనుక ఉన్న సమస్య చాలా పెద్దది.

శరత్‌ కుమార్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌. 45 ఏళ్లుంటాయి. కంపెనీలో పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు. ఆఫీస్‌ పని మీద అమెరికా వెళ్లి వస్తుంటాడు. జనవరిలో అలాగే పని మీద వెళ్లాడు. మార్చి 16న అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. అప్పటికే కోవిడ్‌ గురించిన పరీక్షలు, నివారణ చర్యలు మొదలై ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ సమయానికి శరత్‌ కుమార్‌లో ఎటువంటి లక్షణాలు లేవు. అధికారులు హోమ్‌ క్వారంటైన్‌ నిబంధన పెట్టి ఇంటికి పంపించారు. మాదాపూర్‌లో ఉన్న ఫ్లాట్‌లో శరత్‌ కుమార్‌ తన గదిలో ఉండిపోయాడు. ఆయనకు భార్య,  కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు బి.టెక్‌ సెకండ్‌ ఇయర్‌... కూతురు సీనియర్‌ ఇంటర్‌. ముగ్గురూ శరత్‌ కుమార్‌ హోమ్‌ క్వారంటైన్‌ శ్రద్ధగా జరిగే జాగ్రత్తలు తీసుకున్నారు.

శరత్‌ తన గదిలో ఉంటూ ఫ్రెండ్స్‌తో ఫోన్లు మాట్లాడటం, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండటం, వాట్సాప్‌ చాటింగ్‌... ఇలా కాలక్షేపం చేస్తున్నాడు. అయితే సరిగ్గా పదోరోజుకు శరత్‌ కుమార్‌ ఆరోగ్యం పాడైంది. కోవిడ్‌ లక్షణాలు కనిపించసాగాయి. అతను అలెర్ట్‌ అయ్యాడు. కుటుంబం కూడా అలెర్ట్‌ అయ్యింది. హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వచ్చింది. రక్షణ దుస్తులు ధరించిన వైద్య సిబ్బంది వచ్చి శరత్‌ కుమార్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వారుంటున్నది గేటెడ్‌ కమ్యూనిటీ. లాక్‌డౌన్‌ కారణంగా ఇదంతా అందరి దృష్టిలో పడింది. అందరిలోనూ సహజమైన ఆందోళన కనిపించింది. అంతకన్నా ఆందోళన శరత్‌ కుమార్‌ కుటుంబం పడింది. కాని శరత్‌ మాత్రం తాను ఈ వైరస్‌ను జయించి తిరిగి వస్తానన్నంత ధైర్యంగా అంబులెన్స్‌లో వెళ్లాడు.
∙∙ 
శరత్‌ కుమార్‌కు కోవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చింది. అతని కుటుంబానికి అదృష్టవశాత్తు నెగెటివ్‌ వచ్చింది. శరత్‌ కుమార్‌కు పెద్ద శారీరక సమస్యలు లేవు. రోజూ వాకింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేసే అలవాటు, మంచి ఆహార అలవాట్లు ఉండటం వల్ల కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకొని ఏప్రిల్‌ రెండోవారంలో డిశ్చార్జ్‌ అయ్యాడు. డిశ్చార్జ్‌ చేసే ముందు రెండుసార్లు పరీక్షలు చేస్తే రెండుసార్లు నెగెటివ్‌ వచ్చినందున వైద్యులు నిస్సందేహంగా ఇంటికి పంపారు. శరత్‌ చాలా సంతోషపడ్డాడు. కుటుంబం ఆనందానికి అవధులు లేవు. కాని తక్కిన ప్రపంచమంతా మారిపోయింది. సమస్య వారి నుంచే ఎదురైంది.
∙∙ 
మొదట ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఒక చిత్రమైన మౌనం కనిపించింది. శరత్‌ సభ్యుడిగా ఉన్న వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా అందరూ పలకరించడం మానేశారు. ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు. మెసేజ్‌లకు బదులు లేదు. కరోనా భయంకరమైనదే. దాని నుంచి సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోవలసిందే. అయితే అంతమాత్రాన దాని బారిన పడి బాధితుడిగా మారిన వ్యక్తిని తమ ప్రవర్తనతో మరింత బాధించడం అవసరమా? శరత్‌ కుమార్‌ భార్యతో గాని పిల్లలతో గాని ఎవరూ మాట్లాడటం లేదు. అసలు వారు ఫ్లాట్‌ తలుపు తెరిస్తే తప్పుగా చూస్తున్నారు. శరత్‌ భార్య కూరగాయల కోసం కిందకు దిగితే సూటిపోటి మాటలు అని, అలాంటివి సెక్యూరిటీకి చెబితే తలుపు ముందుకు తెచ్చి పెడతామని, బయటకు రావద్దని ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ చెప్పాడు. కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషపడాలో ఈ సాంఘిక బహిష్కరణకు బాధపడాలో తెలియని స్థితికి శరత్‌ కుటుంబం చేరుకుంది. ఆ వొత్తిడితోనే శరత్‌ సైకియాట్రిస్ట్‌కు కాల్‌ చేసి దుఃఖాన్ని పంచుకున్నాడు.
∙∙ 

శరత్‌ కుమార్‌ భార్యతో గాని పిల్లలతో గాని ఎవరూ మాట్లాడటం లేదు. అసలు వారు ఫ్లాట్‌ తలుపు తెరిస్తే తప్పుగా చూస్తున్నారు.  కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషపడాలో ఈ సాంఘిక బహిష్కరణకు బాధపడాలో తెలియని స్థితికి శరత్‌ కుటుంబం చేరుకుంది. 

‘చూడండి... ఇందులో మీ తప్పు లేదు. మీ పట్ల దూరం పాటిస్తున్న మీ ఇరుగుపొరుగు వారి తప్పు కూడా వాస్తవంగా చెప్పాలంటే లేదు. ప్రపంచమంతా ప్రతి చిన్నదాన్ని సందేహంగా చూస్తున్న సమయం ఇది. మృత్యువులో కూడా మర్యాద పాటించకుండా నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్న రోజులు ఇవి. కాని ఇవి మారుతాయి. మెల్లమెల్లగా అవగాహన పెంచుకుంటారు. కరోనాను ఎదుర్కొనడానికి దానిని జయించి వచ్చిన మీలాంటి వారు స్ఫూర్తి అని మెల్లగా గుర్తిస్తారు. ఎవరితోనైనా ఉండాల్సింది భౌతిక దూరమే... మానసిక దూరం కాదు. మిమ్మల్ని ఫోన్‌ ద్వారా పలకరించడం వల్ల, మీతో చాట్‌ చేయడం వల్ల, మీరు మీ ఫ్లాట్‌ తలుపులు తీయడం వల్ల, మీ వైఫ్‌ వెళ్లి కూరగాయలు కొనడం వల్ల ఏ ప్రమాదం లేదని అర్థం చేసుకుంటారు. ఇందుకు మీరు కరోనా మీద పోరాట సమయం కంటే అవసరమైన నిబ్బరం చూపించాలి. మీ కుటుంబం అంతా ఒక యూనిట్‌గా ఉండాలి. పరిచితులు మీతో మాట్లాడకపోతే మావంటి డాక్టర్లతో మాట్లాడండి. ధైర్యం పుంజుకోండి. అంతా సర్దుకుంటుంది.. ఓపిక పట్టండి’ అన్నాడు సైకియాట్రిస్ట్, శరత్‌ కుమార్‌తో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో.
∙∙ 
వారం రోజులు గడిచాయి. బాల్కనీలో ఉత్సాహంగా ఆరోగ్యంగా కనిపిస్తున్న శరత్‌ కుమార్‌ను అందరూ గమనించారు. కుటుంబం కూడా నార్మల్‌గా ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో కూచుని కాఫీలు తాగడం కూడా గమనించారు. అది సవాళ్లను ఎదుర్కొని బయటపడిన ఆరోగ్యవంతమైన కుటుంబం. అందుకే ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఒక పెద్ద వయసు ఆత్మీయుడు ఎవరేమనుకుంటే తనకేంటని ‘వెల్‌కమ్‌ బ్యాక్‌ శరత్‌ కుమార్‌’ అని మెసేజ్‌ పోస్ట్‌ చేశాడు. మార్పు మెల్లగా మొదలయ్యిందని శరత్‌ కుమార్‌కు అర్థమైంది. ఆ సాయంత్రం అతడు మరింత ఉత్సాహంగా బాల్కనీలో భార్యతో కబుర్లు చెబుతూ కనిపించాడు.

– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

 

మరిన్ని వార్తలు