మహోన్నత మాలవ్యా

5 May, 2019 01:21 IST|Sakshi


ఓసారి కాశీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు పడవ నడిపే ఓ నిరుపేదవాడి నుంచి ఓ పడవను అద్దెకు తీసుకున్నారు. ఆ పడవలో వారు ఉల్లాసయాత్ర చేపట్టారు. కానీ ఆ యాత్రలో వారు ఆ పడవను ఇష్టమొచ్చినట్లు నడిపి అది ఎందుకు పనికిరాకుండా పాడుచేసి పెట్టారు.ఎలాగోలా తీరం చేరుకున్న ఆ విద్యార్థులు పడవనడిపే అతనితో ఏదీ చెప్పకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ పడవే అతని జీవనాధారం. దాని మీద వచ్చే ఆదాయంతోనే అతను తన కుటుంబాన్ని నడపాలి. అటువంటప్పుడు విద్యార్థులు పడవ చెడిపోయిందని చెప్పకుండా చల్లగా జారుకోవడంతో అతనికి కోపం వచ్చింది. అతనికేంటీ ఎవరికైనా కోపం వచ్చే తీరుతుంది. లాభం లేదనుకున్న ఆ పేదోడు స్థానిక విద్యావేత్త మదన్‌ మోహన్‌ మాలవ్యా ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు.

మొత్తానికి అతను మాలవ్యా ఇంటికి చేరాడు. ఆ సమయంలో మాలవ్యా ఇంట ఏదో సమావేశం జరుగుతోంది. సమావేశంలో ఉన్న మాలవ్యాను కలవడానికి పేదోడు ముందుకు అడుగులు వేసాడు. కానీ అక్కడ కొందరు అతనిని లోపలికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నారు.ఆగ్రహావేశాలతో ఉడికిపోతున్న పేదోడు అక్కడెవరినీ లెక్కచేయలేదు. సమావేశం జరుగుతున్న హాలులోకి వెళ్ళి తన బాధనంతా వెళ్లగక్కాడు. మాలవ్యా అతని వద్దకు వచ్చి, జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని ‘‘దిగులు పడకు. నీ కోపం సబబే. నీ పడవకు మరమ్మతులు చేసి పెడతాను. నీకు నేనున్నాను’’ అంటూ హామీ ఇచ్చాడు. ఇతరులు ఏదైనా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడి నోరు పారేసుకోకూడదని, కోపాన్ని నియంత్రించుకోవాలని హితవుపలికారు మాల వీయ. అతని పడవకు ఉచితంగా మరమ్మతు పనులు చేసి పెట్టారు.
– యామిజాల జగదీశ్‌  

మరిన్ని వార్తలు