వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్‌ డిగ్రీ

6 Nov, 2023 04:58 IST|Sakshi

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 150 వర్సిటీల్లో మాత్రమే అమలు 

ఇప్పటికే 105 వర్సిటీల్లో ప్రారంభం

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆనర్స్‌ డిగ్రీతో మేలు

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్‌ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్‌ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్‌ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్‌ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాల­యాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. 

నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే
నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూ­డేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్‌ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్‌లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్‌లు పూర్తి చేస్తే ఆనర్స్‌ డిగ్రీని అందిస్తారు.

పరిశోధన స్పె­షలైజేషన్‌ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశో­ధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారి­కి రీసెర్చ్‌ స్పెష­లైజేషన్‌తో పాటు ఆనర్స్‌ డిగ్రీ లభి­స్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాల­నుకునే వారికి ఇది స­హాయపడుతుంది. విదేశా­ల్లో చదువుకునేందుకు భార­­తీయ విద్యార్థుల్లో డి­మాండ్‌ పెరుగుతోంది. గతే­డాది నవంబర్‌ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భార­తీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు