జయ జయ శ్రీ సుదర్శన

3 Feb, 2019 00:16 IST|Sakshi

కథా శిల్పం

సర్వధర్మ సముద్ధరణకై ఉద్భవించింది సుదర్శనచక్రం. అది ఆయుధమే అయినా పురుషమూర్తి రూపంలో పూజించబడుతూ విష్ణుసామ్యాన్ని పొందింది. ఈ స్వామిని చక్రమూర్తి, చక్రత్తాళ్వార్‌ అని పిలుస్తారు. వైష్ణవాలయాలలో చక్రమూర్తి తప్పక ఉంటుంది. ప్రతి ఉత్సవం చివరిలో చక్రస్నానం చేస్తారు. ఈ సుదర్శనచక్రం లోహంతో తయారు చేయబడి ఉంటుంది. కానీ సుదర్శనమూర్తి పూర్తి సాకార రూపంలో, ప్రత్యేకసన్నిధిలో కొలువు దీరిన క్షేత్రం ఒకటుంది. అదే 108 వైష్ణవ దివ్యదేశాలలో 46వదైన తిరుమోగూర్‌. ఇక్కడి స్వామి కాలమేఘపెరుమాళ్‌.

నాలుగుప్రాకారాలతో కూడిన అతి పెద్ద ఆలయం ఇది. చక్రత్తాళ్వార్‌ తొలి దేవాలయం ఇదే. ఒక చతురస్రమైన శిలపై మధ్యలో సుదర్శనమూర్తి కుడివైపు ఎనిమిది చేతులు, ఎడమవైపు ఎనిమిది చేతులు కలిగి పదహారు చేతులలో శంఖం, చక్రం, పాశం, గొడ్డలి, కత్తి, బాణం, శూలం, విల్లు, అంకుశం, అగ్ని, వజ్రాయుధం, డాలు, నాగలి, రోకలి, గద, ఈటె మొదలైన ఆయుధాలు ధరించి షోడశాయుధ సుదర్శనమూర్తిగా, భయంకరమైన కోరమీసాలతో అగ్నిజ్వాలలతో కూడిన కిరీటంతో హారం, భుజకీర్తులు, హస్తాభరణాలతో షట్కోణం మధ్యలో దర్శనమిస్తాడు. ఆయన చుట్టూ ఆరు వలయాలు ఉన్నాయి. ఆ ఆరు వృత్తాలలో 154 దివ్య బీజాక్షరాలు లిఖించబడి ఉన్నాయి.

ఈ మూర్తి చుట్టూ నలభై ఎనిమిది మంది దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. విశేషించి ఈ స్వామి మూడు కన్నులతో ఉంటాడు. ఈ మూర్తికి వెనుకవైపు యోగనరసింహస్వామివారు చతుర్భుజాలతో ఆసీనుడై ఉంటాడు.ఇక్కడి చక్రత్తాళ్వార్‌ స్వామి చాలా ప్రభావవంతమైన దేవుడు. ఈ స్వామిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.సుదర్శనమూర్తిని నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పదహారు చేతులతో నిర్మించవచ్చనీ, ఆయుధాలసంఖ్య పెరిగిన కొద్దీ ఆ స్వామి శక్తి పెరుగుతుందనీ విశ్వకర్మీయం అనే ప్రాచీన శిల్పశాస్త్రం చెప్పింది. సకల శత్రుసంహారం సుదర్శనమూర్తి దర్శనఫలం అని వైష్ణవాగమాల అభిప్రాయం. వ్యాపార, వ్యవహారాలలో విజయం, సకలదృష్టిదోషనివారణ, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం.
– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి 

మరిన్ని వార్తలు