వేసవిలో  కేశాల ఆరోగ్యం కోసం...

17 Mar, 2019 00:36 IST|Sakshi

బ్యూటిప్స్‌

కేశాలను క్రమంగా కత్తిరించండి
వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారు అవుతుంది, ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. చూడటానికి అందంగా కనపడటానికి, కేశాలను పావు అంగుళం కత్తిరించండి. ఫలితంగా కేశాలు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. పెరుగుదల కూడా మెరుగుపడుతుంది

రెండురోజులకోసారి తలస్నానం
వేసవిలో తలపైన చెమట ఎక్కువగా రావటం వలన తలపైన ఉండే చర్మం దుమ్ము ధూళితో నిండిపోయి, చికాకుగా అనిపిస్తుంది. దాంతో చాలామంది తలను రోజు శుభ్రపరుస్తుంటారు. ఇలా రోజూ తలస్నానం చేయడం వల్ల తల పైన ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోయి జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. అందువల్ల రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది.

కండిషనింగ్‌
కేశాలకు తరచు షాంపూలను వాడటం వలన ‘రీహైడ్రేషన్‌’కు గురవకుండా ‘ప్రోటీన్‌’లతో కూడిన కండిషనర్‌లను వాడటం మంచిది. అలాగని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కండిషనర్లను  వాడరాదు. ఇలా వాడటం వలన కేశాలు పొలుసులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి మంచి కండిషనర్‌ ఉన్న షాంపూలను వాడటం మంచిది. 

ఎక్కువగా దువ్వకండి
ఎక్కువగా దువ్వటం వలన కేశాలు పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఉండే వేడికి తలపైన ఉండే చర్మం తేమని కోల్పోతుంది. దీనికితోడు బాగా దువ్వటం వలన కురులు పెళుసుబారి చిట్లిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. తల స్నానం చేసిన వెంటనే ఫైబర్‌’తో తయారు చేసిన దువ్వెనలను వాడడం మరింత హానికరం. కాబట్టి వీలయినంత వరకు చెక్కదువ్వెనతో... అదీ కూడా జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వడం మంచిది. మీ కేశాలను కడగటానికి సమయం లేదు కదా అని అశ్రద్ధ చూపకండి, వెంట్రుకల మూలాలు, తలపైన చర్మంలో ఉండే దుమ్ము, నూనెల వలన దురదలు కలుగుతాయి, కొన్ని సమయాల్లో కేశాలు బలహీనంగా మారి వెంట్రుకలు ఉడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వారానికి మూడు లేదా కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. 

నిమ్మరసం వాడండి
ఒకోసారి అనుకోకుండా ఎండలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు కేశాలకు కొద్దిగా నిమ్మరసం రాయడం మంచిది.  

మరిన్ని వార్తలు