నా కూతురు కన్నీళ్లు పెట్టించింది

13 Nov, 2019 04:22 IST|Sakshi

హృదయ బంధం

అలీసా స్కూల్‌ నుంచి వచ్చింది. వచ్చీ రాగానే, ‘‘మమ్మీ.. స్కూల్లో నేను ఎస్సే రాశాను. ఏం రాశానో వింటావా?!’’ అంది. అలీసా.. సుస్మితాసేన్‌ కూతురు. వయసు పదేళ్లు. ఆ వయసులో స్కూల్లో ఏం చేసినా,  ఇంటికి రాగానే తల్లిదండ్రులకు చెప్పాలన్న తహతహ పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రులకే వినే ఓపిక ఉండదు. లేదా ఆసక్తి ఉండదు. అలీసాకు తండ్రి లేడు. సుస్మితే తల్లీతండ్రి. అలీసాను పదేళ్ల క్రితం అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకున్నారు సుస్మిత. ‘‘ఎస్సే టాపిక్‌ ఏమిటి?’’ కూతుర్ని అడిగారు సుస్మిత. ‘‘అనాథశరణాలయం నుంచి బిడ్డను దత్తత తీసుకోవడం మీద మమ్మీ. నేను ఎంచుకున్నాను ఆ టాపిక్‌’’ అంది అలీసా! సుస్మిత నవ్వింది. కూతురు ఉత్సాహంగా చదవడం మొదలుపెట్టింది.

అలీసా ఎస్సే చదువుతున్నంత సేపూ సుస్మిత చెంపలపై కన్నీళ్లు. బిడ్డను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. అలీసా ఎస్సేను చదువుతున్నప్పుడు తీసిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. ‘‘నా కూతురు నా చేత కన్నీళ్లు పెట్టించింది’’ అని కామెంట్‌ రాశారు సుస్మిత. అలీసా తన వ్యాసంలో పెద్ద పెద్ద మాటలేమీ రాయలేదు. దత్తత తీసుకోవడం అంటే జన్మను ఇవ్వడం అని రాసింది! జన్మను ఇవ్వడం అంటే ఒక బిడ్డను కాపాడటం అని రాసింది. శిశువుకు ఉండే జీవించే హక్కును సంరక్షించడం అంటే ఇంట్లోకి సంతోషాన్ని తెచ్చుకోవడం అని రాసింది. అప్పటికే పెద్దగా ఏడ్చేయడం మొదలు పెట్టారు సుస్మిత. భావోద్వేగాలతో ఉబికి ఉబికి వస్తున్న వెచ్చని కన్నీళ్ల చప్పుడు వీడియోలో సుస్మిత గొంతు నుంచి అలీసా ఎస్సే పఠనంతో కలిసి మధ్యలో ఒకసారి  వినిపిస్తుంది.

ఎస్సేలో ఇంకా ఇలా రాసింది అలీసా. కడుపున పుట్టిన బిడ్డకు, ఎవరి కడుపునో పుట్టిన బిడ్డకు తేడా ఉండదు. తల్లి మనసుకు భేద భావాలు ఉండవు. దత్తత తీసుకోవడం అన్నది.. అదొక అందమైన భావన.. అంటూ ముగిస్తూ దత్తత తీసుకున్న సెలబ్రిటీల జాబితాలో సుస్మిత పేరునూ ప్రస్తావించింది. ఆ చిన్న చిన్న భావనలలో ప్రేమను, ఆత్మీయతను, స్వచ్ఛతను, భద్రతను, భరోసాను, నిజాయితీ, దైవత్వాన్నీ వీక్షించిన సుస్మిత పట్టలేని ఆనందంతో ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. 1994లో ‘మిస్‌ యూనివర్స్‌’ ౖటెటిల్‌ గెలుచుకున్న సుస్మిత మోడలింగ్‌లో కొన్నాళ్లు ఉండి, కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పూర్తిగా సామాజిక సేవాకార్యక్రమాలకే పరిమితం అయ్యారు.

అవివాహితగా ఉండిపోదలచుకున్నారు. అలాగని మాతృత్వపు మధురిమలకు ఆమె దూరం కాదలచుకోలేదు. తన 25 ఏళ్ల వయసులోనే ఒక బాలికను దత్తత తీసుకుని ఆమెకు రెనీ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత పదేళ్లకు సుస్మిత తన 35 వ యేట ఇంకో బాలికను దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారే అలీసా. బాలికను దత్తత తీసుకున్నాక బాలుడిని మాత్రమే తీసుకోవాలన్న చట్ట నిబంధనపై పోరాడేందుకు ఆమెకు పదేళ్ల సమయం పట్టింది! పెద్ద కూతురు రెనీ వయసు ఇప్పుడు 20 ఏళ్లు. ‘‘సొంత తల్లికి బిడ్డకు పేగు బంధం ఉంటుంది. దత్తత తీసుకున్న బిడ్డకు తల్లికి తెగని బంధం ఉంటుంది. సొంత తల్లి తన కడుపులోంచి బిడ్డను కంటుంది. దత్తత తల్లి తన హృదయంలోంచి జన్మను ఇస్తుంది’’ అని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో సుస్మితా సేన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు