చెరిగిపోని వారసత్వం

13 Nov, 2019 04:31 IST|Sakshi

జెరూసలేం

విదేశీ యాత్రికుడు ఫిలిప్‌ లాంకాస్టర్‌ జెరూసలేంను సందర్శిస్తూ ప్రార్థనా మందిరం తర్వాత అక్కడి ప్రాచీన దారులను, గోడలను వీక్షిస్తూ ముందుకు వెళుతున్నాడు. జాఫా గేట్‌ వద్ద సెయింట్‌ జార్జ్‌ స్ట్రీట్‌లో ఒక టాటూ షాప్‌ కనిపించింది. జెరూసలేం యాత్ర జీవితాంతం గుర్తుండిపోయేలా పచ్చబొట్టు వేయించుకోవాలనుకున్నాడు. రజౌక్‌ టాటూ షాప్‌ అని కనిపిస్తున్న ఆ దుకాణంలోకి వెళ్లి ఆ షాప్‌ నిర్వాహకుడితో తన చేతి మీద పచ్చబొట్టు వేయమని కోరాడు. మాటల్లో వారి విషయాలు తెలుసుకున్న ఫిలిప్‌ ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. రజౌక్‌ టాటూ షాప్‌ 1300వ సంవత్సరం నుండి అక్కడే ఉంది! 700 సంవత్సరాలుగా జెరూసలేం యాత్రికులు ఆ షాప్‌కి రావడానికి ముచ్చటపడుతూనే ఉన్నారు.

ఆ విధంగా ప్రపంచంలోని అతి పురాతన టాటూ షాపులలో రజౌక్‌ షాప్‌ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం 27వ తరానికి చెందిన వాసిమ్‌ రజౌక్‌ ఈ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. శతాబ్దాల క్రితం అతని పూర్వీకులు ఈజిప్ట్‌ నుండి  వచ్చి ఇక్కడ స్థిరపడ్డారట. నాటి సాధనాలు, పద్ధతులతో పచ్చబొట్టు వేసే వృత్తిని ఆ కుటుంబం చేపట్టింది.  వాసిమ్‌ రజౌక్‌ ఉపయోగించే పచ్చబొట్టు ముద్రలు, నమూనాల ఎంపికకు సంబంధించినవన్నింటికీ వందల సంవత్సరాల వయసు ఉంది. వాసిమ్‌ బొట్టు వేయడానికి ఆధునాతనమైన, క్రిమిరహితం చేసిన పరికరాలనే ఉపయోగిస్తాడు. షాపులోని ఆలివ్‌ కలప నుండి చేతితో చెక్కబడిన గ్లాస్‌ డిస్‌ప్లే నమూనాలు చీకటిలో అద్భుతంగా మెరుస్తుంటాయి.

మ్యూజియంలో ఉండే విలువైన పురాతన కళాఖండాలను పచ్చబొట్లుగా వాసిమ్‌ వేయడాన్ని వీక్షించాల్సిందే. ప్రాచీన జెరూసలేంలోని శిలువ నమూనాలు ఇప్పటికీ వాసిమ్‌ దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్‌లు. స్టెన్సిల్స్‌తో.. క్రీస్తు శిలువ నుండి పునరుత్థానం వరకు అన్ని వర్ణనలు ఈ పచ్చబొట్లలో ప్రతిఫలిస్తాయి. యాత్రికుడు ఒక స్టెన్సిల్‌ను ఎంచుకుంటాడు. వాసిమ్‌ దానిని ఒక ప్యాడ్‌లో వేసి, ఆ డిజైన్‌ను ఒంటిపైకి బదిలీ చేసి పచ్చబొట్టు పొడుస్తాడు. అతని పనితనం చాలా సునిశితంగా, సున్నితంగా ఉంటుంది. ‘‘జీవిత కాలం కొనసాగే స్మృతి చిహ్నం కోసం ఇలా రజౌక్‌ టాటూ షాప్‌లో ఒక రోజు గడపడం అంటే క్రైస్తవ ప్రపంచం కూడలి వద్ద కూర్చోవడంతో సమానంగా భావించవచ్చు’’ అని ఫిలిప్‌ లాంకాస్టర్‌ అంటారు.

మరిన్ని వార్తలు