స్వీటాఫలం

14 Oct, 2017 04:04 IST|Sakshi

చక్కెర్లో చెరకు రసం పోసినట్లుండదూ!
బెల్లం పాకంలో తేనె కాచినట్లుండదూ!
ఎగ్జాట్లీ!!
సీతాఫలంతో స్వీటు చేస్తే
ఇట్‌ విల్‌ బి సో.... స్వీట్‌!
ఎంజాయ్‌.. స్వీటాఫలం.

సీతాఫల్‌ సగ్గుబియ్యం పాయసం
కావలసినవి: కొబ్బరి పాలు – 2 కప్పులు; సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు; పంచదార – పావు కప్పు; నీళ్లు – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – 10, కిస్మిస్‌ – 15.
తయారి: స్టౌ పైన మందపాటి నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఇదే పాన్‌లో నీరు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం కలిపి ఉడకనివ్వాలి ∙సగ్గుబియ్యం మరీ మెత్తబడకుండా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి పది నిమిషాలు ఉడికించుకోవాలి ∙సీతాఫలం గుజ్జు, పంచదార, యాలకుల కూడా జతచేసి మరొక పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙చల్లారిన ఈ మిశ్రమానికి జీడిప్పు, కిస్మిస్‌ జతచేసి అర గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లాగా సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

సీతాఫల్‌ ఫిర్నీ
కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన బియ్యం – అర కప్పు (2 గంటల సేపు నానబెట్టుకోవాలి); వెన్నతీయని పాలు – అర కప్పు; కాచి చల్లార్చిన వెన్నతీయని పాలు – మూడున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్స్, యాలకులు – 4.
తయారి: ∙నానబెట్టుకున్న బియ్యానికి అరకప్పు చల్లని పాలు కలిపి మిక్సీ జార్‌లో వేసి కొంచెం (రఫ్‌గా) బరకగా ఉండేలా తీసుకోవాలి ∙స్టౌ వెలిగించి మందపాటి నాన్‌స్టిక్‌ గిన్నెలో మిగిలిన మూడున్నర కప్పుల పాలు, మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కలిపి, మీడియమ్‌ మంటపైన అయిదు నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙సిమ్‌లో పెట్టి మరొక పది నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙బియ్యం, పాల మిశ్రమం ఉడికేలా మధ్య మధ్యలో చూసుకుంటూ మరికాసేపు ఉంచాలి ∙పూర్తిగా ఉడికిన తర్వాత సీతాఫలం గుజ్జును కూడా వేసి బాగా కలపాలి ∙పూర్తిగా చల్లారిన తర్వాత రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙ఫ్రిజ్‌లో తీసిన తర్వాత యాలకులను దంచి గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

సీతాఫల్‌ కలాకండ్‌
కావలసినవి:పాలు – 2 రెండు లీటర్లు; నిమ్మరసం– 2 టీ స్పూన్స్‌; పంచదార – అర కప్పు (పొడి చేసుకోవాలి); యాలకుల పొడి – 1 టీ స్పూన్, సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నెయ్యి – 1 టీ స్పూన్, పిస్తా – 2 టేబుల్‌ స్పూన్స్‌; బాదం – 2 టేబుల్‌ స్పూన్స్‌.

తయారి: మందపాటి గిన్నె తీసుకుని ఒక లీటరు పాలను అర లీటరు మిగిలేలా మరించాలి ∙మరొక గిన్నెలో లీటరు పాలను తీసుకుని మరుగుతుండగా స్టౌను సిమ్‌లో పెట్టుకోవాలి ∙ఈ పాలకు నిమ్మరసం కలిపి విరగనివ్వాలి ∙పలుచటి కాటన్‌ బట్టను తీసుకుని విరిగిన పాలను వడపోయాలి ∙ఇలా తయారైన పనీర్‌ను చల్లటి నీటిలో మరొకసారి కడిగి, ముందుగా మరిగించి పెట్టుకున్న పాలలో ఈ పనీర్‌ను కలిపి తిప్పుతూ ఉండాలి ∙పాలు పనీర్‌ మిశ్రమానికి పంచదారను కలిపి మరికాసేపు కలుపుతూ ఉండాలి ∙ఇప్పుడు సీతాఫలం గుజ్జును, యాలకుల పొడిని కూడా జతచేసి చిక్కబడేంత వరకు కలిపి స్టౌ ఆఫ్‌చేసుకోవాలి ∙ఒక ప్లేటుకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరుచుకోవాలి ∙పిస్తా, తరిగిన బాదం పైన వేసి కాసేపు చల్లారిన తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి ∙సీతాఫల్‌ కలాకండ్‌ను ఎయిర్‌టైట్‌ కంటెయినర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే 5 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది.

సీతాఫల్‌ స్మూతీ
కావలసినవి: సీతాఫలం గుజ్జు – 2 కప్పులు; అరటిపండు గుజ్జు – 1 కప్పు; తేనె – 1 టీ స్పూన్, వెనీలా కస్టర్డ్‌ పౌడర్‌ – పావు కప్పు; దాల్చినచెక్క పొడి – చిటికెడు; ఐస్‌ క్యూబ్స్‌ – 3
తయారి:సీతాఫలం గుజ్జు, అరటిపండు గుజ్జు, తేనె, కస్టర్డ్‌ పౌడర్‌ అన్నీ కలిపి మిక్సీ జార్‌లో వేసి అయిదు నిమిషాలు బ్లెండ్‌ చేయాలి ∙గ్లాసులోకి పోసి, దాల్చిన చెక్క పొడి, ఐస్‌ క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.


సీతాఫల్‌ ఐస్‌క్రీమ్‌
కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు;  ఒకటిన్నర కప్పు – మిల్క్‌ క్రీమ్‌;  కండెన్స్‌డ్‌ మిల్క్‌ – అర కప్పు; వెనీలా ఎసెన్స్‌ – అర టీ స్పూన్‌
తయారి: ∙గిన్నెలో సీతాఫలం గుజ్జు, మిల్క్‌ క్రీమ్‌ను కలిపి బీట్‌ చేయాలి ∙కండెన్స్‌డ్‌ మిల్క్, వెనీలా ఎసెన్స్‌ను కూడా కలిపి బీట్‌ చేయాలి (మిక్సీ జార్‌లో కూడా వేసి బ్లెండ్‌ చేసుకోవచ్చు) ∙ప్లాస్టిక్‌ కంటెయినర్‌లోకి తీసుకుని 8 గంటలు లేదా ఒక రాత్రంతా డీఫ్రిజ్‌లో ఉంచాలి. (పిల్లలకు ఐస్‌లా ఇవ్వాలనుకుంటే ఐస్‌ మౌల్డ్‌లో ఈ మిశ్రమాన్ని పోసి రాత్రంతా ఉంచాలి)  సర్వ్‌ చేయడానికి అయిదు నిమిషాలు ముందుగా ఫ్రిజ్‌ నుండి తీసి స్కూప్‌తో సర్వ్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు