మనకు తెలిసిన మధుర గీతం... నడిపించు నా నావ

24 Dec, 2014 22:55 IST|Sakshi
మనకు తెలిసిన మధుర గీతం... నడిపించు నా నావ

నడిపించు నా నావ.. నడిసంద్రమున దేవా... అన్న పాట తెలుగు క్రైస్తవలోకాన్ని మనోహరమైన ఆత్మీయతానుభవాల అత్యున్నతమైన అంచుల్లోకి తీసుకెళ్లిన భక్తి గీతం. ఈ పాట పాడని క్రైస్తవుడు లేడు, మోగని చర్చి లేదు, మారు మోగని క్రైస్తవ సభలు లేవు. మహాద్భుత క్రైస్తవ వక్తగా, రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన రెవ. డా. ఎ.బి. మాసిలామణి రాసిన ఆణిముత్యంలాటి భక్తి గీతమది. లక్షలాది హృదయాలను స్పృశించిన మధురగీతం అది. జీవితంలో వైఫల్యానికి, విజయానికి మధ్యగల అగాథంలో యేసుక్రీస్తు నిండితే, అదెంత ఫలభరితమో తెలుపుతూ పరోక్షంగా అపోస్తలుడైన పేతురు జీవితానుభవాల పందిరికి అల్లిన గీతం అది. ఎంతో సరళమైన భాషతో అత్యంత ప్రగాఢమైన భావాలను శ్రోతల హృదయాల్లో గుమ్మరించడం మాసిలామణికి వెన్నతో పెట్టిన విద్య. నడిపించు నా నావ పాటలో ప్రభుమార్గము విడిచితిని- ప్రార్థించుట మానితిని  ప్రభువాక్యము వదిలితిని- పరమార్థము మరచితిని  ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై- ఇప్పుడు పాటింతు నీ మాట  అన్న చరణం మాసిలామణి నిజాయితీకి, నిష్కల్మషత్వానికి, నిర్భయత్వానికి నిదర్శనం.

దేవుడు నిర్దేశించిన స్థాయిని అందుకోలేక పడిపోవడం, మళ్లీ లేవడం అందరి అనుభవమే అయినా ప్రతి ఒక్కరూ తాము అందుకు మినహాయింపు అన్న పద్ధతిలో డబ్బా వాయించుకుంటున్న పరిస్థితుల్లో, తాను మాత్రం అందరిలాంటి వాడనేనని ఒప్పుకున్న మహనీయుడు మాసిలామణి. ప్రపంచస్థాయి వక్తగా అత్యున్నతమైన స్థితిలో ఉన్న తరుణంలో 1972లో నడిపించు నా నావ అనే ఈ పాట రాయడం, అందులో ఈ చరణాన్ని చేర్చడం మాసిలామణి సాహసానికి తార్కాణం. ఎలాంటి వ్యక్తినైనా తడిమి లేపి ప్రభువు పాదాలవద్ద పడవేసే శక్తి ఆయన పాటకుందంటే దానిక్కారణం ఆ పాటలు ఆయన జీవితానుభవాల్లో పుట్టడమే.
 తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1914లో జన్మించిన మాసిలామణి పూర్వీకులు తమిళ ప్రాంతం వారు. ఎంతో సాదాసీదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో లక్షలాదిమందికి ఆశీర్వాదకారకుడైన మహా దైవజనుడు మాసిలామణి.ఆయన తర్వాత నేనే అని చెప్పుకునే వాళ్లున్నా, ఆయనది మొదటి స్థానమైతే వాళ్లది వందవ స్థానమవుతుంది. మధ్యలో ఉన్న సంఖ్యలన్నీ ఖాళీయే! ఆయనలాంటి వక్త, రచయిత, కవి మళ్లీ పుడితే అది మహాద్భుతమే అవుతుంది.  ఆ అద్భుతం జరిగినా జరగకున్నా మాసిలామణి జ్ఞాపకాలు, ప్రసంగాలు, పాటలు కనీసం వెయ్యితరాలకు వెలుగుబాటలు.
 
 మాసిలామణి  గీత రచయిత
 

మరిన్ని వార్తలు