ఆ విధంగా ముందుకుపోతున్నారు...

3 Jan, 2016 22:57 IST|Sakshi
ఆ విధంగా ముందుకుపోతున్నారు...

రిపోర్ట్

కొత్త సంవత్సరం వచ్చేసింది. సగటు మగ బతుకులు మరింత పాతబడటం తప్ప ఒరిగిందేముంది? అవే బతుకులు, అవే బాధలు. సంసార బాధా గరళాన్ని గళంలో దాచుకుని బయటకు ఎంతటి ధీరగంభీర భంగిమలను ప్రదర్శిస్తేనేం? లోలోపలి కన్నీటి కాసారాలలోని సుడిగుండాలను చూసేదెవరు? గృహహింసా బాధితుల్లో దాదాపు సగం మంది మగపుంగవులే కదా! భార్యాబాధితులేనా? భార్యాబంధువుల బాధితులు కూడా. ఇండియన్ పీనల్ కోడ్‌లో 511 సెక్షన్లు ఉంటే ఉండొచ్చు గాక... సెక్షన్ 498 (ఎ) ఒక్కటి చాలు మగాళ్లకు పీడకలలు తెప్పించడానికి. ఉదయాన్నే కప్పు కాఫీ పడనిదే కడుపులో కదలిక రాదు. అర్ధరాత్రి దాటిన వరకు టీవీ సీరియళ్లలో తలమునకలైన శ్రీమతికి అప్పుడే మెలకువ రాదు.

కాఫీ కోసం నిద్రాభంగం కలిగిస్తే, కథ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసే ప్రమాదాలు లేకపోలేదు. ఆఫీసు టైము తరుముకొస్తున్న వేళ తటస్థించే అటువంటి అనివార్య యుద్ధరంగంలో ఓటమిని అంగీకరించి, శ్వేతపతాకాన్ని ప్రదర్శించడమే వివేకం. అలా కాకుండా, నేను మగాడిని కాదా...? నాకూ పౌరుషం ఉండదా..? ఆవేశంలో నోరు జారినా, చేయి ఎత్తినా ఇక అంతే సంగతులు! అడ్డంగా 498 (ఎ) కింద బుక్కయినట్లే! ఇలాంటి అగత్యాన్ని నివారించుకునే క్రమంలోనే దేశంలోని మెజారిటీ మగాళ్లు కుక్కిన పేలల్లా బిక్కచచ్చి బండబారిన బతుకులు బతుకుతున్నారు. మగాళ్లపై నమోదవుతున్న గృహహింస కేసుల్లో చాలా వరకు తప్పుడువే. అందుకే ఈ బాపతు కేసులు దర్యాప్తు చేసేటప్పుడు కాస్త ఆచి తూచి వ్యవహరించాలంటూ సర్వోన్నత న్యాయస్థానమే మార్గదర్శకాలు జారీ చేయాల్సి వచ్చిందంటే, దేశంలో ‘మగా’నుభావుల బతుకులు ఎలా వెళ్లమారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది నాణేనికి ఒకవైపు. రెండోవైపు చూసుకుంటే, భార్యల చేతిలో గృహహింస ఎదుర్కొంటున్న భర్తల సంఖ్య మూడుకోట్లకు పైనే ఉందని సర్కారు లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి బాధలు అనుభవిస్తున్న మగాళ్లు వాటిని చెప్పుకోలేరు. సమాజంలో చులకనైపోతామనే భయం వాళ్లది. పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నా, ‘మర్ద్‌కో దర్ద్ నహీ హోతా’ (మగాడికి బాధ ఉండదు) అనే దిక్కుమాలిన భ్రమలోనే మన సమాజం ఆ విధంగా ముందుకుపోతోంది.

మరిన్ని వార్తలు