ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది! | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది!

Published Sun, Jan 3 2016 10:50 PM

ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది! - Sakshi

త్రిష హీరోయిన్ అయ్యి పదమూడేళ్లవుతోంది. ఇన్నేళ్ల అనుభవంతో రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్, డ్యాన్స్.. ఏదైనా సునాయాసంగా చేసేయగల నేర్పు ఆమెకు వచ్చేసి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, నటనపరంగా త్రిషను ఇప్పటికీ ఇబ్బందిపెట్టే విషయం ఒకే ఒక్కటుంది. ఆ విషయంతో పాటు... త్రిష గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...
 
నేను డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. అయినప్పటికీ డ్యాన్స్ అంటే నాకు చాలా భయం. పాట చిత్రీకరణ అంటే చాలు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది. సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం అంటే జస్ట్ శరీరం కదపడం కాదు. పాటకు తగ్గట్టుగా లిప్ మూమెంట్ ఇవ్వాలి. హావభావాలు కనబర్చాలి. టైమింగ్ చూసుకోవాలి. ఇవన్నీ సరిగ్గా చేస్తేనే నిజంగా పాట పాడుతున్నట్లుగా, ఆ పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే.. ఈ పదమూడేళ్లల్లో ఎన్ని పాటలు చేసినా నాకింకా భయం పోలేదు. కెరీర్ ప్రారంభంలో డ్యాన్సులంటే మొదలైన భయం ఇప్పటికీ వెంటాడుతోంది.

నెలలో మూడు వారాలే షూటింగ్‌లో పాల్గొనాలని ఓ నిబంధన పెట్టుకున్నాను. మరీ తప్పదనుకుంటేనే నాలుగో వారం కూడా షూటింగ్‌కి డేట్స్ ఇస్తాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే, డిసెంబర్‌లో షూటింగ్‌కి గ్యాప్ తీసుకుని ఫ్రెండ్స్‌తో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకుంటా. పగలనకా, రాత్రనకా చిత్రీకరణలో పాల్గొంటాం కాబట్టి, రీచార్జ్ కావాలంటే ఆ బ్రేక్ అవసరం అని నా ఫీలింగ్.

{ఫెష్ ఫేసెస్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లను చూడాలనుకుంటారు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేశాను కాబట్టి, కొత్తవాళ్లకు ధీటుగా నిలబడాలి. అలా నిలబడాలంటే, నటిగా నిరూపించుకోవాలి. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇన్నేళ్లల్లో నేనది సాధించగలిగాను. నన్ను దృష్టిలో పెట్టుకుని కూడా పాత్రలు రాస్తున్నవాళ్లు ఉన్నారు.

తిండి విషయంలో నేనెలాంటి నియమాలూ పెట్టుకోను. నేను భోజనప్రియురాల్ని. చాక్లెట్స్ అంటే బోల్డంత ఇష్టం. నాకు వంట చేత కాదు. న్యూడిల్స్ చేయగలుగుతాను. కూరగాయలతో వండే కూరలు, పప్పు కూర చేయగలుగుతాను. నేను వంట నేర్చుకోవడం మొదలుపెట్టింది బేకింగ్‌తోనే.

ఎంత తిన్నా, నేను బరువు పెరగకపోవడానికి కారణం నా జీన్స్. రెండేళ్లుగా పవర్ యోగా చేస్తున్నాను. నేనిలా స్లిమ్‌గా ఉండటానికి అదో ముఖ్య కారణం.

నేను ట్రెండ్‌ని ఫాలో కాను. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులను అస్సలు పట్టించుకోను. నాకు ఏ డ్రెస్ నచ్చితే అది వేసుకుంటాను. ఆ డ్రెస్ నాకు సౌకర్యవంతంగా ఉండాలి. జీన్స్-టీ షర్ట్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉంటాయి. మొదట్లో అవే ఎక్కువగా వేసుకునేదాన్ని. తర్వాత తర్వాత చీరలు కట్టుకోవడం మొదలుపెట్టాను.

ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు అనే విషయంలో ఓ నిర్ణయానికి రావడానికి నేను మా అమ్మ సహాయం తీసుకుంటాను. ఆవిడ సహాయం లేకపోతే నిర్ణయాలు తీసుకోలేను.

షూటింగ్ లొకేషన్లో నేను కొంచెం రిజర్డ్వ్‌గానే ఉంటాను. పని మీద పూర్తి దృష్టి సారించడం కోసమే అలా ఉంటాను.

 నేను ఫుడ్ లవర్‌ని కాబట్టి, ఎప్పటికైనా ఓ మంచి రెస్టారెంట్ ఆరంభించాలనుకుంటున్నాను. కానీ, దానికి చాలా సమయం కావాలి. అంత టైమ్ ఎప్పుడు దొరికితే అప్పుడు నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా.

ఆనందంగా జీవించడానికి నేను పాటించేది ఒక్కటే. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోకూడదన్నది నా సిద్ధాంతం. ఆనందాన్ని ఎలా అంగీకరిస్తున్నామో కష్టాలను కూడా అలానే అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది.
 

Advertisement
Advertisement