కొత్త పరిశోధన

27 Jul, 2015 23:05 IST|Sakshi

ఎండ సోకకుంటే  కండరాల నొప్పులు..
 
ఎండ కన్నెరుగకుండా రోజుల తరబడి గడిపేస్తే కండరాల నొప్పులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కండరాల నొప్పులకు ఐరన్ లోపం కూడా కారణమేనని వారు చెబుతున్నారు. శరీరానికి కాస్త ఎండ తగలనిస్తే, ఎముకల పటిష్టతకు కావలసిన విటమిన్-డి తయారవుతుందని, తద్వారా వ్యాయామానంతరం కండరాల నొప్పులు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. విటమిన్-డి లోపిస్తే ఎముకల పటుత్వం తగ్గి, కొద్దిపాటి శ్రమకే ఎముకలు, కండరాల్లో నొప్పులు మొదలవుతాయని, సూర్యరశ్మి సోకనివ్వడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ డెయో ఫాముబోని చెబుతున్నారు.

అలాగే, ఐరన్ లోపించిన మహిళలు కూడా తరచు ఒంటినొప్పులతో బాధపడుతుంటారని, తగిన పోషకాలతో కూడిన ఆహారం, కాసేపు ఎండలో గడపడం ద్వారా ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చని ఆయన సూచిస్తున్నారు. గింజ ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, గుడ్లు, చేపలు వంటి వాటిలో విటమిన్-డి, ఐరన్.. రెండూ పుష్కలంగా ఉంటాయని, ఒంటినొప్పులతో బాధపడేవారు ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకుంటే చాలని డాక్టర్ ఫాముబోని వివరిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు