విజయం చేకూర్చే దశమి

14 Oct, 2013 00:43 IST|Sakshi
విజయం చేకూర్చే దశమి

 లోకంలో ఉన్న మనందరం లోహాల్లో బంగారం, సువాసన గల పుష్పాల్లో కదంబం, వనాల్లో నందనం, కట్టడాల్లో దేవేంద్రభవనం... ఇలా గొప్పవని లెక్కిస్తూ ఉంటాం. నిజానికి భారతీయ సంప్రదాయం లెక్కించమని చెప్పిందీ, ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందని చెప్పిందీ, ఇలాంటి వస్తువుల గొప్పదనాన్ని గురించి కాదు... మనందరినీ నడిపిస్తున్న కాలం గొప్పదనాన్ని గుర్తుంచుకోవలసిందని తెలియజేసింది.
 
 కాలంలో ఉండే సంవత్సరానికీ, సంవత్సరంలో కనిపించే అయనానికీ, ఋతువుకీ మాసానికీ పక్షానికీ తిథికీ వారానికీ ... అన్నింటికీ ప్రత్యేకతలుంటాయని నిరూపించినవాడు బ్రహ్మదేవుడు. అందుకే ఆయన ప్రభవలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రంలో శుద్ధపక్షంలో పాడ్యమీ తిథిలో సృష్టిని ప్రారంభించాడు. అదే తీరుగా ఏ రాక్షసుణ్ణి వధించాలన్నా ఏ యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా ఏకాంలో ఏది సరైన సమయమో గమనించి ఆ నాడే ఆ పనిని చేస్తూ వచ్చారు దేవతలంతటి వారు కూడ.  మనకి పండుగగా కనిపిస్తున్న విజయదశమిలో దాగిన తిథుల గొప్పదనం ఇంత అంత కాదు.
 
 ఏ పురోహితుణ్ణి అడిగినా శుద్ధ పాడ్యమినాడు పనిని ప్రారంభించవద్దనే చెప్తారు. అదే పూర్ణిమ వెళ్లిన మరునాడు అంటే కృష్ణపాడ్యమి అయితే  మంచిదనే చెప్తారు. దానిక్కారణం శాస్త్రం అలాగే చెప్పింది. అయితే ఆశ్చర్యమేమంటే అమ్మ తాను విజయాన్ని సాధించడానికి శుద్ధ పాడ్యమినే మంచిరోజుగా ఎన్నుకోవడం. అందుకే దసరా నవరాత్రాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభమయ్యాయి. దశమినాటికి విజయాన్ని తెచ్చిపెట్టి అమ్మని విజయ రూపిణిగా నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో ఏ తిథిలో ఏ రహస్యం దాగి ఉందో గమనిద్దాం!
 
 పాడ్యమి: అమావాస్య వెళ్లిన పాడ్యమిని శుద్ధ పాడ్యమి అంటారు. అదే పూర్ణిమ వెళ్లిన పాడ్యమి అయితే శుభకరమని పైన అనుకున్నాం. అయితే అమ్మ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభించి విజయాన్ని ఎలా సాధించగలిగింది? దైవానికి ఈ నిషేధాలు లేవా? లేక అసలు ఈ తీరు ఆలోచనే సరికాదా అనిపిస్తుందా మనకి.
 
 చిత్రమేమిటంటే శుద్ధ పాడ్యమి చెడ్డ తిథి కాదు. అయితే ఆ ప్రారంభించబడిన పని- అమావాస్య వరకూ చక్కగా కొనసాగాలంటే దానిని కనీసం పూర్ణిమ వరకైనా చేస్తూనే ఉండాలి. కాబట్టి విజయసిద్ధి కావాలంటే శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య (నెలరోజులు) వరకు ఆపకుండా పనిని చేయాలి. అది అమావాస్య వరకూ కొనసాగని పక్షంలో కనీసం పూర్ణిమవరకైనా నిర్విఘ్నంగా చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని ‘బాలాత్రిపుర సుందరీ దేవి’ అలంకారం మనకి చెప్తుంది. (బాలా రూపానికి పదిరోజులూ త్రిపుర రూపానికి పదిరోజులూ సుందరీ రూపానికి పదిరోజులూ కలిపి మొత్తం నెలరోజుల ఆరాధన)
 
 విదియ: పాడ్యమినాడు ప్రారంభించిన పక్షంలో వ్యక్తికి విదియనాడు- అంటే రెండవ రోజున (ద్వితీయ) మానసిక ఆందోళన తొలగుతుంది. చంద్రుడు ఆకాశంలో సన్నని గీత ఆకారంలో ఈ రోజున అర్ధచంద్రాకారంగా కనిపిస్తాడు. దీన్నే లోకంలో నెలపొడుపు, నెలబాలుడు అని పిలుస్తారు. స్త్రీలు ఈ తిథినాడు చంద్రుణ్ణి దర్శించాలని చెప్తారు పెద్దలు. దానిక్కారణం స్త్రీలకి మానసిక బలం తక్కువ ( అ- బల)కాబట్టి. అలాంటి మనోబలం స్త్రీకి కలిగిన రోజున ఇల్లంతా సిరితో నిండినట్లే. అందుకే ఈ రోజున కనిపించే అలంకారం శ్రీ మహాలక్ష్మి.
 
 తదియ: ఈ రోజు ప్రారంభించబడిన పని అక్షయంగా సాగుతుంది. అందుకే తదియ తిథినాడు అక్షయ తదియ- అక్ష తదియ- అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనే పండుగ వైశాఖమాసంలో వస్తుంది. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ధనం కాదు ఆహారం. అందుకే ఈ రోజున అన్నపూర్ణాలంకారాన్ని వేయాలన్నారు పెద్దలు.
 
 చవితి: శుద ్ధచవితి అలాగే కృష్ణ చవితి లేదా బహుళ చవితి అనేవి వినాయకునికి ఇష్టమైన తిథులు. శుద్ధ చతుర్థి విఘ్నాలని నివారించి ఐశ్వర్యాన్ని కలిగించేందుకు బహుళ చతుర్థి కష్టాలని తొలగించేందుకూ ఏర్పడ్డాయి. అందుకే ప్రతిమాసంలోని బహుళ చతుర్థినీ సంకష్ట హర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున అమ్మకి వేసే అలంకారం గాయత్రి. ఏ మంత్రాన్ని ఉసాసించాలన్నా ముందుగా ఉపాసించి తీరాల్సింది గాయత్రినే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. అలా చేసిన రోజున అమ్మ ఏ మంత్రాన్నైనా పట్టిచ్చేలా చేస్తుంది సాధకునికి.
 
 పంచమి: పంచమీ పంచభూతేశీ పంచ సంఖ్యోపచారిణీ... అనే ఈ నామాలు. పంచభూతాలకీ అధిపత్ని అమ్మ అనీ, మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి అనే పంచ పల్లవాలూ అమ్మకి ప్రీతికరాలనీ పంచాగ్నుల మధ్య (నాల్గుదిక్కులా నాలుగు నిప్పుమంటలు పైన సూర్యుడు ఉండగా) తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించిన తల్లి అనీ చెప్తుంది ఈ తిథి. పంచమినాడు ప్రారంభిస్తే పని మీద పట్టుదల పెరుగుతుంది వ్యక్తికి. అందుకే ఈనాడు వేసే అలంకారం లలితాదేవి. భండాసురాది రాక్షసుల్ని వధించేవరకూ విశ్రమించలేదు ఆమె.
 
 షష్ఠి: అన్నింటికీ మూలం విద్యయే అనే విషయాన్ని తెలియజేస్తూ మూలా నక్షత్రం నాడు కనిపించే ఈ తిథి షష్ఠి. ఈరోజున సరస్వతీ అల ంకారం వేస్తారు. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ఆహారమైతే మూలాధారంగా ఉండాల్సింది విద్య. ఇక్కడ విద్య అంటే మనం చదువుకునే చదువు కాదు. జీవితాన్ని నడుపుకోవడానికి ఏ వృత్తి అవసరమో ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానమని అర్థం.
 
 సప్తమి: సంపూర్ణ భోగాలనిచ్చే తిథి సప్తమి. అందుకే ఏడుకొండలు కలిగి ఐశ్వర్యవంతుడు, ఏడువర్ణాలు ఒకచోట కూడి (సరిగమ పదని) ప్రపంచాన్ని ఆనందమయం చేసే సంగీతం, ఏడు చక్రాలు కలిగి శరీరానికి సంపూర్ణతని కలుగజేసే కుండలినీ విధానం ఏడడుగులతో ఏడు మాటలతో జీవితాల్ని దగ్గరకి చేర్చే సప్తపది... ఇవన్నీ ఏడుతో ముడిపడినవే. ఇలాంటి ఏడుతో ముడిపడిన పక్షంలో అది నిజమైన భోగానికి ప్రతీక అని గుర్తు చేస్తూ అమ్మకి ఈ రోజున భోగరూపమైన భవానీ అలంకారాన్ని వేస్తారు.
 
 అష్టమి: ఈ తిథి కష్టాలని ఎదుర్కొనేందుకు సంకేతం. అష్టకష్టాలు, అష్ట దారిద్య్రాలు... అని వింటూంటాం. అదే సందర్భంలో అష్టైశ్యర్యాలనే మాట కూడ వింటుంటాం. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కొన్న పక్షంలో ఐశ్వర్యం మనదే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. దుర్గాదేవి రాక్షసునితో యుద్ధానికి సిద్ధపడుతూ కష్టాలను ఎదుర్కోదలిచింది కాబట్టే ఈ తిథి దుర్గాష్టమి అయింది. అసలు అష్టమి ఎప్పుడూ సవాళ్లని ఎదుర్కోవలసిన తిథే.
 
 నవమి: మహ త్- గొప్పదైన, నవమి- తొమ్మిదవ రోజు అనే అర్థంలో ఇది మహానవమి అవుతుంది నిజానికి. అయితే ‘మహర్నవమి’ అని ఎందుకో ప్రచారంలోకి వచ్చింది. అష్టమినాటి అర్ధరాత్రి కాలంలోనే ప్రారంభిస్తారు అర్చనని. (క్రోధం బాగా ఆవహించే ఈ రూపాన్ని ’కాళి’ అని పిలుస్తారు. కాళి అనే మాటకి కాలాన్ని అంటే ఎదుటివ్యక్తి మృత్యువుని తన అధీనంలో ఉంచుకునేది అని అర్థం. ధర్మబద్ధమైన విజయాన్ని సాధించాలంటే అది నవమీ తిథికి సొంతం. రాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి కావడానిక్కారణం ఇదే.
 
 దశమి: ఇది పూర్ణ తిథి. శ్రీహరి ప్రధానావతరాలనెత్తింది పది సంఖ్యతోనే. లోకాన్ని రక్షిస్తూన్న దిక్కులు కూడ పది. (నాలుగు దిక్కులూ నాలుగు విదిక్కులూ పైన, కింద కలిపి పది). శరీరం నిండుగా వ్యాపించి ఉన్న వాయువులు కూడ దశ విధ వాయువులే. దశేంద్రియాలు కూడా ఈ తీరుగా కనిపించేవే. ఇది విజయ సంఖ్య.
 
 అందుకే అమ్మ తన ప్రస్థానాన్ని ప్రారంభించి పదవ తిథియైన దశమినాడు రాక్షస సంహారాన్ని చేసి లోకానికి జయాన్ని కల్గించి, ఆ జయమనేది దైవమైన తాను సాధించి లోకక్షేమం కోసం వినియోగిస్తోంది కాబట్టి దాన్ని ‘విజయ దశమి’అని వ్యవహరించింది.
 
 ఈ రోజున ఉదయం చేసే అలంకారం మహిషాసుర మర్దిని. సాయంవేళ రాజరాజేశ్వరీ అలంకారం. అమ్మకి తన సంతానపు రక్షణ అతి ముఖ్యం కాబట్టి, లోకంలో వ్యాధులు బాగా ప్రబలే వసంత శరత్కాలాల్లోనే తన ఉత్సవాలు పదిరోజులపాటూ ఆహార నియమాలని తానే నైవేద్యాల రూపంగా (ఔషధాలుగా) మన చేత చేయిస్తూ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఆ జగన్మాత.
 
 ‘శరద్వసంత నామానౌ లోకానం యమదంష్ట్రికే’ ఈ శరత్ వసంత ఋతువుల్లోకే యమునికి పని ఎక్కువ అని తెలియజేస్తూ ఈ కాలాన్ని యమదంష్ట్రికా కాలం (యముని కోరలు తెరిచి ఉంచే కాలం) అంది శాస్త్రం.
 
 ఆ కారణంగా ఏయే తిథుల్లో ఏ యే రూపాలతో అమ్మని ఆరాధించాలో తెలుసుకుని నిత్యం ఆ రూపంతో ఉన్న అమ్మని ధ్యానిస్తూ ఉంటే (నివేదనలు ప్రధానం కాదు నామ పారాయణ ప్రీత కాబట్టి నామ పారాయణని చేస్తూ) ఆ తల్లి మనకి మానసిక శారీరక ఆరోగ్యంతోపాటు ఐశ్వర్య సుఖ సంతోషాలనిస్తుంది.
 
 తన్నో దుర్గిః ప్రచోదయాత్!
 - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు

 
 మీకు తెలుసా!
 వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు రావణుని మీద దండు వెడలిన దినం విజయ దశమే.  
 
 దుర్గ మహిషాసురుని అంతమొందించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు ఉత్తర గోగ్రహణం చేసి విజయం పొందిన రోజని... ఇలా విజయ దశమి జరుపుకోవడం వెనుక రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి.
 
  శమీ వృక్షం అగ్ని అంటే తేజస్సుకు సంకేతం. అందుకే విజయ దశమినాడు శమీ వృక్షాన్ని అంటే జమ్మి చెట్టును దర్శిస్తే పాపాలను పోగొడుతుంది. మన లోపల, బయట ఉన్న శత్రువులను నశింప చేస్తుందని ప్రతీతి.
 
 కొన్ని ప్రాంతాలలో దసరాను వీరత్వానికి సంకేతంగా భావిస్తారు. శ్రీ రాజ రాజేశ్వరీ దేవికి పెరుగన్నం నివేదిస్తే సంసారం చ ల్లగా
 ఉంటుందంటారు.
 

మరిన్ని వార్తలు