ఆ ‘ఊరి’ కూరగాయలు...

1 May, 2014 22:33 IST|Sakshi
ఆ ‘ఊరి’ కూరగాయలు...

ప్రత్యేకం
 
ప్రతి ఇంటికీ నాలుగు కాయగూర మొక్కలుంటే వంటకు తడుముకోవక్కర్లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కాయగూరధరల కారణంగా పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్నారు కేరళలోని పడమటి కనుమల్లో మారుమూల ప్రాంతానికి చెందిన లిక్కనానమ్ గ్రామస్తులు. అధిక పెట్టుబడుల కారణంగా ఆ ఊళ్లో రైతులు కాయగూరలు పండించడానికి ముందుకు రాకపోవడంతో దూరంగా ఉన్న మార్కెట్‌కి వెళితేగాని నాలుగు రకాల కాయగూరలు కళ్లచూడని దుస్థితి.

ఎలాగైనా ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలనుకున్నారు ఆ గ్రామంలోని స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు. వారు ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం పెట్టుకుని రకరకాల కాయగూరల మొక్కల్ని ఇంటింటికీ పంచాలనుకున్నారు. మంచి నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో మొలకలు పెట్టి మహిళలందరికీ పంచారు.

ఇంటికి ఐదు రకాల మొక్కల చొప్పున అందరిళ్లలో మొక్కలు నాటేవరకూ వాళ్లు నిద్రపోలేదు. అంతేకాదు... అప్పుడప్పుడు వాటిని పర్యవేక్షించే పనికూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ రోజుతో వదిలేయకుండా విడతలవారీగా కాయగూర మొక్కల్ని పంచే అక్కడి మహిళల పథకాన్ని చుట్టుపక్కల గ్రామాల వరకూ విస్తరించడానికి  ప్రయత్నించడం విశేషం.

ఇలా పెంచే మొక్కలకు రసాయనిక ఎరువులు వాడకూడదనేది అక్కడి మహిళలు పెట్టిన నిబంధన. కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆ మొక్కల్ని పెంచాలి. ఎంచక్కా పెరట్లో నాలుగు రకాల కాయగూరలు అందుబాటులో ఉంటే ఆదాతో పాటు ఆరోగ్యం కూడా వుంటుందంటున్నారు లిక్కనానమ్ గ్రామ మహిళలు.
 

మరిన్ని వార్తలు