మునిగిపోకుండా ఉండాలంటే..!

13 Nov, 2016 00:36 IST|Sakshi
మునిగిపోకుండా ఉండాలంటే..!

బౌద్ధవాణి

‘సమ్యక్ సంకల్పం, సమ్యక్ జ్ఞానం ఉండి, మన మనస్సు దృఢంగా ఉంటే మనం దుఃఖ సాగరంలో మునిగిపోం’ అని తెలియజెప్పే సంఘటన ఇది. బుద్ధుడు శ్రావస్తిలోని జేతవనంలో ఉన్నాడు. ప్రతిరోజూ సాయంత్రం తొలి జాములో ధర్మోపదేశం చేసేవాడు. శ్రావస్తి సమీపంలో అచిరవతి నది పాయ ఒకటి ఉండేది. దానికి ఆవలి వైపు గ్రామంలో సుజాతుడనే బుద్ధుని అభిమాని ఒకడుండేవాడు. అతను గృహస్థుడే అయినా ‘బుద్ధ ధమ్మా’న్ని చక్కగా పాటిస్తుండేవాడు. ‘పంచశీల’ను ఆచరించేవాడు. ఒకసారి అతను బుద్ధుని ప్రవచనం వినడానికి బయలుదేరాడు. నదీ తీరానికి వచ్చేసరికి పడవల వాళ్లెవరూ లేరు. అయినా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ధైర్యంతో నీటిలో దిగాడు. ‘పంచశీల’ పఠించాడు. ధమ్మాన్ని స్మరించాడు. అడుగు ముందు కేశాడు. విచిత్రం అతను నీటిలో దిగిపోలేదు. నీటి పైన నడుస్తూ వెళ్లిపోతున్నాడు. అలా కొంతదూరం వెళ్లాడు. అక్కడే నదిలో అలలు అల్లకల్లోలంగా ఉన్నాయి. అతని దృష్టి అలల మీదికి మళ్లింది. అంతే... మనస్సులో భయం పొడసూపింది.

అంతే... సుజాతుడు మెల్లగా నీటిలోకి దిగబడిపోతున్నాడు. అతను వెంటనే చంచలమైన తన చిత్తాన్ని దిటవు పరచుకున్నాడు. తిరిగి నీటి మీద తేలి, నడచి ఆవలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. బుద్ధుని దగ్గరకు వెళ్లి నమస్కరించాడు.

 ‘‘సుజాతా! ఎలా వచ్చావు?’’ అని అడిగాడు బుద్ధుడు. సుజాతుడు జరిగింది చెప్పాడు.‘‘దృఢ చిత్తం లేనివానికి మనస్సు వ్యాకులత చెందుతుంది. బలహీనపడుతుంది. లక్ష్యాన్ని చేరనీయకుండా, నిస్తేజంగా ముంచేస్తుంది. సద్ధర్మమే నిన్ను దుఃఖమనే ఏట్లో మునిగిపోకుండా కాపాడుతుంది’’ అని బుద్ధుడు చెప్పాడు.ఈ కథలో ఒక చక్కటి నీతి ఉంది. భయాన్ని జయించడం, చిత్త బలాన్ని చేకూర్చుకోవడం, సడలని సంకల్పం వల్ల ఎంతటి అవాంతరాన్నైనా దాటవచ్చు అనే బుద్ధ సందేశం.

 - బొర్రా గోవర్ధన్

మరిన్ని వార్తలు