-

మధుమేహం మందులతోనూ కేన్సర్లకు చికిత్స!

27 Jan, 2020 01:37 IST|Sakshi

పరి పరిశోధన

వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ వ్యవహారం. మధుమేహంతోపాటు... మద్యపానాన్ని తగ్గించేందుకు వాడే మందులు.. ఆఖరకు కుక్కుల కీళ్ల నొప్పులు తగ్గించేందుకు వాడే మందులు కూడా కేన్సర్‌ కణాలను చంపేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన బ్రాడ్‌ ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన డానా ఫేబర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు జరిపిన తాజా పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వేర్వేరు వ్యాధులకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులను వీరు కేన్సర్‌ కణాలపై ప్రయోగించి చూశారు.

మొత్తం 4518 మందులను పరీక్షించగా వీటిల్లో కనీసం 50 మందులు 578 రకాల కేన్సర్‌ కణాలపై మెరుగైన ప్రభావం చూపుతున్నట్లు ఈ పరిశోధన ద్వారా తెలిసింది. కేన్సర్లకు కొత్త మందులు అభివద్ధి చేసేందుకు, ఉపయోగిస్తున్న మందులనే కేన్సర్‌ చికిత్సలో భాగం చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా. పరిశోధన మొదలైన తొలినాళ్లలో కేన్సర్‌పై పనిచేసే మందు ఒక్కటి కూడా గుర్తించలేమని తాము అనుకున్నామని, ఏకంగా 50 వరకూ ఉండటం ఆశ్చర్య పరిచిందని టాడ్‌ గోలబ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు ఉపయోగించే మందులు, మంట/వాపు కోసం వాడేవి కూడా కేన్సర్‌ కణాలను చంపేయడంతోపాటు ఇతర కణాలపై ఎలాంటి దుష్ప్రభావమూ చూపలేదని, కొన్ని మందులైతే ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ప్రొటీన్లను నిరోధించడం ద్వారా కేన్సర్‌ కణాలను మట్టుబెట్టాయని టాడ్‌ తెలిపారు. టెపోక్సాలిన్‌ అనే మందు కేన్సర్‌ కణాల్లో గుర్తుతెలియని లక్ష్యాన్ని ఢీకొట్టి ఎండీఆర్‌1 అనే ప్రొటీన్‌ ఉత్పత్తి నియంత్రిస్తూ చంపేస్తోందని, ఈ ప్రొటీన్‌ కీమోథెరపికి శరీరం స్పందించకుండా చేస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు