నీటి అడుగున చిత్రం

27 Jan, 2020 01:37 IST|Sakshi

వినూత్నం

కళాకారులంటేనే సృజన శీలురు. ఏ పని అయినా చాలా వినూత్నంగా చేయాలని కోరుకుంటారు. క్యూబాకు చెందిన శాండోర్‌ గొంజాలెజ్‌ చిత్రకారుడు చూసినది చూసినట్టు కాన్వాస్‌పై చిత్రించేస్తాడు. అయితే, భూ ఉపరితలంపై అన్నింటినీ చిత్రించేశాడో, లేక పైన ఎక్కడా సరైన ప్లేస్‌ లేదనుకున్నాడో ఏమో గాని.. సముద్రం లోపలికి వెళ్లి నేరుగా ఆ లోపలి జలరాశిని, చేపలను, సొరచేపలను, పగడపుదిబ్బలను చూస్తూ పెయింటింగ్‌ వేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరంజామా అంతా ఏర్పాటు చేసుకొని సముద్రంలో మునిగాడు. శాండోర్‌ వయసు 42. నలుపు–తెలుపు చిత్రాలను, వేటకు సంబంధించినవి, పట్టణ, పల్లె జీవనశైలులు కాన్వాస్‌పై కళ్లకు కట్టేలా చిత్రించి అంతర్జాతీయంగా పేరొందినవాడు.

ఆరేళ్ల క్రితం..
క్యూబా దీవుల్లో స్కూబా డైవింగ్‌లో పాల్గొన్నప్పుడు నీటి కింద కనిపించే ప్రశాంతత, అక్కడి ప్రకృతి అందమైన రూపాలు చూసి అబ్బురపడ్డాడు. ‘తేలికపాటి అలలు, మృదువుగా మనసును తాకే సవ్వడులు నాలో ఒక అలౌకికమైన ఆనందాన్ని నింపాయి’ అంటాడు శాండోర్‌. స్పెయిన్‌లో ఒక జీవశాస్త్రవేత్త నీటి అడుగున పెయింటింగ్‌ వేశారని ఎవరో బ్లాగర్‌ ద్వారా తెలుసుకున్నప్పటికీ తనకు తానుగా ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు.

నీళ్లలో తడిస్తే తుడుచుకుపోయే పెయింట్‌ కాకూడదని, భూమి పైనా ఆ చిత్రాలతో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తెల్లటి కాన్వాసులను ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టి, వాటిలో ఉప్పు ఇతర సేంద్రీయ పదార్థాలను వదిలించడానికి ప్రత్యేకంగా కడగడం ఎలాగో, వాటిని ఎలాంటి పద్ధతుల్లో ఆరబెట్టాలో నేర్చుకున్నాడు. నీ అడుగున చేరి కాన్వాస్‌పై ఏ రంగులు.. ఎలా వేయాలో తెలుసుకున్నాడు.

సరైన సరంజామాతో..
స్కూబా డైవింగ్‌ గేర్, ఆక్సిజన్‌ ట్యాంక్, కాళ్లకు కట్టుకునే ఎల్లో ఫ్లిప్పర్స్, కాన్యాస్, ఇతరత్రా సామగ్రి అంతా తీసుకొని సముద్రంలో మునిగి 197 అడుగుల లోతుకు వెళ్లి తన పెయింటింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. మరో ఇరవై అడుగుల లోతులో నీటి ఉధృతి లేని చోటు చూసుకుని కాన్వాస్‌ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆక్సిజన్‌ ట్యాంక్‌ పరిధి మేరకు ముప్పై నిమిషాల సేపు నీటి అడుగు లోపలి అందాలను వీక్షిస్తూ పెయింటింగ్‌ వేసుకొని పైకి వచ్చేస్తాడు.

పారదర్శకంగా కనిపించే నీళ్లలో 200 అడుగుల లోతు నుంచి పైకి చూస్తూ ఆ కనిపించే ప్రపంచంలో ఎగిరి తిమింగళాలు, చేపలు, కదలాడుతున్నట్టు కనిపించే ఇండ్లు, చెట్లు, ఆకాశం... ఇలా ఎన్నో అందాలు  ఆ చిత్రాల్లో కనిపిస్తాయి. ‘నీటి అడుగున పెయింటింగ్‌ వేయడం ప్రపంచంలో మరెక్కడా లేదని నేను అనుకోను. నేనైతే జలంతర్గామి పెయింటింగ్‌ను నీటిలో ఉండి చిత్రించాలనుకుంటున్నాను’ అంటూ తన ముందున్న లక్ష్యాన్ని వివరిస్తాడు శాండోర్‌. ఇప్పుడు క్యూబా దీవుల్లో టూరిస్టులకు, స్కూబా డైవింగ్‌ చేసేవారికి శాండోర్‌ నీటి అడుగు చిత్రాల గురించి అక్కడి స్థానికులు ప్రత్యేకంగా చెబుతుంటారు.

మరిన్ని వార్తలు