ఇవి తీసుకుంటే మధుమేహానికి దూరం

15 Oct, 2018 15:29 IST|Sakshi

లండన్‌ : కొవ్వు అధికంగా ఉండే వెన్న, పెరుగు, మీగడ వంటి డైరీ ఉత్పత్తులను తరచూ తీసుకుంటే టైప్‌ 2 మధుమేహం ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. వీటిని తక్కువగా తినేవారితో పోలిస్తే అత్యధికంగా తీసుకునేవారిలో టైప్‌ 2 మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా కొవ్వు తక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులను ఎంచుకోవాలని అమెరికన్లకు యూఎస్‌ డైటరీ గైడ్‌లైన్స్‌ సూచిస్తున్నాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల్లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో తాజా అథ్యయనం ఆసక్తికర అంశాలను ముందుకుతెచ్చింది. డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా ప్రజలను ప్రోత్సహించరాదని తమ అథ్యయనంలో వెల్లడైందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు.

డైరీ ఆహారంతో చేకూరే జీవక్రియల ప్రయోజనాలపై పునఃసమీక్ష అవసరమని పేర్కొన్నారు.  డైరీ ఉత్పత్తుల్లో గుండె జబ్బులకు దారితీసే ఎల్‌డీఎల్‌ కొలెస్ర్టాల్‌ను పెంచే కొవ్వు ఉత్పత్తులు ఉంటాయని గత అథ్యయనాల ఆధారంగా వీటిని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్న క్రమంలో తాజా అథ్యయనం వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.

గత 20 ఏళ్లుగా 63,600 మందికి పైగా హెల్త్‌ రికార్డులను పరిశీలించిన మీదట తాజా అథ్యయనం ఈ అంచనాలకు వచ్చింది. వీరిలో అత్యధికంగా డైరీ కొవ్వులను తీసుకున్న వారిలో టైప్‌ 2 మధుమేహం వచ్చిన వారు తక్కువగా ఉన్నట్టు తేలింది. డైరీ ఫ్యాట్‌ తక్కువగా తీసుకున్న వారిలో టైప్‌ 2 మధుమేహం బారిన పడిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు పరిశోధనలో తేలింది.

డైరీ ఫ్యాట్‌ బయోమార్కర్లకు వారి టైప్‌ 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు తొలిసారిగా తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జికి చెందిన డాక్టర్‌ ఫుమియకి ఇమముర పేర్కొన్నారు. దీనిపై విస్తృత అథ్యయనం అవసరమని తమ పరిశోధనలో గుర్తించామని చెప్పారు.

మరిన్ని వార్తలు