ఎవరూ లేకుండానే

29 Aug, 2019 07:39 IST|Sakshi

చెట్టు నీడ

అతనో ధనవంతుడు. బోలెడంత సంపద. దాంతో అతను బంధువులందరినీ కాదని కొందరు నౌకర్లతో ఉంటున్నాడు. ఏం కావాలన్నా పనివాళ్లున్నారనే ధీమాతో ఉన్నాడు. ఓరోజు ఓ జ్ఞాని అనుకోకుండా ఆయన వద్దకు వచ్చాడు. ధనికుడు సకల మర్యాదలతో ఆహ్వానించాడు.‘‘ఏరీ నీ భార్యా పిల్లలూ? ఇక్కడి వాతావరణం చూస్తుంటే బంధువులెవరూ కూడా వచ్చిపోతున్నట్లని పించడం లేదు? నీ బంధువులందరూ ఏమయ్యారు? ఎంతసేపూ నౌకర్లే కనిపిస్తున్నారు?’’ అని అడిగాడు జ్ఞాని. దానికి ధనికుడిలా జవాబిచ్చాడు.. ‘‘నాకు బోలెడంత డబ్బు ఉంది. నాకేం కావాలన్నా చేసిపెట్టడానికి నౌకర్లున్నారు. నేను గుమ్మం దాటక్కర్లేదు. అటువంటప్పుడు నాకు భార్యా బిడ్డల అవసరమేముంది. బంధువులెవరూ రాకున్నా నాకేమీ నష్టం లేదు. నాకు వాళ్లెవరితోనూ ఏ అవసరమూ లేదు’’ అని.

‘‘ఓహో.. అలాగా! కాస్సేపు నాతో అలా వస్తావా? అటూ ఇటూ తిరిగొద్దాం’’ అన్నాడు జ్ఞాని.‘‘సరే’’ అంటూనే ఎండలో రమ్మంటాడేమిటీ అని మనసులో అనుకుంటాడు. కానీ రాలేనని చెప్పడం ఇష్టంలేక అన్యమనస్కంగానే బయలుదేరుతాడు జ్ఞాని వెంట ధనికుడు. కొంచెం దూరం వెళ్లేసరికే ఎండకు తట్టుకోలేక నీడకోసం చుట్టూ చూశాడు.అది తెలిసి జ్ఞాని ఏమీ ఎరగనట్టే ‘‘ఎవరికోసం చూస్తున్నావు? నీకెవరి తోడూ అక్కర్లేదన్నావుగా? నీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నౌకర్లు ఉన్నారుగా. అయినా నీ నీడే నీకుందిగా. అందులో సేదదీరవచ్చుగా?’’ అన్నాడు. ‘‘అదెలా కుదురుతుంది స్వామీ? నా నీడ నాకెలా నీడనిస్తుంది?’’ అని ప్రశ్నిస్తూనే తన తప్పు తెలుసుకుని మౌనంగా తలదించుకున్నాడు ధనికుడు.అందుకే అంటారు అనుభవజ్ఞులు.. డబ్బులెంత వరకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలని. చుట్టాలూ పక్కాలూ స్నేహితులూ అంటూ బంధాలన్నీ పరస్పర తోడు నీడలకోసం అవసరమే. ఒంటికన్ను రాకాసిలా నాకెవరి తోడూ అవసరం లేదనుకునే బతుకు బతుకే కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు, పోయేటప్పుడూ నలుగురి అవసరం ఉందనే వాస్తవం గుర్తెరిగి నడచుకోవాలి.– సాత్యకి వై.

>
మరిన్ని వార్తలు