ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

19 Feb, 2018 01:57 IST|Sakshi

102 నాటవుట్‌ – టీజర్‌
నిడివి: 1 ని. 02 సె.; హిట్స్‌: 49,95,900

అమితాబ్, రిషి కపూర్‌ అనగానే ‘చల్‌ మేరే భాయ్‌’... పాట గుర్తుకొస్తుంది. ‘నసీబ్‌’లో వాళ్లిద్దరూ కలిసి యాక్ట్‌ చేశారు. ‘అమర్‌ అక్బర్‌ ఆంథోనీ’లో కూడా వాళ్ల జోడీ పండింది. 27 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్లు తిరిగి నటిస్తున్నారు. సినిమా పేరు ‘102 నాటవుట్‌’. గుజరాతీ రచయిత సౌమ్యా మిశ్రా రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో 102 ఏళ్ల తండ్రి అతని 75 ఏళ్ల కొడుకు మధ్య ఉన్న బంధాన్ని చర్చిస్తుంది.

ఆశ్చర్యం ఏమిటంటే కొడుకు తండ్రిని చూసుకోవడం కన్నా తండ్రి కొడుకును చూసుకోవడం ఈ సినిమా విశేషం. కొడుకులు సాధారణంగా తండ్రులను వృద్ధాశ్రమానికి పంపుతుంటారు కదా. ఇందులో తండ్రి కొడుకును వృద్ధాశ్రమానికి పంపుతానంటాడు. తర్వాత ఏమవుతుందనేది కథ. గతంలో ‘ఓ మై గాడ్‌’ వంటి హిట్‌ సినిమా తీసిన ఉమేష్‌ శుక్లా ఈ సినిమాకు దర్శకుడు. ప్రేక్షకుల్లో కుతూహలం రేపుతున్న ఈ సినిమా టీజర్‌ యాభై లక్షల హిట్స్‌కు సమీపించింది.


ఎవ్విరి స్కూల్‌ రొమాన్స్‌ – షార్ట్‌ఫిల్మ్‌
నిడివి: 5 ని. 52 సె.; హిట్స్‌: 49,00,350

హైస్కూల్‌ స్థాయి వయసొచ్చాక– కో ఎడ్యుకేషన్‌ అయితే గనుక– స్కూళ్లలో కలిగే ఆకర్షణలు, కోరుకునే స్నేహాలు, ఇన్‌ఫాచ్యుయేషన్‌... వీటి మీద ఏ షార్ట్‌ఫిల్మ్‌ కనిపించినా నోస్టాల్జియాలోకి వెళ్లిన అనుభూతి వస్తుంది. ‘ఫిల్టర్‌ కాఫీ’ యూ ట్యూబ్‌ చానల్‌ తయారు చేసిన ‘ఎవ్విరి స్కూల్‌ రొమాన్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ స్కూళ్లో అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణలో చోటు చేసుకునే సరదాలను చూపిస్తుంది.

స్కూల్‌ బస్‌లో సీటు తీసి పెట్టడం, కోడ్‌ నేమ్స్‌ పెట్టుకుని మాట్లాడటం, ఇంటికి ఫోన్‌ చేస్తే తల్లో తండ్రో ఎత్తితే హడలిపోయి పెట్టేయడం, లంచ్‌ బాక్స్‌ షేర్‌ చేసుకోవడం.. ఇవన్నీ కనిపిస్తాయి. చివరకి ఎస్‌ అంటే ఎస్‌ అనుకున్నా సాధారణంగా ఇలాంటి ఆకర్షణలన్నీ స్కూలు ముగిశాక అంతమైపోతుంటాయి. సరదాగా చూడదగ్గ షార్ట్‌ఫిల్మ్‌ ఇది. .

ఒరు అదార్‌ లవ్‌ – టీజర్‌
నిడివి: 44 సె.; హిట్స్‌: 1,64,92,700

కన్ను కొట్టే అమ్మాయి ప్రియా వారియర్‌ పుణ్యాన ఈ సినిమా రిలీజ్‌కు ముందే దేశమంతా తెలిసి పోయింది. వాస్తవానికి ఇది చిన్న మలయాళ సినిమా. రాబోయే రంజాన్‌ పండుగకి (జూన్‌) దేశంలో విడుదల కానుంది. కేరళకు çపరిమితం కావాల్సిన ఈ వ్యవహారం ఒక పాటలో ప్రియా ప్రదర్శించిన హావభావాల వల్ల విపరీత ప్రచారం పొందింది.

‘ఒరు ఆదార్‌ లవ్‌’ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల స్కూలు ప్రేమ కథ. రొమాంటిక్‌ కామెడీలు తీస్తాడని గుర్తింపు పొందిన ఒమర్‌ లులు దీనికి దర్శకుడు. దీని కోసం అందరూ కొత్తవారిని తీసుకుంటే వారిలో ఒకరైన ప్రియా వారియర్‌ దేశాన్ని ఆకర్షించింది. వారంలోనే దీని అఫీషియల్‌ టీజర్‌ కోటిన్నర హిట్స్‌ను దాటిపోయింది. అంతా ప్రియా లీల.

మరిన్ని వార్తలు