స్త్రీలోక సంచారం

15 Sep, 2018 00:50 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

కొట్టాయంలోని ఒక నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపి, మళ్లీ మళ్లీ అందుకోసం ఆమెను వేధిస్తున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ముల్లకల్‌ను తక్షణం అరెస్టు చేయాలని కేరళ వ్యాప్తంగా జరుగుతున్న నన్‌ల నిరసన ప్రదర్శనలు వారం రోజులు దాటినా చర్చి వైపు నుంచి గానీ, ప్రభుత్వం వైపు నుంచి గానీ ఎటువంటి స్పందన లేకపోవడాన్ని.. తనపై జరిగిన అత్యాచారాల కంటే కూడా పెద్ద అవమానంగా భావిస్తున్నట్లు భారతదేశంలోని వాటికన్‌ రాయబారి అపోస్తలిక్‌ నన్షియో గియాంబెటిస్టా డికట్రోకు సెప్టెంబర్‌ 8న రాసిన ఉత్తరంలో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తన పక్కన పడుకోనందుకు’ బిషప్‌ నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాడని నిస్సిగ్గు మాటల్లో తన పైఅధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం చూస్తుంటే అసలు క్రైస్తవ చట్టంలో (క్యానన్‌ ‘లా’) నన్‌లు, మహిళల భద్రతకు చోటుందా అనే సందేహం కలుగుతోందని బాధితురాలు ఆ ఉత్తరంలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కిన బాధితురాలు చివరికి బిషప్‌ అమాయకుడని చర్చి తీర్పు చెప్పడంతో హతాశురాలయ్యారు.

 యు.ఎస్‌.ఓపెన్‌ ఉమెన్స్‌ ఫైనల్స్‌లో చైర్‌ అంపైర్‌ కార్లోర్‌ రమోసాను టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌.. ‘దొంగ’ అని తిట్టడం సరికాదని, ఆ పని పురుష క్రీడాకారులు చేసినా తప్పేనని.. ఒకప్పటి టెన్నిస్‌ స్టార్, 18 గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ గెలిచిన చెక్‌ సంతతి అమెరికన్‌.. మార్టినా నవ్రతిలోవా (61) ‘న్యూ యార్క్‌ టైమ్స్‌’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు. 23 సింగిల్స్‌ టైటిల్స్‌తో రికార్డు ప్లేయర్‌గా ఉన్న సెరెనా యు.ఎస్‌. ఉమెన్స్‌ ఫైనల్‌లో తన 24వ టైటిల్‌ని జపాన్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకాకు కోల్పోయిన సందర్భంలో చైర్‌ అంపైర్‌ ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా ఖండిస్తూ, అతడిని దూషించడంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా.. ‘మగాళ్లు చేస్తే తప్పుకాని పని నేను చేస్తే తప్పయింది. వాళ్లకైతే.. నాకు విధించినట్లుగా పెనాల్టీ కూడా ఉండదు’ అని సెరెనా వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘మగాళ్లు చేసినా అది తప్పే’ అని నవ్రతిలోవా తన వ్యాసంలో వ్యాఖ్యానించారు.

  యు.కె.లోని సెయింట్‌ ఆండ్రూస్‌ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అజ్ఞాత భారతీయ కోటీశ్వరుడి కుమార్తెను ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విద్యార్థినిగా పేర్కొంటూ.. ఆమె తండ్రి ఆమెను యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంచకుండా.. ఆమె కోసం ఒక ఖరీదైన భవంతిని కొని, ఆ భవంతికొక హౌస్‌ మేనేజర్‌ను, ముగ్గురు హౌస్‌ కీపర్‌లను, ఒక తోటమాలిని, ఒక పనమ్మాయిని, ఒక బట్లర్‌ను (సేవకులపై ప్రధాన సేవకుడు), ముగ్గురు ఫుట్‌మెన్‌లను (తలుపు తెరవడం, భోజనం వడ్డించడం వీరి పని), ఒక చెఫ్‌ను, ఒక చాఫర్‌ను (కారు డ్రైవర్‌).. మొత్తం 12 మంది సిబ్బందిని నియమించినట్లు ‘సన్‌’ పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఆ భారతీయ కోటీశ్వరుడు తన కుమార్తె అడ్మిషన్‌కి ముందే స్థానిక పత్రికల్లో ఈ సిబ్బంది కోసం ప్రకటన వేయించి, వారిని ఎంపిక చేసి ఉంచాడని, వీరందరికీ ఏడాదికి సుమారు 28 లక్షల 20 వేల రూపాయలు (30 వేల పౌండ్లు) చెల్లిస్తున్నాడని తెలుస్తోంది.
 

  విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్న 11 స్పోర్ట్స్‌ నేషనల్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌ 2018 (సౌత్‌ జోన్‌) పోటీలలో విజయవాడ క్రీడాకారిణి శైలు నూర్‌బాషా.. ఒలింపియన్‌ క్రీడాకారిణి అంకితా దాస్‌పై ప్రీ క్వార్టర్స్‌ ఫైనల్‌లోని ఉమెన్స్‌ సింగిల్స్‌ కేటగిరీలో విజయం సాధించింది. ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘గ్రౌండ్‌మన్‌’గా పనిచేసే ఖాసీం నూర్‌బాషా కుమార్తె అయిన శైలు (20) తొలిసారి 2013లో ఎ.పి. టేబుల్‌ టెన్నిస్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ చాంపియన్‌ షిప్‌ను గెలవగా, మళ్లీ అంతే సంతృప్తికరంగా ఇప్పుడీ ప్రీ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ప్రతిభను కనబరిచింది.

  పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతాన్ని మించి రిజర్వేషన్‌ను కల్పించడం బి.జె.పి. ధ్యేయం అనీ.. ఇప్పటికే బిహార్, మధ్యప్రదేశ్‌ పంచాయతీలలో మహిళలకు 50 శాతాన్ని మించి తమ పార్టీ రిజర్వేషన్‌ ఇచ్చిందనీ జమ్మూకశ్మీర్‌లోని గాంగ్యాల్‌లో ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులైన మహిళలతో మాట్లాడుతూ ఆ పార్టీ ‘మహిళా మోర్చా’ జాతీయ అధ్యక్షురాలు విజయ రహత్కర్‌ అన్నారు. 2011 తర్వాత జమ్మూకశ్మీర్‌లో అక్టోబర్‌ 1–5 మధ్య నాలుగు విడతలుగా పురపాలక సంఘ ఎన్నికలు, నవంబర్‌ 8 డిసెంబర్‌ 4 మధ్య ఎనిమిది విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయ్‌ రహత్కర్‌.. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మహిళా పథకాల లబ్దిదారులతో ముచ్చటించారు.

  1980లు, 90 లలో చురుకైన హీరోయిన్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన తమిళ నటి రేవతి 1996లో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్‌ సురేశ్‌ మీనన్‌ను వివాహమాడాక, అతడితో 2002లో విడిపోయి, 2013లో విడాకులు తీసుకున్న అనంతరం.. ఇప్పుడు తన ఐదేళ్ల కూతురు మహి గురించి తాజా ఇంటర్వ్యూలో.. ఆ చిన్నారికి తను ఐవీఎఫ్‌ పద్ధతిలో జన్మనిచ్చానని వెల్లడించారు. మహిని అందరూ తన దత్తపుత్రిక అనుకుంటున్నారన్న విషయం తెలిసి, భవిష్యత్తులో మహి మనసు నొచ్చుకోకుండా ఉండడం కోసం తానీ సంగతిని చెప్పవలసి వచ్చిందని కూడా రేవతి వివరణ ఇచ్చారు.

  స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన అక్క కొడుకు ‘ఉయ్యాల వేడుక’ సంబరంలో పాల్గొని, కుటుంబ సభ్యులంతా ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, ‘కొత్త సభ్యుడికి స్వాగతం. సంతోష క్షణాలివి. ఫ్యామిలీ ఫస్ట్‌. లవ్‌. ఫన్‌’ అంటూ కామెంట్‌ పెట్టారు.  సిం«ధు తల్లి విజయ.. ఆ చిన్నారిని ఎత్తుకుని ఉండగా, పక్కనే సింధు తండ్రి రమణ, ఆ పక్కన అక్క దివ్య, బావ.. నిలబడి ఉన్న ఆ ఫొటోలో సింధు ఎరుపు రంగు దుస్తుల్లో ఉల్లాసంగా కనిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు