స్త్రీలోక సంచారం

12 Dec, 2018 00:15 IST|Sakshi

బ్యాంకులు, కోర్టులు, చట్టాలు.. విజయ్‌ మాల్యాను వెంటాడి, వేటాడుతున్న ఈ కష్టకాలంలో ఆయనకు ఆర్థికంగా, మానసికంగా, భద్రతపరంగా ముగ్గురు మహిళలు ఆలంబనగా నిలిచారు. విజయ్‌ మారు తల్లి రీతూమాల్యా ఆయన్ని కోట్ల చెల్లింపుల నుంచి కొంతైనా గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌ ప్రియసఖి పింకీ లాల్వాణీ ఆయన్ని ఏ క్షణానికాక్షణం చుట్టుముడుతున్న ఒత్తిళ్ల నుంచి కాపాడుకునేందుకు అనుక్షణం వెన్నంటే ఉంటు న్నారు. విజయ్‌ కేసులో తీర్పునిచ్చిన బ్రిటన్‌ న్యాయమూర్తి ఎమ్మా ఆర్బర్త్‌నాట్‌ ఆయన్ని ఉంచబోయే ముంబై జైలు గదిలోని సదుపాయాలను ఎప్పటికప్పడు సమీక్షించాలని తీర్పునిచ్చారు.

ఆస్తుల్ని అమ్మి అప్పులు తీర్చే క్రమంలో మాల్యా కంపెనీలలో అతి ప్రధానమైనదైన ‘యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌’ (యు.బి.హెచ్‌.ఎల్‌)లో తన షేర్‌లను అమ్మడానికి లేదని కోర్టును ఆశ్రయించడం ద్వారా రీతూ తన కుమారుడికి మేలు చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు తమకేం అభ్యంతరం లేదని బ్రిటన్‌ కోర్టు తీర్పు ఇస్తున్నప్పుడు మాల్యా పక్కనే ఉన్న పింకీ లాల్వాణీ ఆయన చెంతనే ఉండి సాంత్వన వచనాలు పలికారు. ఇక జడ్జి ఎమ్మా ఆర్బర్త్‌నాట్‌.. ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైల్లోని 12వ బ్యారక్‌లో మాల్యాను విచారణ ఖైదీగా ఉంచబోయే గదిలో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వసతులు, సౌకర్యాలను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్యా జీవితమంతా మహిళల చుట్టూనే తిరిగింది. ఇప్పుడా మహిళలే ఆయనకు ఆసరాగా ఉన్నారు.   

మరిన్ని వార్తలు