పదేళ్లలోపు వారికి పది మంచి బుక్స్‌

12 Dec, 2018 00:10 IST|Sakshi

రైట్‌ చాయిస్‌

50 ఏళ్లు. ఐక్యరాజ్యసమితి ‘మానవ హక్కుల దినం’ అంటూ ఒక రోజును ప్రకటించి! ఏటా డిసెంబర్‌ 10న ఈ ‘హ్యూమన్‌ రైట్స్‌ డే’ని జరుపుకుంటాం. కానీ ఏం మారలేదు. ఏడు దశాబ్దాలుగా మనిషి హక్కులు రెక్కలు తెగిన పక్షులు అవుతూనే ఉన్నాయి. కనీసం పిల్లల్నైనా మార్చుకుంటే.. భవిష్యత్‌ తరాలలో హింసకు, హక్కుల ఉల్లంఘనకు తావుండదని ప్రపంచం నమ్ముతోంది. ఆ నమ్మకంతోనే చిన్నారుల్లో సమతాభావం పాదుగొల్పేందుకు ‘అమెజాన్‌’ ప్రచురణల సంస్థ తన ప్రయత్నంగా ఓ పది పుస్తకాలను సూచించింది. మహాశ్వేతాదేవిలాంటి మహారచయితల పుస్తకాలు మొదలుకుని ప్రముఖులు రచించిన ఈ పది పుస్తకాలు పిల్లల్లో మానవహక్కుల పరిరక్షణ భావనకు ఉపకరిస్తాయని అమెజాన్‌ విశ్వసిస్తోంది. ఆ పది పుస్తకాలు.. వివరాలు. 

ద వై వై గర్ల్‌
మహాశ్వేతాదేవి రచించిన వైవై గర్ల్‌ పుస్తకంలోని కథంతా మొయినా అనే పశువులను కాసుకునే అమ్మాయి నేపథ్యంగా సాగుతుంది. మొయినా స్కూల్‌కి వెళ్లి చదువుకునే అవకాశం ఉండదు.  పశువులను కాయడం, ఇంట్లోకి వంటచెరకు సమకూర్చడం, నీళ్లు తీసుకురావడంతోనే ఆమె తలమునకలై పోతుంటుంది. అయినా ఆమె మదినిండా అనేక ప్రశ్నలు. ఆమెను వెంటాడే ఆ ప్రశ్నలను అందరినీ అడుగుతుంటుంది. అందుకే పోస్ట్‌మాస్టర్‌ ఆమెను వై వై గర్ల్‌ అని పిలుస్తుంటాడు. అదే ఈ పుస్తకం పేరు కూడా. ఆరేళ్ల చిన్నారుల కోసం ఉద్దేశించింది ఈ పుస్తకం. 

వి ఆల్‌ ఆర్‌ బార్న్‌ ఫ్రీ
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రపంచ మానవహక్కుల దినోత్సవ ప్రాధాన్యతను బొమ్మల రూపంలో చెప్పే పుస్తకం ఇది. ఆరేళ్ల వయస్సు పిల్లలకోసం ఉద్దేశించిందీ పుస్తకం. ప్రముఖ చిత్రకారుడు ఆక్సెల్‌ షెఫ్లర్‌ సహా పీటర్‌ సిస్, కిట్‌మురా, అలెన్‌ లీ, పాలీ డన్‌బర్, జాకీ మారిస్, డేబీ గ్లియోరీ, క్రిస్‌ రిడిల్, క్యాథరిన్, లారెన్స్‌ అన్‌హాల్ట్‌ లాంటి వారు వేసిన చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఇయర్‌ ఆఫ్‌ ద వీడ్స్‌
సిద్ధార్థ శర్మ రాసిన ఈ పుస్తకం తొమ్మిదేళ్ల వయస్సు పిల్లలకు ఉద్దేశించినది. ఒరిస్సాలోని గోండు తెగకు చెందిన ఆదివాసీ చిన్నారి మైనింగ్‌ మాఫియా నుంచి తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది కథ సారాంశం. గనుల తవ్వకాల కోసం గ్రామాన్ని ఖాళీ చేయించాలన్న కంపెనీని ఎదిరించిన కోరక్‌ ఇందులో హీరో. 

ఎవ్రీ హ్యూమన్‌ హాస్‌ రైట్స్‌
ఈ పుస్తకం ఫొటోగ్రాఫ్‌ల ద్వారా మానవహక్కులను వివరిస్తుంది. దీనికి మేరీ రాబిన్‌సన్‌ ముందుమాట రాశారు. 1948 ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన సందర్భంగా చెప్పిన జీవించే హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు లాంటి మొత్తం 30 హక్కులను గురించి వివరిస్తుంది. 

రైట్‌ టు లెర్న్‌
అతి చిన్న వయస్సులోనే నోబెల్‌ బహుమతిని అందుకునే అరుదైన అవకాశం మలాలాకి దక్కింది. విద్యాహక్కు కోసం ప్రాణాలకు తెగించి తాలిబన్లతో పోరాడిన మలాలా యూసఫ్‌ఝా పై రెబెక్కా లాంగ్‌స్టన్‌ జార్జ్‌ ఈ పుస్తకం రాశారు. 

పంచో రాబిట్‌ అండ్‌ కోయోట్‌
బతుకుదెరువుకోసం ఉన్న ఊరునీ, కుటుంబాలనూ వదిలివెళ్లాల్సి రావడం ఎంత బాధాకరమో బొమ్మల ద్వారా వివరించే పుస్తకం ఇది. కథంతా పంచో అనే కుందేలు చుట్టూ సాగుతుంది. 

కార్పెట్‌ బాయ్స్‌ గిఫ్ట్‌
తన చదువుకోసం, కార్పెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే తన తోటి పిల్లల విద్యాహక్కు కోసం నదీం అనే పాకిస్తానీ పిల్లవాడు చేసే పోరాటమే ఈ పుస్తకం. 

సెపరేట్‌ ఈజ్‌ నెవర్‌ ఈక్వల్‌
ఎనిమిదేళ్ల మెక్సికన్‌ చిన్నారి సెల్వియా మెండెజ్‌ ని శ్వేతజాతీయుల పాఠశాలలో నిరాకరించడం గురించి రాసింది. 

బ్రేవ్‌ గర్ల్‌
అమెరికాలో మహిళా కార్మికుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా 1990లో జరిగిన శ్రామిక మహిళల పోరాటానికి నాయకత్వం వహించిన క్లారా లెమ్చిన్‌ కథ ఇది. ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన క్లారా లెమ్లిచ్‌  కథ బ్రేవ్‌ గర్ల్‌. ఇది కూడా బొమ్మల రూపంలోనే ఉంటుంది. 

యాస్మిన్స్‌ హ్యూమర్‌
కుటుంబ పోషణ కోసం ఇటుక బట్టీల్లో పనిచేసే బాలకార్మికురాలి కథ ఇది. చదువుకోవాలన్న తన కలను నెరవేర్చుకోవడం కోసం రహస్య ప్రణాళిక వేసే యాస్మిన్‌ పై సాగే ఈ కథ విద్య ప్రాధాన్యతను వివరిస్తుంది. 
– అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు