స్నేహత్య | Sakshi
Sakshi News home page

స్నేహత్య

Published Wed, Dec 12 2018 12:20 AM

Family crime story of the week 12 dec 2018 - Sakshi

చేతులు స్పష్టంగా కనిపిస్తున్న ఫొటో అది. కుడి చేతిపై అమ్మ, ఎడమ చేతిపై రాధ అని పచ్చబొట్లు ఉన్నాయి. ‘రాధ’.. ఆ పేరును ఒకటికి రెండు సార్లు అనుకున్నాడు సీఐ.

నమ్మకాన్ని హత్య  చేసేవాడు ఒకడు.విశ్వాసాన్ని హత్య చేసేవాడొకడు.ప్రేమను హత్య చేసే వాడొకడు.పాశాన్ని హత్య చేసేవాడొకడు. హితం కోరేవాడు స్నేహితుడైతే హత్య చేసేవాడు ఏమవుతాడు?

2005 జూన్‌ 27. ఆ ఉదయం వర్షకాల ఆగమనానికి సూచికగా ఆకాశం మబ్బు పట్టి ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. నిజానికి అలాంటి వాతావరణంలో ఊళ్లో ఒక ఉత్సాహం ఉంటుంది. కానీ ఆ గ్రామంలోమాత్రం కలకలం రేగింది.గ్రామం పేరు తక్కెళ్లపాడు.గుంటూరు  శివార్లలో ఉంటుంది.‘ఏం జరిగిందిరా సుబ్బా. అంతా అలా పరిగెడుతున్నారు’ ఎవరో మరొకరిని ఆపి అడిగారు.‘వే బ్రిడ్జి దగ్గర ఎవర్నో చంపి పొలాల్లో పడేశారంట..’ జవాబు చెప్పిన వ్యక్తి తిరిగి పరుగందుకున్నాడు.పొలాలకు నీళ్లు పెట్టే సమయం అది. ఉదయాన్నే పొలాల వైపు వెళ్లాల్సిన కాళ్లు వేబ్రిడ్జివైపు పరుగులు తీస్తున్నాయి. అందరూ చేరుకున్నారు. పొలాల మధ్య గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉంది. రక్తం మట్టిలో ఇంకిపోయింది. దారుణం జరిగిందనడానికి గుర్తుగా చెదిరిన పొలం తాలూకునారుమొక్కలు బెదిరిపోయిన పిల్లల్లా కనిపిస్తున్నాయి.

పెదకాకాని సీఐ వచ్చాడు. సిబ్బంది జనాన్ని కంట్రోల్‌ చేస్తున్నారు.సీఐ అక్కడ పడి ఉన్న డెడ్‌బాడీని పరిశీలించాడు. శరీరంపై లోతైన గాయాలున్నాయి. ఏదైనా  బాటిల్‌తో పొడిస్తే అలాంటి గాయాలుఅవుతాయి. గొంతు, తలపై విచక్షణారహితంగా పొడవడం వల్ల ముఖం గుర్తు పట్టరాకుండా ఉంది. శరీరం నలిగిపోయి ఉంది. బహుశా చెక్క ముక్కలతో విపరీతంగా కొట్టినట్టున్నారు. క్లూస్‌టీం, డాగ్‌ స్వా్కడ్‌లు చేరుకున్నాయి. ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి.శవానికి కొద్ది దూరంలో బీరు బాటిళ్లు, చెక్కలు తప్ప మరే ఆధారం దొరకలేదు. వేబ్రిడ్జి నిర్వాహకుడు‡సుబ్బారావు ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి  మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.‘కేసు ఛేదించాలంటే ముందు మృతుడు ఎవరో తెలియాలి’ ఆలోచనలో పడ్డాడు సీఐ. అప్పుడే సంఘటనాస్థలంలో తీసిన మృతుడి ఫొటోలు సీఐ టేబుల్‌ మీద ఉంచారు సిబ్బంది. వాటిని తీసుకొని ఒక్కొక్కటి గమనిస్తున్నాడతను. ఓ ఫొటో దగ్గర అతని చూపు ఆగిపోయింది.చేతులు స్పష్టంగా కనిపిస్తున్న ఫొటో అది. కుడి చేతిపై అమ్మ, ఎడమ చేతిపై రాధ అని పచ్చబొట్లు ఉన్నాయి.‘రాధ’.. ఆ పేరును ఒకటికి రెండు సార్లు అనుకున్నాడు సీఐ.‘ఈ కేసులో ఈ పచ్చబొట్టే కీలకం కానుందా... ఈ రాధ ఎవరో తెలిస్తే మృతుడెవరో తెలుస్తాడా’ అనుకున్నాడు. 

‘సార్‌..’ అనే మాట వింటూనే ఏంటన్నట్టు చూశాడు కానిస్టేబుల్‌ 205. ‘సర్‌.. నిన్నటి ఈ పేపర్‌..’ అని చేతిలో ఉన్న న్యూస్‌పేపర్‌ చూపించాడతను. ‘సీఐగారు లోపలున్నాడు పదండి’ అని సీఐ దగ్గరకు తీసుకెళ్లాడు కానిస్టేబుల్‌. ‘సార్‌.. నిన్న మనం ఓ న్యూస్‌ ఇచ్చాం కదా! దాని తాలూకు వ్యక్తి వచ్చాడు’ చెప్పి వెళ్లిపోయాడు. సీఐ ఆ వచ్చిన వ్యక్తివైపు చూశాడు. అతడు ఒంటికాలుతో ఉండి, చెక్క కాలును ఆధారంగా చేసుకొని నిలబడి ఉన్నాడు.‘సర్‌.. నా పేరు మణిబాబు. గుర్తు తెలియని యువకుడి హత్య అని పేపర్‌లో ఈ న్యూస్‌ వచ్చింది’ అంటూ పేపర్‌ క్లిప్పింగ్‌ చూపించాడు.‘అవును..’ అన్నాడు సీఐ.‘ఈ ఫొటోలోని పచ్చబొట్టు చూస్తే అతను మా తమ్ముడు సూరియే అని అనుమానంగా ఉంది సార్‌’ అన్నాడు అనుమానం, ఆందోళన నిండిన గొంతుతో.వెంటనే సీఐ అతణ్ణి మార్చురీకి తీసుకెళ్లి అక్కడ భద్రపరిచిన యువకుడి మృతదేహాన్ని చూపించాడు. మృతదేహం చేతిపై ఉన్న పచ్చబొట్టును పరిశీలనగా చూశాడు మణి. అతని కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ‘సార్‌... ఇతను నా తమ్ముడే సూరి’ ‘మరి రాధ ఎవరు?’‘తెలియదు. కానీ మా అమ్మంటే వాడికి చాలా ప్రేమ’ అన్నాడు ‘అమ్మ’ అని ఉన్న పచ్చబొట్టు వైపు చూస్తూ.ఈలోపు బంధువులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం జరిపిన అనంతరం మృతదేహాన్ని మణికి అప్పగించారు పోలీసులు.

సూరి, మణిబాబు అన్నదమ్ములు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కూలి చేసి పిల్లలను చదివించింది. మణిబాబు పదోతరగతితోనే చదువు మానేసి తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. సూరి చదువుకునేవాడు. అయితే ఏడాది క్రితం మణిబాబుకి రోడ్డు ప్రమాదం జరిగి కాలు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది.  తల్లి ఆరోగ్యం అంతంతమాత్రం కావడంతో సూరి కూడా చదువు ఆపేసి పనిలో చేరకతప్పలేదు.మణిబాబు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సూరి స్నేహితులను విచారించారు. 26వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెంకటేశ్, గోవిందస్వామిలతో కలిసి సూరి బైక్‌పై వెళ్తుండటం నాజ్‌సెంటర్‌ వద్ద చూశామని విచారణలో తెలిసింది. వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కో విషయం వెలుగులోకి రాసాగింది. అసలు ఏం జరిగిందంటే...గోవిందస్వామి, వెంకటేశ్, సూరి స్నేహితులు. కానీ వారి మధ్య అంతస్తులో తేడా ఉంది. టౌన్‌లో వెంకటేశ్‌కి ఐరన్‌షాప్‌ ఉంది. స్నేహితుడు కనుక సూరి ఆ షాపులోనే పనికి చేరాడు. చేరిన కొద్ది రోజులకే మంచినమ్మకస్తుడు అని పేరు తెచ్చుకున్నాడు. షాప్‌ పనులే కాకుండా ఇంటి పనులకూ సూరిని పురమాయించేవాడు వెంకటేశ్‌. రెండు నెలల క్రితం షాపును సూరికి అప్పజెప్పి పని మీద హైదరాబాద్‌ వెళ్లాడతను. ఆ సమయంలో సూరి చూడకుండా గల్లపెట్టెలోని లక్షరూపాయలను దొంగిలించాడు గోవిందస్వామి. అతడి దొంగతనం తెలుసుకున్న సూరి ‘నలుగురిలో ఈ విషయం బయటపెట్టక ముందే మర్యాదగా డబ్బు తెచ్చివ్వు’ అని హెచ్చరించాడు. 

‘నీకూ వాటా ఇస్తా! ఇద్దరమూ చెరి సగం పంచుకుందాం. ఏదో లెక్కల్లో జమ చేసేయ్‌. ఈ విషయం చూసీ చూడనట్టు ఊరుకో’ అన్నాడు గోవిందస్వామి. ‘నువ్విలాంటివాడివని తెలియక వెంకటేశ్‌ నిన్ను నెత్తికెత్తుకున్నాడు. అతడు రానీ, నీ విషయం అంతా చెబుతా’ అన్నాడు ఆవేశంగా సూరి. మారు మాటాడకుండా తీసుకెళ్లిన సొమ్ముని తెచ్చిచ్చిన గోవిందస్వామి ఆ నాటి నుంచి సూరిమీద పగ పెంచుకున్నాడు.  ‘సూరి అంత మంచివాడు కాదురా! నీ షాపులో డబ్బులు నొక్కేస్తున్నాడని నాకు సమాచారం తెలుస్తోంది. పైగా నీ చెల్లెలితో బయట తిరుగుతున్నాడు. జాగ్రత్తగా ఉండు’అంటూ వెంకటేశ్‌ను హెచ్చరించేవాడు. వెంకటేశ్‌ మొదట్లో పట్టించుకోలేదు. కానీ, సూరి మీద తన పెద్ద చెల్లెలు రాధ ప్రేమ పెంచుకుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. పైగా రాధ పేరు సూరి పచ్చబొట్టు పొడిపించుకోవడంతో ఇంకా ఉగ్రుడయ్యాడు.‘పని ఇచ్చినవాడినే మోసం చేస్తావా, చంపేస్తా’ అంటూ సూరి మీద దాడి చేశాడు వెంకటేశ్‌.‘మరోచోట పనిచూసుకొని పదిరోజుల్లో నీ చెల్లెలిని తీసుకెళ్తా.. చూసుకో’ అంటూ హెచ్చరించి వెళ్లాడు సూరి.తన దగ్గర పనిచేసేవాడిని చెల్లెలు పెళ్లి చేసుకుంటే టౌన్‌లో తన పరువేం కావాలి... పైగా పని ఇచ్చిన తనపైనే ఎదురు తిరిగాడు అని మథన పడసాగాడు వెంకటేశ్‌. ఈ విషయాన్ని స్నేహితుడైన గోవిందస్వామితో చర్చించాడు. అప్పటికే సూరి మీద పగ పెంచుకున్న గోవిందస్వామి ఇదే అదనుగా వెంకటేశ్‌తో ‘నువ్వెందుకు బాధపడటం... సూరిని లేపేస్తే సమస్య పరిష్కారం అవుతుంది’ అన్నాడు.  

వెంకటేశ్‌ బెదిరిపోయాడు.‘వద్దు. ఏదోవిధంగా వాడిని బెదిరించి ఇక్కణ్ణుంచి పంపించేయాలి. నా చెల్లెలికి నేను నచ్చజెప్పుకుంటా’ అన్నాడు. ‘అలాగే చేద్దాం. ముందు నే చెప్పినట్టు చేయ్‌’ అన్నాడు గోవిందస్వామి.ముందే అనుకున్న విధంగా చీకటి పడే వేళకు సూరికి ఫోన్‌ చేయమన్నాడు గోవిందస్వామి వెంకటేశ్‌ని. ‘రాధ విషయం మాట్లాడాలి... నువ్వు రా’ అని చెప్పాడు వెంకటేశ్‌.రాధ పేరు వినేసరికి సరేన ని వెంకటేశ్‌ చెప్పిన చోటుకి వచ్చాడు సూరి. అక్కడ బైక్‌పైన గోవిందస్వామిని చూసి ‘నేను రాను’ అన్నాడు.వెంకటేశ్‌ నచ్చచెప్పడంతో బండెక్కాడు సూరి.ముగ్గురూ ఆ బండి మీద హైవే దారి పట్టారు.‘ఇంతదూరమా’ అన్నాడు సూరి ఓ చోట.‘పార్టీ చేసుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలిగా’ అంటూ తక్కెళ్ళపాడు వద్ద ఉన్న పొలాల్లోకి  తీసుకెళ్లి బండిని నిలిపాడు గోవిందస్వామి.ముగ్గురూ కలసి ఓ చోటు చూసుకొని కూర్చున్నారు. గోవిందస్వామి సూరి చేత అతిగా మద్యం తాగించాడు. మద్యం మత్తులోకి జారుకున్నాడు సూరి.‘వాడినేదో హెచ్చరించి, ఈ ఊరు వదిలి వెళ్లగొట్టే పని చేస్తావనుకుంటే నువ్వేంటి ఇక్కడదాకా తీసుకొచ్చి పీకలదాకా తాగించావు’ విసుక్కున్నాడు వెంకటేశ్‌.‘ఊరి నుంచి ఎందుకు ఈ లోకంలోనే లేకుండా పంపించేద్దాం’ అన్నాడు గోవిందస్వామి. 

అర్థంకానట్టు చూశాడు వెంకటేశ్‌. గోవిందస్వామి సూరి తల మీద బీరుబాటిల్‌తో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సూరి స్పృహ కోల్పోయాడు.వెంకటేశ్‌ షాక్‌ తగిలినట్టు క్షణం సేపు ఉండిపోయాడు.సూరి గొంతు నులిమి, తలపై బీరు బాటిళ్లతో పదే పదే మోదాడు గోవిందస్వామి. కర్కశంగా గొంతు దగ్గర, ముఖం మీద పొడిచాడు. మత్తులో వెంకటేశ్‌కు కూడా కోపం వచ్చింది. పక్కనే ఉన్న చెక్క ముక్కలతో సూరినిపొడిచాడు.సూరి మరణించాడని నిర్ణయించుకున్నాక వెంకటేశ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. సూరి దగ్గరున్న ఫోన్‌ తీసి, స్విచ్ఛాఫ్‌ చేసి, ‘పద’ అన్నాడు వెంకటేశ్‌తో గోవిందస్వామి. వెంకటేశ్‌ బండి తీశాడు. దారిలో బ్రిడ్జికి మరో వైపు ఆ ఫోన్‌ని విసిరేసి, ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ప్రకృతి అన్నీ గమనిస్తుంటుంది.అది ఏ ద్రోహాన్నైనా క్షమిస్తుంది గానీ స్నేహద్రోహాన్ని మాత్రం కాదు.వాళ్లిద్దరూ తమ జీవితాలకు మించి కోల్పోయింది ఒక మంచి స్నేహితుణ్ణే.
– వడ్డే బాలశేఖర్,   సాక్షి, గుంటూరు 

Advertisement
Advertisement