మృగాడి చేతికి గాజులు!

19 May, 2016 00:41 IST|Sakshi
మృగాడి చేతికి గాజులు!

అత్యాచారంతో గొంతు నులిమేస్తే.. ష్‌ష్‌ష్! ఆధిపత్యంతో నోరు నొక్కేస్తే.. ష్‌ష్‌ష్!  అల్పత్వంతో ఆత్మాభిమానానికి శిలువేస్తే.. ష్‌ష్‌ష్! ఏం చేయాలి?! ఏం చేస్తారు?! ఏం చేద్దాం?! ఈ దుర్మార్గాన్ని ఎలా దులపాలో? ఈ దాష్టీకం ఎలా ఆగాలో? ఎవరు ఆపాలి? మగాడే కదూ! కానీ, మగాడే మృగాడవుతున్న జాబితా క్షణక్షణం పెరుగుతోంది. ఒక అన్నయ్య, ఒక నాన్న, ఒక బాబాయి, ఒక మామయ్య. మర్చిపోయాం... ఒక తాతయ్య. ఓ... ఇంకో మగానుభావుడు ఉన్నాడు, అదేనండీ... ప్రేమికుడు. హత్ తెరికి... ఈనాటి ఒక ప్రేమికుడు వేధింపుల్లో గ్రాడ్యుయేట్ అయితే, ఒక భర్తగారేమో హింసలో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ఇక వీళ్లందరికీ పాఠాలు చెప్పే టీచకులూ ఉన్నారు... కొందరు ఖాకీలూ ఉన్నారు. మరి చట్టాలు చేసేవారు... శాసనసభల్లో కూర్చునేవారూ... వీళ్లల్లో మాత్రం దుశ్శాసనులు లేరా?  ఇంకా కనపడని ఈ చీకటి పొరలలో... ఎంతమంది మృగాళ్లు దాగున్నారో!  పింప్స్, ట్రాఫికర్స్, బ్రోకర్లను నీచాతినీచులంటాం. మరి వీళ్లని...? దొంగలైతే పట్టుకోవచ్చు. మరి కాపాడాల్సినవాళ్ళే క్రూర మగాళ్ళయితే... ఎలా? ఛీఛీఛీ.. వెగటు పుడుతోంది. కడుపు తిప్పేస్తోంది. నిస్సహాయత గొంతు పిసికేస్తోంది. మన అచేతన మీద మనకే అసహ్యం కలుగుతోంది. ఉచ్ఛనీచాలు మరిచి... వావివరసలు లేకుండా... ఇంటా బయటా... పసిపాపల నుంచి ముసలివారి దాకా అందరి మీదా... ఈ నీచ్ కీచకులు కామం కక్కుతున్న వాసన... పేపర్లలో, టీవీలలో, ఇంటర్నెట్‌లో గుప్పుమంటుంటే... ‘ఏమీ చేయవేం’ అన్న ప్రశ్న వెక్కిరిస్తుంటే... ఆ బాధ గొప్పదా? పుండు పడుతున్న చెల్లి బాధ గొప్పదా? బీయింగ్ ఎ సెలైంట్ స్పెక్టేటర్ ఈజ్ ఎ బిగ్గర్ క్రైమ్.. చెడు చేసేవాడి కంటే చెడును చూస్తూ మౌనంగా ఉండేవాడే పెద్ద నేరస్థుడు. మన గొంతును ఎవరు నొక్కేశారని? మన నోటిని ఎవరు కుట్టేశారని? గుర్తుంచుకోండి! మానం దోచేవాడికి సాయం చేసేదే మన మౌనం. మన చెల్లిని కాపాడేదే... మన గళం. దీనికి మీరే సాక్షి!

 

గృహహింస
ఇది రకరకాల రూపంలో స్త్రీలను బాధిస్తోంది.. వేధిస్తోంది.. హింసిస్తోంది. కూరల్లో ఉప్పుకారాల మోతాదు తప్పాయన్న దగ్గర్నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, పిల్లలను సరిగ్గా చూడట్లేదని, అత్తామామలను గౌరవించట్లేదని, ఆడబిడ్డ అడుగులకు మడుగులు ఒత్తట్లేదని, పడకటింట్లో సరిగ్గా మసలుకోవట్లేదని, భర్తను నిర్లక్ష్యం చేస్తోందని, చుట్టాలకు మర్యాద చేయట్లేదని, ‘మంచి చీర కట్టుకొని ఎవరి కోసం సింగారించుకున్నా’వని, మంచి చీర కట్టుకోకపోతే ‘పాచిమొహందానా’ అని... ఇలా ఏమి చేసినా.. చేయకపోయినా తప్పుపట్టి ఆపాదమస్తకం భార్యను విమర్శిస్తూ, ఆమె తల్లితండ్రులను కించపరుస్తూ ఆమెకు బతుకును నరకప్రాయం చేసే శాడిజం - గృహహింస. దీనికి సాధారణ గృహిణి నుంచి బాగా చదువుకుని, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ మహిళల దాకా అందరూ బాధితులే. అలాంటి ఒక బాధితురాలే గుల్బర్గాకు చెందిన ఓ డెంటిస్ట్. ఈమెకు 2004 జూన్‌లో హైదరాబాద్‌లోని అజీజ్‌బాగ్‌కు చెందిన ఓ యువకుడితో వివాహమైంది. అప్పట్లో ఇతగాడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పని చేస్తుండేవాడు. వివాహానంతరం వీరిద్దరూ కలిసి అమెరికాలో కాపురం పెట్టారు. అక్కడ ఉండగా భర్త నుంచి తీవ్ర వేధింపులు ఎదురుకావడంతో అక్కడి పోలీసులకు ఓసారి ఫిర్యాదు చేసింది. దీంతో వారు అక్కడ అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సదరు భర్తకు కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ జంట హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్త ప్రవర్తన మళ్లీ మొదటికి వచ్చేసిందని ఆ డెంటిస్ట్ వాపోయింది. అకారణంగా కొట్టడంతో పాటు శరీరంలోని అనేక ప్రాంతాల్లో కొరుకుతున్నాడంటూ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె కాళ్లు, చేతులతో పాటు శరీరంపై భీతిగొలిపే రీతిలో ఉన్న పంటి గాట్లను పోలీసులకు చూపించింది. వాటిని చూసి పోలీసులే చలించిపోయారు.

 

బాల్య వివాహాలు
ఈ హైటెక్ రోజుల్లోనూ వందలాది బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ - దేశంలోని ఏ మూలో కాదు.. తెలంగాణ నడిబొడ్డున ఉన్న రంగారెడ్డి జిల్లానే. ఈ మధ్య.. అంటే ఓ నెలరోజుల్లోనే  ఇక్కడ పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగినట్టు దాఖలాలున్నాయి. పద్నాలుగేళ్ల అమ్మాయికి 32 ఏళ్ల అబ్బాయితో వివాహం చేశారు. ఇంకో అమ్మాయి విషయంలోనూ అంతే. పదమూడేళ్ల చిన్నారికి 29 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేస్తే ఆ అమ్మాయి ఆ పెళ్లిని తప్పించుకోవడానికి రాత్రికిరాత్రే ఇంట్లోంచి పారిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటోంది. ఈ కాలంలోనూ ఈ బాల్య వివాహాలకు విస్మయపడాల్సి వస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఇలా ఉంటే మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో బాల్యవివాహాలకు కారణాలు ఇంకోరకంగా ఉన్నాయి.
 

వలసలూ ఓ కారణమే!
మహబూబ్ నగర్‌లో బాల్యవివాహాల నేరానికి వలసలు కారణమవుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ వలసవెళ్లక తప్పని పరిస్థితి. తమ పన్నెండు, పదమూడు, పధ్నాలుగేళ్ల ఆడపిల్లల బాధ్యతను ఇంట్లో వృద్ధుల మీద వదిలి పెట్టలేక పెళ్లిచేసి వీళ్లను అత్తారింటికి పంపి వాళ్లు వలసవెళ్తున్నారు. ఇక ఆదిలాబాద్‌లాంటి చోట్ల పేదరికం బాల్యవివాహాలను ఉసిగొల్పుతోంది. ఉత్తర భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గి వధువుల కొరత ఏర్పడడంతో అక్కడినుంచి ఆడపిల్లల అన్వేషణ కోసం దక్షిణాదికి వస్తున్నారు ఉత్తర భారతీయులు. వారికి మొదటగా కనిపిస్తున్నది తెలంగాణ. ఈ రాష్ట్రానికి తలలాగా ఉన్న ఆదిలాబాద్. ఇక్కడి పేదరికం వాళ్లకు వరంగా మారుతోంది. ఆడపిల్లల తల్లితండ్రులకు కానీ ఖర్చు కానివ్వకుండా టీనేజ్ అమ్మాయిలను పెళ్లిచేసుకొని తీసుకెళ్లిపోతున్నారు. చదువు, నాగరికత - అన్నీ ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అడపాదడపా ఈ బాల్యవివాహాల తంతు కనిపిస్తూనే ఉంది.  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 2014లో అడ్డుకున్న బాల్య వివాహాల సంఖ్య 12. కాగా... 2015లో ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఏకంగా 24కు పెరిగింది.

 

వరకట్నం
వరకట్న దురాగతానికి  బలి అవుతున్న ఆడబిడ్డలెందరో! అలాంటి వాళ్లలో ఒకరు స్వాతి. మెదక్‌జిల్లా తూప్రాన్‌కు చెందిన జగన్నాథం కుమార్తె స్వాతికి సికింద్రాబాద్ వాసి సాయిశంకర్‌తో  2013 నవంబర్ 10న వివాహమైంది. వస్త్రవ్యాపారి అయిన సాయి శంకర్ తన కుటుంబసభ్యులతో కలిసి చిలకలగూడలోని అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. వ్యాపార పనులపై సాయి విజయవాడకు వెళ్లాడు. స్వాతి తన కుమారుడితో ఇంట్లో ఉంది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు తలుపు కొట్టినా స్పందన లేదు. కొద్దిసేపటికి ఆ గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. తలుపులు పగులకొట్టి చూస్తే... స్వాతి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న స్వాతి పుట్టింటి వారు తమ బిడ్డను ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు అంతా కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై కూతురు తమకు అనేకసార్లు  ఫోన్ చేసి బాధపడిందని మృతురాలి తండ్రి జగన్నాథం చెప్పారు. ఎంఈ, బీఈడీ చేసి ఇటీవలే కొన్ని ఉద్యోగ పరీక్షలకు హజరైన తన స్వాతి ఉరివేసుకునేంత పిరికిది కాదని కన్నీటి పర్యంతమయ్యారు.

 

విదేశీ అల్లుళ్ల ఆటలు
వివాహ వ్యవస్థ ఆధునిక కాలంలో అనంత నేరాలకు పురుడు పోస్తోంది.ఇలాంటి వాటిల్లో ఎన్‌ఆర్‌ఐ భర్తల మోసాలు మొదటిస్థానంలో నిలుస్తాయి. కడప జిల్లాకు చెందిన ఓ ఉన్నత విద్యాధికురాలికి అదే జిల్లాకు చెందిన అమెరికా ఎన్‌ఆర్‌ఐ సాఫ్ట్‌వేర్‌తో పెళ్లి అయింది. పెళ్లయిన మూడు నెలలకు అమెరికా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది అప్పటికే అతనికి ఓ అమెరికా యూదు యువతితో పెళ్లయిందన్న చేదు నిజం. నిలదీయడంతో ఆమె పాస్‌పోర్ట్ లాక్కున్నాడు. కొట్టడం, తిట్టడం, తిండిపెట్టకపోవడం, ఆమెను రక్తం కారేలా హింసించి ఆ రక్తాన్ని తన పెంపుడు కుక్కతో నాకించడం వంటి ఉన్మాద చేష్టలకు పాల్పడ్డాడు. ఎలాగోలా ఆమె అక్కడినుంచి బయటపడి అతని మీద కేస్ పెట్టింది. ఇప్పుడతను అమెరికా వీసా రద్దయి.. ఇండియన్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.



నమ్మకద్రోహం
మోసానికి,  ద్రోహానికి తేలికగా దొరుకుతోంది అమ్మాయిలే. ప్రేమించి పెళ్లాడిన భార్యనే వెలయాలిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడో ఉన్మాది. నల్లగొండ జిల్లా  మల్కపురానికి చెందిన ఎండబెత్తుల మురళీకృష్ణ  మరదలి వరసయ్యే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ కుటుంబీకులు డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారనే ఉద్దేశంతో యువతి కుటుంబీకులు వీరిద్దరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో పథకం ప్రకారం తనతో పాటు యువతికీ మహారాష్ట్రలోని పుణేకు బదిలీ చేయించుకున్న మురళీకృష్ణ అక్కడ ఆమెతో సహజీవనం చేశాడు. ఆ అమ్మాయి ఐదు నెలల గర్భవతిగా ఉండగా హైదరాబాద్‌కి  తీసుకువచ్చి నాంపల్లిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ మోసంపై పుణేలో మదర్‌పట్టా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యువతి కుటుంబీకులు, పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ కుదిర్చి రూ.3 లక్షల ఖర్చుతో స్థానికంగా ఉన్న గుడిలో ఇద్దరికీ వివాహం చేశారు. ఈ పెళ్లిని మురళీకృష్ణ కుటుంబీకులు ఒప్పుకోలేదు. అప్పుడు యువతి కుటుంబీకులే మరో రూ.50 వేలు ఇచ్చి ఇద్దరినీ పుణేకు పంపించారు. వీరికి  కొడుకు పుట్టిన తరవాత కొన్ని రోజులపాటు సజావుగానే ఉన్న మురళీకృష్ణ మళ్లీ యువతిని అక్కడి ఓ హోటల్‌లో వదిలేసి వచ్చేశాడు. దీంతో మళ్ళీ ఇరు కుటుంబాలకు చెందిన వారు పంచాయతీ పెట్టుకోవాల్సి వచ్చింది. తన కుమారుడికి ఘనంగా పెళ్ళి చేస్తేనే వాళ్ల కాపురాన్ని అంగీకరిస్తామని మురళీకృష్ణ కుటుంబీకులు చెప్పడంతో ఉంటున్న ఇంటిని అమ్మేసి, యువతి కుటుంబీకులు రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్ళి జరిపించారు. ఆపై కొన్ని రోజులకు  మురళీకృష్ణ మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. పుట్టింటికి వచ్చిన యువతి రెండో సంతానానికి జన్మనిచ్చింది. అదనపు కట్నం కావాలని అత్తింటివారు ఆమెను వేధించడంతో మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో   ఫిర్యాదు చేశారు. భార్య పై కక్షకట్టిన మురళీకృష్ణ... వివాహ సమయంలో తాము తీసుకున్న ఫోటోల్లోంచి యువతి ఫొటోలను సేకరించి  వాటితో పాటు ఆమె ఫోన్ నెంబర్‌నూ అశ్లీలవెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. తద్వారా ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని నిరూపించాలనేది ఆయన కుట్ర. కొందరి నుంచి ఫోన్లు రావడంతో అప్రమత్తమైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారైన మురళీకృష్ణ ఎట్టకేలకు చిక్కి జైలుకు చేరాడు.

 
ప్రేమ పాపం ప్యార్ కియా తో మర్నా ఖాయం.  నిన్నటి ‘బాలికా వధు’ ప్రత్యూషా బెనర్జీ ఈ మోసానికే బలైంది. మొన్నటి నటి జియాఖాన్ కూడా ఆ మోసానికే ఉరేసుకొని ఉసురు తీసుకుంది. ఈ ఇద్దరికీ గ్లామర్ ప్రపంచపు మెరుగులు తెలుసు. ఆ మాయ గురించీ అవగాహన ఉంది. అక్కడ జరిగే దగా, పగలూ పరిచయమే. అయినా ప్రేమకు పడిపోయారు. పడి మోసపోయారు. తట్టుకోలేక ఇద్దరూ ఫ్యాన్‌కి ఉరిబిగించుకున్నారు. ప్రేమ పేరుతో వీళ్లను వంచించిందీ.. ప్రముఖులే. జియాఖాన్‌ను వంచించింది ప్రముఖ నటదంపతులు ఆదిత్యాపంచోలీ, జరీనా వాహబ్‌ల కొడుకు సూరజ్ పంచోలీ అయితే ప్రత్యూషా బెనర్జీని నమ్మించి మోసం చేసింది సీరియల్ ప్రొడ్యూసర్, ఈవెంట్స్ మేనేజర్ రాహుల్‌రాజ్ సింగ్. చనిపోయేటప్పటికీ ప్రత్యూషా బెనర్జీ గర్భిణి కూడా. అన్నీ తెలిసిన వాళ్లను అందరూ తెలిసిన వాళ్లే వంచిస్తుంటే ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండొచ్చు? ఏ సంఖ్యలో ఈ నేరానికి బలవుతుండొచ్చు? మొన్నటికి మొన్న జరిగిన రీనా ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణ. ప్రేమించి మొహం చాటేశాడన్న అవమానం, బాధ, వేదనతో డెల్ ఉద్యోగిని అయిన రీనా ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 

 

జోగినీ వ్యవస్థ
నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా - మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి మూలకారణం పేదరికం, సాంఘిక వ్యత్యాసాలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లెసైన్స్‌డ్ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరం బారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితం నాశనమవుతోంది. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా, ఈ దురన్యాయం యథేచ్ఛగా రాజ్యమేలుతోంది.



ట్రాఫికింగ్...  ప్రాస్టిట్యూషన్
‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు పదిహేను వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి - అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ  పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణే రెడ్‌లైట్ ఏరియాలోనో, ముంబై కామాటిపురాలోనో.. కోల్‌కతా సోనాగచీలోనో తేలుతుంది. ఇవే - ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. ఈ రెండూ తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కానీ అమలు చేసే చిత్తశుద్ధే కరువు. అందుకే ఏటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కోరలకి చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు.

 

సైబర్ క్రైమ్ ...టీచకుడి కథ
పెరిగిన సాంకేతికత చూపిస్తున్న వికృతాల్లో సైబర్‌క్రైమ్ ఒకటి. మెయిల్స్, ఫేస్‌బుక్‌ను మారణాయుధాలుగా మలచుకొని రకరకాల రూపాల్లో నేరాలు చేస్తున్న వాళ్ల సంఖ్య తక్కువేమీ లేదు. ఒక ఉదాహరణ...గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఉపాధ్యాయుడు బాబూరావు ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలైన ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చాడు. అందులో తన ఈ-మెయిల్ ఐడీతో పాటు తన ఫోన్ నెంబర్ కూడా పొందుపర్చాడు. దరఖాస్తు చేసిన వారిలో యువతుల్ని, మహిళల్ని మాత్రమే ఎంచుకుంటాడు. వారి ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలు సేకరించి ఉద్యోగాల సాకుతోనే చాటింగ్ చేశాడు. పరిచయం పెంచుకొని వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపించాడు. కొన్నాళ్లకు తాను అడిగినంత ఇవ్వకపోతే  ఆ ‘చాటింగ్’ వివరాలను కుటుంబీకులకు చెప్తానంటూ బ్లాక్‌మెయిల్ మొదలెట్టాడు. అలా అందినంత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ హైదరాబాద్ విద్యార్థిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లోని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కీచక టీచర్ కటకటాల్లోకి చేరాడు.

 

అసభ్యసందేశాలు
గుంటూరుకు చెందిన సాయి, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఇద్దరూ స్నేహితులు. స్పర్థలు రావడంతో ఆ యువతిపై సాయి పగ పెంచుకున్నాడు. కక్షగట్టి వేధింపులు ప్రారంభించాడు. ఫేస్‌బుక్ ద్వారా దుర్భాషలాడుతూ సందేశాలు పెట్టడంతో పాటు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. విసుగు చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

 

సైబర్ బుల్లీయింగ్
సోషల్ నెటవర్క్ సిస్టమ్స్‌లో స్త్రీల మీద అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వాళ్లతో అసభ్యంగా సంభాషించడం, అశ్లీల చిత్రాలు పంపడం వగైరా కూడా సైబర్ క్రైమ్ కిందకి వస్తాయి. ప్రముఖ స్త్రీవాది కవితాకృష్ణన్, ప్రముఖ జర్నలిస్ట్-రచయిత్రి సాగరికా ఘోష్ కూడా సైబర్ బుల్లీయింగ్ బారిన పడ్డారు. కవితాకృష్ణన్‌కైతే ఓ వ్యక్తి... ‘కండోమ్స్‌తో రమ్మంటావా? లేకుండా రమ్మంటావా?’ అని ఆమె ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. అలాగే సాగరికా ఘోష్‌తో కూడా కొంతమంది... ‘నీ పదమూడేళ్ల కూతురు భలే ముద్దొస్తోంది...’ అంటూ అసభ్యంగా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. ఈ ఇద్దరూ సమాజంలో చాలా పేరున్న మహిళలే. వాళ్లకూ సైబర్‌బుల్లీయింగ్ తప్పలేదు. ‘వాటినెలా ఎదుర్కోవాలో తెలిసినా పిల్లను స్కూల్‌కి పంపాలంటే గజగజ వణికిపోయాను’ అని వాపోయారు సాగరికా ఘోష్. ఇక మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి మరి?

 

షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో...
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఓ నగరంలో తన భర్తతో కలిసి పేరున్న పెద్ద షాపింగ్‌మాల్‌కి వెళ్లారు. తనకు నచ్చిన డ్రెసెస్‌ను ట్రై చేయడానికి ట్రయల్‌రూమ్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ గదిలో కెమెరా ఉన్నట్టు ఆమెకు  అనుమానం వచ్చింది. బయటకు వచ్చి భర్తతో చెప్పి కంప్లయింట్ చేశారు. వెళ్లి చూస్తే నిజంగానే కెమెరాలున్నాయి. అంత పేరున్న మాల్‌లో... కేంద్ర మంత్రికే ఆ ఆగచాటు తప్పలేదంటే మిగిలిన చోట్ల సామాన్య మహిళలు ఇంకెన్ని అగచాట్లు పడాలో? అలా షాపింగ్‌మాల్స్‌లో ట్రయల్‌రూమ్స్‌లో కెమెరాలు ఉండడాన్ని కూడా ‘నిర్భయ చట్టం’ కింద నేరంగా పరిగణిస్తారు.

 

ఈవ్‌టీజింగ్
బస్‌స్టాప్స్, షాపింగ్ మాల్స్, పార్క్స్, సినిమాహాల్స్...ఏ పబ్లిక్ ప్లేస్‌లో అయినా కనిపిస్తోంది ఈవ్‌టీజింగ్. దీని భరతం పట్టడానికి ‘షీ టీమ్స్’ గస్తీ తిరుగుతున్నా కన్నుగప్పే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ల ద్వారా రహదారులపై మహిళల్ని, యువతుల్ని వేధిస్తున్నారు. ఈవ్‌టీజర్ల బారిపడుతున్నవారిలో అనేకమంది ప్రముఖులూ ఉంటున్నారు. ఈ మధ్యనే తన కారులో వెళ్తున్న అస్మిత అనే టీవీ కళాకారిణిని సయ్యద్ నూరుల్లా, ఇమ్రాన్ బిన్ మహ్మద్ అనే ఇద్దరు పోకిరీలు వెంబడించి వేధించారు. ఆమె ధైర్యంగా వారి చేష్టలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఫేస్‌బుక్ ద్వారా ‘షీ టీమ్స్’కి  ఫిర్యాదు చేశారు. ఆ పోకీరీలు కటకటాలు లెక్కపెట్టారు. ఇలా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది.

 
ప్రేమ పేరుతో వేధింపులు

ప్రేమ అంటే.. ఇష్టపడ్డ వ్యక్తిని గౌరవించడం. ఆమెకు ఏ కష్టం కలగకుండా చూసుకోవడం. కానీ ఈ రోజు ప్రేమ నిర్వచనం మారిపోయింది. తన ఇష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఇష్టపడమంటూ ఆమెను వేధించడమే ప్రేమ పరమార్థంగా మారింది. ఇష్టం లేదని చెప్తే యాసిడ్‌తో దాడి చేయడం పరిపాటి అయింది. దీనికి తోడు సినిమాల ప్రభావం నేటి యువత మీద విపరీతంగా పడుతోంది. కొన్ని సినిమాలు అసలే ఉన్మాదంగా ఉంటున్న యువతను తమ దారి సరైనదే అని ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్తున్నాయి. ఒక సినిమాలో కథానాయికను ప్రేమిస్తున్నానంటే ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె వెంటపడుతుంటాడు హీరో. ఇదో హీరోయిక్ స్టంట్‌లా భావించి మగపిల్లలంతా ఆ దారినే ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది. అమ్మాయిలూ తమ వెంట అబ్బాయిలు అలా పడితేనే గొప్ప అనే భావనలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాకున్న ప్రభావం ఎలాంటిదో వేరేగా చెప్పక్కర్లేదు. వరంగల్‌లో స్వప్నిక మీద యాసిడ్ దాడి అలాంటి ఉన్మాది చర్యే. అందుకే ఇలాంటి సున్నిత అంశాల పట్ల కాస్త బాధ్యతగా వ్యవహరిస్తే బాగుటుంది ఏ మాధ్యమమైనా. ప్రేమ పేరుతో వెంటపడి వేధించే ‘ఆర్య’ లాంటి యాంటీహీరోలు రియల్‌లైఫ్‌లోనూ  కోకొల్లలు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ రోడ్ నెం.9లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివసించే ఓ యువతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటోంది. అదే బస్తీలో ఉండే శివ అనే జులాయి ఆమెని వెంబడిస్తూ ప్రేమించాలని వేధించాడు. ఆమె రాకపోకల్ని గమనించి, తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


రేప్
ఏ రోజు ఏ పత్రిక తిరగేసినా.. ఏ టీవీ చానల్ పెట్టినా స్త్రీల మీద లైంగిక దాడి వార్తలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దేశంలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత వచ్చిన నిరసన.. తద్వారా ఏర్పడిన నిర్భయ చట్టం.. ఇక అమ్మాయి మానప్రాణాలను కాపాడడంలో కంచుకవచంలా ఉంటుందని ఆశపడింది దేశం. కానీ అది వట్టి అత్యాశే అని నిరూపిస్తున్నాయి - ఇప్పటికీ జరుగుతున్న అత్యాచార సంఘటనలు. నిర్భయ తర్వాత ఢిల్లీలోనే అయిదేళ్ల గుడియా మీద ఇంకో ఘోరం జరిగింది. తర్వాత హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల చేతిలో లైంగికదాడికి బలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అభయ కేస్ బయటపడింది.ముంబైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం అమ్మాయి అనూహ్యను ముంబైలో టాక్సీ డ్రైవర్ రేప్ చేసి చంపేసిన వైనం ఇంకా భయపెడుతూనే ఉంది. ఇవన్నీ ప్రసార మాధ్యమాల దృష్టికి చిక్కిన నేరాలు. చిక్కకుండా భీతిగొల్పుతున్నవెన్నో!
 

 

మ్యారిటల్ రేప్
వివాహబంధంలో ఉన్న భర్త... తన భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం కూడా క్రూయల్టీ కింద పరిగణించే నేరమే. నిజానికి దీన్ని  జస్టిస్ వర్మ కమిటీ మ్యారిటల్‌రేప్‌గా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కానీ విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. అయితే ఇంకా దీనిమీద వాదోపవాదాలు, చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

క్రైమ్ అండ్ పనిష్‌మెంట్
గృహ హింస... డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 31 కింద గృహహింస బాధితులకు ఈ చట్టం కొన్ని ఉపశమనాలను సూచిస్తోంది. వీటిలో రక్షణ, నివాస, ఆర్థిక ఉపశమనాలతోపాటు నష్టపరిహారం, పిల్లల కస్టడీ ఉత్తర్వులుంటాయి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏడాది జైలుశిక్ష, 20 వేల జరిమానా.

 
వరకట్నం... 1961 నాటి వరకట్నం నిషేధ చట్టం కింద వరకట్నం అడగడం, ఇవ్వడం రెండూ నేరాలే. కట్నం కోసం వేధిస్తే సెక్షన్ 498 (ఎ) కింద నేరస్థులకు ఏడేళ్లు జైలుశిక్ష ఉంటుంది. అలాగే కట్నం కింద తీసుకున్న డబ్బుమొత్తాన్ని తిరిగి అమ్మాయి వాళ్లకు చెల్లించాలి.

 
బాల్యవివాహాలు... ఈ నేరానికి పాల్పడిన వాళ్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం-1929 ప్రకారం లక్ష రూపాయల జరిమానా.

 
జోగినీ వ్యవస్థ...  ఆంధ్రప్రదేశ్ దేవదాసీ నిరోధక చట్టం కిందకు వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ  కూడా దీన్ని అమలు చేస్తోంది.

 
ట్రాఫికింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్...
  ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇది నేరం. అయితే 370 (ఎ) నిర్భయ చట్టం కింద కొత్తగా దీనికి కొన్ని సవరణలు చేశారు. వ్యభిచారం కోసం అమ్మాయిల అక్రమ రవాణాను 372, 373 సెక్షన్ల కింద నేరాలుగా పరిగణిస్తారు. నేరస్థులకు పదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది. అలాగే వ్యభిచార గృహ నిర్వాహకులు, అమ్మాయిలను సరఫరా చేసేవారు, వ్యభిచార గృహాల చిరునామా చెప్పేవారికి అయిదేళ్ల జైలుశిక్ష ఉంటుంది.

 
పీసీ అండ్ పీఎన్‌డీటీ... ‘పీసీ అండ్ పీఎన్‌డీటీ (ప్రీ కన్‌సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) యాక్ట్ -2002’ ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరం. ఇలాంటి పరీక్షలు చేయమని కోరినవారు, సూచించిన వైద్యులు, పరీక్షలు నిర్వహించిన వైద్యులు - అందరూ శిక్షార్హులే.

 
సైబర్‌క్రైమ్..
. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (2010) కిందకు వస్తుంది ఈ నేరం.  టెక్నాలజీని  ఆసరాగా చేసుకొని మహిళల మాన మర్యాదలకు భంగం కలిగించే ఏ చర్య అయినా సైబర్‌క్రైమ్ కిందకే వస్తుంది. ఈ నేరస్థులకు లక్షరూపాయల జరిమానా, రెండు నుంచి అయిదేళ్ల దాకా జైలు శిక్ష.

 
వర్క్‌ప్లేస్ హెరాస్‌మెంట్..
354, 509 సెక్షన్ల కింద నేర తీవ్రతను బట్టి ఏడాది నుంచి అయిదేళ్ల జైలుశిక్ష.

       
ఈవ్‌టీజింగ్..
. ఐపీసీ సెక్షన్ 294 కింద ఈవ్‌టీజర్లకు ఆరు నెలల నుంచి ఏడాది దాకా జైలుశిక్ష.

 
వైట్‌కాలర్ క్రైమ్...
నిర్భయ చట్టం లోని 354వ సెక్షన్ కింద ఇదీ నేరమే.

 
రేప్...
నిర్భయ చట్టం సెక్షన్లు 376 ఎ, బి, సి, డి, ఇ కింద ఘోరమైన నేరం ఇది. నేర తీవ్రతను బట్టి 376 ఎ, ఇ సెక్షన్ల కిందయితే నేరస్తుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం, ఉరిశిక్ష, 376 బి,సి, డి కింద అయితే 20 ఏళ్ల జైలు, యావజ్జీవకాగారం.

 
నమ్మకద్రోహం... 
ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద మోసం, నయవంచన, నమ్మకద్రోహం మొదలైన వాటికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష.

 

 

వైట్ కాలర్ క్రైమ్స్
పెద ్దమనుషుల్లా ఉంటూ కిరాతకాలు చేసేవాళ్లను పట్టుకోవడం, వాళ్ల పనులను నేరాలుగా నిరూపించడం చాలా కష్టం. ఇలాంటి వాళ్లు తమ వృత్తినే నేరానికి వేదికగా చేసుకుంటారు. హైదరాబాద్‌లోని ఓ డాక్టర్ నిర్వాకం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడి లాల్‌బజార్‌లో ఉండే 20 ఏళ్ల యువతి ఓ రోజు చర్మ వ్యాధి చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. ఇంజెక్షన్ ఇస్తానంటూ బెడ్ మీద పడుకోమన్నాడు డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఆమె మత్తులోకి జారుకుంది. తన కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను గుర్తిస్తున్నప్పటికీ... ఏమీ చేయలేని అచేతన స్థితికి చేరింది. కొద్దిసేపటికి శక్తిని కూడదీసుకుని తన స్నేహితులకి ఫోన్‌చేసి ఆస్పత్రికి రప్పించింది. వాళ్లు వెళ్లే సరికి ఆస్పత్రి కుర్చీలో నీరసంగా పడి ఉన్న ఆ యువతి డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని వివరించింది. డాక్టర్ మాత్రం ఆమె నీరసంగా ఉండటంతో ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే నిస్సత్తువకు లోనైందంటూ బుకాయించాడు. బాధితులు మాత్రం వైద్యుడిపై తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.



వర్క్‌ప్లేస్ హెరాస్‌మెంట్
స్త్రీలకు ఇంట్లో, బయటా భద్రత కరవైంది అనడానికి ఆఫీసుల్లో వారిపై జరుగుతున్న నేరాలే నిదర్శనం. నేరాల బారినపడకుండా ఉద్యోగిని తనను తాను కాపాడుకుంటూ విధినిర్వహణలోనూ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటూ విపరీతమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. ఆఫీస్‌లో అలాంటి అఫెన్స్‌ను ఎదుర్కొన్న ఒక ఉద్యోగిని గురించి చెప్పుకుందాం... హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ప్రముఖ శాఖకు చెందిన కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తోంది. ఆమె భర్త అదే శాఖలో పని చేస్తూ చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈమె పని చేస్తున్న కార్యాలయం ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి తన కోరిక తీరిస్తే... అండగా ఉండటంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇస్తానంటూ వేధింపులు మొదలెట్టాడు. ఆమె తిరస్కరించడంతో మరునాడే సుదూర ప్రాంతానికి బదిలీ చేశాడు. దీంతో బాధితురాలు భయపడి, దీర్ఘకాలిక సెల వుపై వెళ్లింది. సెలవు ముగిశాక తిరిగి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే చేరితే ఏం జరుగుతుందో అని భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసుల వేధింపులకు పాల్పడిన అధికారిపై ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు