వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

20 Oct, 2023 11:57 IST|Sakshi
రోదిస్తున్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు (ఇన్‌సెట్‌) షామీర్‌ బాషా (ఫైల్‌)

అనంతపురం సిటీ: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన మేరకు... అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న నందమూరి నగర్‌ నివాసి షేక్‌ షామీర్‌బాషా (30)కు తల్లిదండ్రులు షఫీ, మాలిన్‌బీ, భార్య రిజ్వాన్‌బీ, ఇద్దరు పిల్లలున్నారు. మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో వర్క్‌ షాప్‌ నిర్వహణ, కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.

తరచూ అప్పు చెల్లించాలంటూ ఘర్షణ పడుతుండడంతో వర్క్‌షాప్‌కు దూరమవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయలకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. గురువారం ఉదయం హెచ్చెల్సీ కాలనీ సమపంలో పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆరా తీశారు. ఫొటోలు చూపగానే మృతుడిని షామీర్‌బాషాగా గుర్తిస్తూ గుండెలవిసేలా రోదించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల తాళలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు