చెవికీ... కంటికీ ఉపవాసం

14 May, 2019 00:00 IST|Sakshi

రంజాన్‌ కాంతులు

ఒక రోజు కొందరు యువకులు నమాజ్‌ కోసం మసీదుకు వెళుతున్నారు. ఆ దారిలో ఒక మూలన ఒక ముసలివాడు చాటుగా కూర్చుని అన్నం తింటూ కనిపించాడు.అందులో ఒక యువకుడు, ‘‘ఏయ్‌ తాత! ఈ రోజు ఉపవాసం లేవా?’’ అని అడిగాడు.‘‘ఎందుకు లేను? ఉన్నాను. నేను ఉపవాసం ఉండి అన్నం తింటాను, నీళ్ళు కూడా తాగుతా’’ అని సమాధానం ఇచ్చాడు తాత. ‘‘భలే చెబుతున్నావు తాతా నువ్వు. ఇది కొత్త రకం రోజానా?‘ఎగతాళి చేస్తూ ఆ యువకులు.‘‘అవును నాయనా!. నేను నా కళ్ళతో చెడు చూడను. నాలుకతో చెడు మాట్లాడను. ఎవరినీ నిందించను. ఎవరి మీదా చాడీలు చెప్పను. చెడ్డ పనులు చేయను. అశ్లీల పలుకులు అసలే పలకను. ఎవరినీ మోసం చేయను. అబద్ధాలు ఆడను. అధర్మ పనులు అసలే చేయను. ఈరా‡్ష్య ద్వేషాల దరిదాపుల్లోకి కూడా వెళ్లను. ఎవరిపైనా దౌర్జన్యం చేయను. ఇలా నా శరీరంలోని అవయవాలు అన్నీ ఉపవాసం ఉంటున్నాయి.

కాకపోతే అనారోగ్యం కారణంగా అన్న పానీయాలు మాత్రం తీసుకుంటాను. మరి  మీరంతా ఇలా ఉపవాసం ఉన్నారా?’’ అని అడిగాడు తాత.  అందులో ఒక యువకుడు,‘‘క్షమించాలి తాత! అన్న పానీయాలు తీసుకోకుండా ఉపవాసమైతే ఉన్నాం, కాని నీలా పరిపూర్ణ ఉపవాసం మాత్రం లేము‘’ అని అన్నాడు సిగ్గుతో తల దించుకుని.నిజమే. ఉపవాసం అంటే ఆకలితో కడుపు మాడ్చుకోవడం కాదు. అల్లాహ్‌ ఇచ్చిన శరీరంలోని సకల అంగాలను ఆ దైవం, ప్రవక్త ముహమ్మద్‌( స) చెప్పినట్లు జీవింప చేయడం, అల్లాహ్‌ ఆదేశాలను తు.చతప్పకుండా పాటించడం. మనిషిని సంస్కరించి, నైతికోన్నతుడిగా మార్చడం కోసమే రంజాన్‌ ఉపవాసాలు. 
–షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌ 

మరిన్ని వార్తలు