ఓటమి అనే బంతిని గట్టిగా తంతే..

6 Jul, 2019 08:02 IST|Sakshi
ఆటకు కావలసింది నేర్పు, స్థయిర్యం మాత్రమే కాదు. నిన్నటి బాధను తొక్కి, గాల్లోకి ఎగిరి బంతిని తన్నే సాహసం – అని చెబుతున్న ‘బాంబర్‌’ వెబ్‌సిరీస్‌లోని ఒక సన్నివేశం. బాంబర్‌ జీ5లో స్ట్రీమ్‌ అవుతోంది.

ఓటమిని రాక్షసి అని అనుకుంటాం. నిజానికి ఓటమి తల్లిలాంటిది. ప్రాణం పోస్తుంది. పాలిస్తుంది. పాలించడం నేర్పిస్తుంది. ఓటమి మనలోని విజయ లక్ష్యానికి పురుడు పోస్తుంది. ఓటమి.. మెట్టు మాత్రమే కాదు.. ఓటమి అనే బంతిని గట్టిగా తంతే అదే వేగంతో గెలుపులా తిరిగొస్తుంది.

‘‘స్పోర్ట్స్‌ ఈజ్‌ ఎబౌట్‌ యూనిటీ.. ఇట్స్‌ ఎబౌట్‌ పీస్‌.. ఇట్స్‌ ఎబౌట్‌ బ్రింగింగ్‌ టుగెదర్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ యూనైటింగ్‌ కమ్యూనిటీ’’ అని కార్ల్‌ మార్క్స్‌ ఏనాడో చెప్పాడు. ఆటలంటే ఐక్యత. ఆటలంటే శాంతి. ఆటలనేవి బంధుమిత్రులను, కుటుంబాలను ఒకచోటకు తీసుకు వచ్చే వేదిక అని ఆ మాటల సారాంశం. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ పోలీస్‌ సమ్మిట్‌లో బెర్లిన్‌ మేయర్‌ (పేరు గుర్తులేదు) మాట్లాడుతూ ‘‘నగరాల్లో ఉండాల్సినవి ఫ్లై ఓవర్స్, స్కై స్క్రేపర్స్‌ కాదు.. ఆటస్థలాలు.. ఆటస్థలాలు.. ఆటస్థలాలు’’ అన్నాడు. జీ5లో స్ట్రీమ్‌ అవుతున్న ‘బాంబర్స్‌’ పోరాటం కూడా ఆటస్థలం గురించే. అంగుళం జాగా ఖాళీగా కనపడినా కమర్షియల్‌ కట్టడాలను నిలబెడ్తున్న కాలంలో  పిల్లలు... వాళ్ల ఆటలు.. వాటికి కావల్సిన స్థలం గురించి ఆలోచించే ప్రతినిధులున్నారా? ఉన్న వాటిని కబ్జా చేసుకోవాలనే తలపులు తప్ప! విశాల్‌ ఫురియా దర్శకత్వం వహించిన ‘బాంబర్స్‌’ వెబ్‌సిరీస్‌ ఇతివృత్తం కూడా ఫుట్‌బాల్‌ స్టేడియం చుట్టే తిరుగుతుంది. ఇది జాన్‌ అబ్రహం, అర్షద్‌ వార్సి నటించిన ‘దే దనా దన్‌ గోల్‌’ అనే బాలీవుడ్‌ సినిమాను గుర్తుకు తెస్తుంది. కాని ఈ సిరీస్‌కు ప్రేరణ. 1958, 1993 సంవత్సరాల్లో జరిగిన ఫ్లైట్‌ యాక్సిడెంట్స్‌. 1958 లోని విమాన ప్రమాదంలో మాంచెష్టర్‌ యునైటెడ్‌ టీమ్‌కు చెందిన  పదకొండు మంది క్రీడాకారులు చనిపోయారు. 1993 దుర్ఘటనలో జాంబియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మెంబర్స్‌ అందరూ మరణించారు. ‘బాంబర్స్‌’ కూడా ఒక యాక్సిడెంట్‌తోనే మొదలవుతుంది.

ఇలా..
పశ్చిమబెంగాల్‌లోని చందన్‌నగర్‌ .. ఒకప్పటి ఫ్రెంచ్‌ కాలనీ. ఇప్పటికీ (ఈ కథాకాలానికీ) ఫ్రెంచ్‌ ఫ్లేవర్స్‌తోనే ఉంటుంది. హుగ్లీతీరం వెంట ఉండే ఈ టౌన్‌ వాళ్లకు ఫుట్‌బాల్‌ అంటే పిచ్చి. మరీముఖ్యంగా పిల్లలు, యూత్‌కి. ‘‘బాంబర్స్‌ ఎఫ్‌సి’’ ఫుట్‌బాల్‌ టీమ్‌ అక్కడిదే. దానికి ఓనర్‌ సోము (జాకీర్‌ హుస్సేన్‌). అందరూ ప్రేమగా సోముదా (సోము అన్నా) అని పిలుచుకుంటూంటారు. ఆ టీమ్‌ అంతా ఒకసారి నేషనల్స్‌ గెలుచుకొని ఆనందంతో తిరిగి వస్తుంటారు బస్‌లో. మధ్యరాత్రి యాక్సిడెంట్‌ అయి అందరూ చనిపోతారు ఒక్క బాదోల్‌ రాయ్‌ అనే ఆటగాడు తప్ప. కథ ఇక్కడి నుంచే అంటే యాక్సిడెంట్‌ నుంచే మొదలవుతుంది. రెండేళ్లు గడిచినా అదొక పీడకలగా బాదోల్‌ను వెంటాడుతూనే ఉంటుంది. దాంతో అతను డ్రగ్స్‌కి అలవాటు పడి.. ఫుట్‌బాల్‌కు దూరమవుతాడు. బాంబర్స్‌ కోచ్‌ కూతురు సంజనా. బాదోల్‌ గర్ల్‌ఫ్రెండ్‌. ఈ యాక్సిడెంట్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన అతను సంజనాతో కూడా డిటాచ్‌ అయి... ఆమెను దూరం చేసుకుంటాడు. ఒకరకంగా చందన్‌నగర్‌ కూడా ఆ విషాదం నుంచి తేరుకోదు. తర్వాత ఫుట్‌బాల్‌ ఆడే వాళ్లే ఉండరు. దాంతో బాంబర్స్‌ ఎఫ్‌సీ కూడా అచేతనమవుతుంది కొత్త టీమ్‌ లేక.. తయారు కాక.

గ్రౌండ్‌ వర్సెస్‌ మాల్‌..
అలా ఫుట్‌బాల్‌ ఉనికి లేని ఆ ఊరి గ్రౌండ్‌ మీద పశ్చిమ్‌బెంగాల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖా మంత్రి  మాణిక్‌దాస్‌ గుప్త (అనూప్‌ సోనీ) కన్ను పడుతుంది. ఒక బడా పారిశ్రామికవేత్త (కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌)తో లావాదేవీలు మాట్లాడుకొని అక్కడ పే..ద్ద షాపింగ్‌ మాల్‌ కట్టాలని పావులు కదుపుతాడు. పేపర్‌ వర్క్‌ కూడా అయిపోతుంది. బాంబర్స్‌ ఎఫ్‌సి ఓనర్‌ సోము న్యాయపోరాటం చేసినా ఫలితం ఉండదు. మంచిమాటతో విన్నవించుకుందామని మంత్రి మాణిక్‌దాస్‌ను కలుస్తాడు సోము. ‘‘ఆ గ్రౌండ్‌లో ఆడేవాళ్లేరీ? ఉట్టిగానే ఉందికదా! దాని బదులు షాపింగ్‌మాల్‌ కడితే.. చిన్నా పెద్ద, పిల్లా, జెల్లా అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది’’ అని కటువుగా చెప్పి పంపించేస్తాడు. ఈ లోపే యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ల వర్ధంతి వస్తుంది. ఆ గ్రౌండ్‌ దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి.. ‘‘ఊళ్లో పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడుకోవడం కోసం ఈ గ్రౌండ్‌ కావాలన్నా ఇచ్చేస్తాను.. మీ సంతోషానికి మించింది ఏదీ లేదు’’ అని ఉపన్యాసమిస్తాడు ఆవేశంగా మాణిక్‌దాస్‌. ఆ మాటను పట్టుకునే బాదోల్, సోము.. మళ్లీ బాంబర్స్‌ ఎఫ్‌సీ కోసం టీమ్‌ను తయారు చేయాలనే ప్రయత్నంలో పడ్తారు. ముందు దొరకాల్సింది కోచ్‌. సంజనా వాళ్ల నాన్నను అడిగితే.. వయసైపోయింది.. కుదరదు అంటాడు.

ఆ ఊళ్లో ఉన్న దేబూ (రణ్‌వీర్‌ శోరే) గుర్తొస్తాడు బాదోల్‌కు. దేబూ.. బాంబర్స్‌లోనే ఒకప్పుడు మేటి ఆటగాడు. నియంత్రించుకోలేని కోపం, ఆవేశం వల్ల బాంబర్స్‌ నుంచి వైదొలగాల్సి వస్తుంది. అదే కోపం, మొండి పట్టుదలతో అతని కుటుంబ జీవితమూ ఒడిదుడుకులకు గురవుతుంది. భార్య విడాకులిస్తుంది. వాళ్లకు ఒక కొడుకు. ఇద్దరి దగ్గరా ఉంటూంటాడు. ఆటకు దూరమయ్యాక తాగుడుకు అలవాటు పడ్తాడు. అందుకే  బాదోల్‌ అతణ్ణి కోచ్‌గా తీసుకుందామన్నా సోము వద్దంటాడు. ఇంకో చాయిస్‌ ఉండదు కాబట్టి దేబూనే కోచ్‌గా పెట్టుకోక తప్పదు. దేబూ రంగంలోకి దిగగానే వెంటనే ఆటగాళ్ల సెలెక్షన్స్‌ నిర్వహిస్తారు. పదకొండు మందిని సెలెక్ట్‌ చేసుకుంటారు. ఈ పదకొండు మంది పదకొండు నేపథ్యాలతో ఉంటారు. గోల్‌కీపర్‌గా ఎన్నికైన అబ్బాయి సోనాగచ్చిలో పుట్టి పెరుగుతాడు. జువైనల్‌ క్రిమినల్‌గా శిక్షనుభవించి వచ్చిన కుర్రాడు ఉంటాడు. లెఫ్ట్‌ పొలిటీషియన్‌ కొడుకు ఉంటాడు. ఇలా భిన్నమైన బ్యాక్‌గ్రౌండ్స్‌ అంతే విభిన్నమైన మనస్తత్వాలతో ఏ మాత్రం యూనిటీ లేకుండా..  వీళ్లకు వీళ్లే ప్రత్యర్థులుగా ప్రవర్తిస్తుంటారు. వీళ్లలో ఐక్యతను సాధించడం పెద్ద టాస్క్‌ అవుతుంది కోచ్‌కు. అయినా అంతకుముందెన్నడూ లేని, చూపని సహనంతో పదకొండు మందినీ సంభాళిస్తాడు. మోటివేట్‌ చేస్తాడు. ఒక్కతాటి మీదకు తెచ్చి టీమ్‌ స్పిరిట్‌ నింపుతాడు.

గెలిస్తే గ్రౌండ్‌..
టీమ్‌ ఏర్పడ్డాక.. సోము, దేబు అండ్‌ బాదోల్‌ మళ్లీ మంత్రి మాణిక్‌దాస్‌ దగ్గరకు వెళ్తారు. ఎట్టి పరిస్థితిల్లో గ్రౌండ్‌ను కమర్షియల్‌ కాంప్లెక్స్‌కే మార్చాలన్న స్థిరాభిప్రాయం ఉన్న మంత్రి.. తన తరపు టీమ్‌తో బాంబర్స్‌ టీమ్‌ తలపడి.. గెలిస్తే గ్రౌండ్‌ ఇస్తానని.. ఆ మ్యాచ్‌ కూడా అయిదు రోజుల్లోనే అని తిరకాసు పెడ్తాడు. ఖంగు తింటారు ముగ్గురు. ఎలా సాధ్యం? తమ దగ్గరున్న వాళ్లెవరూ ప్రొఫెషనల్స్‌ కారు. పైగా ఇప్పుడిప్పుడే ఒకళ్లపట్ల ఒకళ్లు పాజిటివ్‌గా ఉంటున్నారు. అయిదు రోజుల ప్రాక్టీస్‌తో వీళ్లతో మ్యాచ్‌ గెలిచేదేనా? అని నీరసపడిపోతారు. ముందుగా దేబూనే అలరై్ట టీమ్‌కు చెప్తాడు మ్యాచ్‌ గురించి. టీమ్‌ అంతకన్నా షాక్‌. బరిలోకి దిగకముందే బాల్‌ను వదిలేస్తారు. ముందు వాళ్లలో సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ పెంచేలా ఉత్సాహపరుస్తాడు. మొత్తానికి మ్యాచ్‌కు సన్నద్ధం చేస్తాడు. మ్యాచ్‌ మొదలవుతుంది. అవతలి టీమ్‌ పక్కా వయోలెంట్‌ అండ్‌ అగ్రెసివ్‌ టీమ్‌. అయినా గట్టి పోటీ ఇచ్చి ఒక్క గోల్‌ తేడాతో ఓడిపోతారు ‘బాంబర్స్‌’. మాణిక్‌దాస్‌ వశమవుతుంది గ్రౌండ్‌. అయితే మ్యాచ్‌ ఓడినా చందన్‌నగర్‌ వాసుల అభిమానాన్ని గెలుస్తుంది బాంబర్స్‌. విన్‌ అయిన టీమ్‌ కంటే బాంబర్స్‌ టీమే పాపులర్‌ అవుతుంది. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మిగులుతుంది. ఇది మింగుడు పడదు మాణిక్‌దాస్‌కి. ఆ పాపులారిటీని పడగొట్టే పథకం పన్నుతుంటాడు.

బంగ్లా లీగ్‌..
ఈలోపే బంగ్లా లీగ్‌ మ్యాచ్‌ వస్తుంది. దాని గురించిన సమాచారం బాదోల్‌కు అందించి.. ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోవద్దని.. గెలిస్తే.. గ్రౌండ్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను ఆపేలా ప్రభుత్వం మీద ప్రెజర్‌ పెట్టొచ్చనీ చెప్తుంది సంజనా. ఇక ఆ దిశగా జట్టు ప్రాక్టీస్‌ తీవ్రం చేస్తుంది. రెండు మ్యాచ్‌లు గెలుస్తుంది. ఫైనల్‌కు వెళ్లే అవకాశానికి ఇంకో మ్యాచ్‌ ఆడాలి. అప్పుడే బాంబర్స్‌టీమ్‌లోని స్ట్రైకర్‌ ప్లేయర్, లెఫ్ట్‌ పొలిటీషియన్‌ కొడుకు అయిన శివ.. వాళ్ల నాన్న చేస్తున్న రైతు ధర్నాలో పాల్గొని పోలీసు తూటాకు నేలకొరుగుతాడు. ఇది ఆ తండ్రికే కాదు.. బాంబర్స్‌కూ అశనిపాతమే. ఇక్కడితో ఆరు ఎపిసోడ్ల ‘బాంబర్స్‌’ ఫస్ట్‌ సీజన్‌ ఎండ్‌ అవుతుంది. అయితే బాంబర్స్‌ గురించి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఆండీ (సప్నా పబ్బీ) తన డాక్యుమెంటరీ మేకింగ్‌లో భాగంగా ప్రధాన పాత్రలను ఇంటర్వ్యూ చేస్తూ ఈ కథను వివరిస్తుంది. ఇంకో విషయం.. తాగుడుకి బానిసైన దేబూ, డ్రగ్స్‌కి అలవాటు పడ్డ బాదోల్‌... బాంబర్స్‌ మళ్లీ జీవం పోసుకోగానే ఆ అలవాట్లకు గుడ్‌బై చెప్పి ఫుట్‌బాల్‌కే అంకితమవుతారు. కార్ల్‌మార్క్స్‌ అన్నట్లు ఆటలు ఐక్యతను పెంచుతాయి. ఆర్మీకన్నా ఆటల జట్లు అవసరం. యుద్ధంతో సరిహద్దుల్ని విస్తరించుకుంటామేమో.. ఆటలతో సరిహద్దుకావలనున్న మనసులను గెలుచుకుంటాం.
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా