పొద్దుతిరుగుడు అడ్డా బతుకులు

1 Nov, 2014 23:17 IST|Sakshi
పొద్దుతిరుగుడు అడ్డా బతుకులు

వరుణుడి దయ కరువై ఏరువాక సాగక బతుకుపోరు బాట పట్టినోళ్లు వాళ్లు. తేమలేక  బీళ్లువారిన చెలకలను చెమ్మగిల్లిన కళ్లతో వదిలి వచ్చినోళ్ల్లు. కొందరు సన్నకారు రైతులు.. ఇంకొందరు కౌలుదారులు. కూటి కోసం.. కూలి వెతుక్కుంటూ.. పట్నంలో అడ్డా మీదికొచ్చి పడ్డవాళ్లే. చద్దన్నం మూటగట్టుకుని.. పలుగు, పారా చేతపట్టుకుని.. ఇల్లాలిని వెంటపెట్టుకుని..తెల్లవారకముందే పని కోసం పరుగు పరుగున అడ్డాకు చేరుకుంటారు.

పొద్దుతిరిగే వరకూ ఏదైనా పని దొరకకపోతుందా అని పడిగాపులు కాస్తారు. పని దొరికిందా.. ఒళ్లొంచి పనిచేసి పొద్దుగూకే వేళకు ఇళ్లకు చేరతారు. దొరకలేదా..! తెల్లారి పస్తున్న కడుపుతోనే అడ్డామీదికొచ్చి అదృష్టం వెతుక్కుంటారు. బతుకు కోసం పొద్దంతా అడ్డా మీద తిరిగే కూలీలను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా సినీ నటుడు పృథ్వీరాజ్ పలకరించారు.

పృథ్వీరాజ్: హాయమ్మా... ఎలా ఉన్నారు.
శ్రీనివాస్: ఏమున్నాం సార్.. గిట్లున్నం. ఇప్పుడు టైం పదకొండు దాటింది. మీరే చూస్తుండ్రు కదా ! రోడ్డు మీద వంద మందిమి కూసున్నం. పనిచ్చే దేవుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నం.
లక్ష్మమ్మ: ఇదేం కొత్తకాదు సార్. మా బతుకులు గింతే. పొద్దుగాలే డబ్బాలు పట్టుకుని రావాలె. కూలీ దొరికితే సరే. లేదంటే.. తెచ్చుకున్న పచ్చడి మెతుకులు తీస్కవోయి పిల్లలకు పెట్టి మేం పస్తుండాలె.
పృథ్వీరాజ్:తెలుసమ్మా ! మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా రోడ్డు మీద అడ్డాకూలీలు కూర్చున్న సందర్భాలు చాలాసార్లు నా కంటపడ్డాయి..!
ఈశ్వరమ్మ: ఏం చెప్పాలి సార్ మా కష్టాలు. ఊరికెళ్లి మొదలువెట్టాల్నా.. ఈడ అడ్డెక్కినాక వ చ్చిన కష్టాల గురించి చెప్పాల్నా ! నా భర్త పోయిండు. బిడ్డను చదివించే పైసల్లేక ఊర్ల మా అమ్మ దగ్గర ఉంచిన. ఈడికొచ్చి నాలుగు పనులు చేస్కొని బతుకుతున్నా. నాలుగు రోజులు పనుంటే.. పది రోజులు పస్తులే.
పృథ్వీరాజ్: మామూలుగా రోజూ ఎంత మంది అడ్డా మీదికి వస్తుంటారు. ఎన్ని గంటలకల్లా వస్తారు ?
ఐలయ్య: ఓ నాల్గువందల మందిమి పొద్దుగాల ఆరు గంటలకల్లా వస్తం.
పృథ్వీరాజ్: అన్ని రకాల పనులూ చేసేవారు ఉంటారా?
వెంకటేష్: అందరుంటరు సార్. నేను తాపీమేస్త్రిని, ఈయన వంటజేస్తడు.
పృథ్వీరాజ్: అవునా.. నువ్వు వంటచేస్తావా?
స్వామి: అవును సార్ నేను వంటమాస్టార్‌ని.
పృథ్వీరాజ్: ఎంతమందికి చేయగలవు?
స్వామి: ఓ ఇద్దరు పనోళ్లను ఇస్తే ఐదువందల మందికి చేయగలను.
పృథ్వీరాజ్: ఎంత తీసుకుంటావు?
స్వామి: బేరాన్ని బట్టిసార్. రెండువేల వరకూ అడుగుతా!
పృథ్వీరాజ్: నెలకి ఎన్ని బేరాలొస్తాయి?
స్వామి: రెండు మూడు సార్. అవి కూడా చిన్నబేరాలే.
పృథ్వీరాజ్: హైదరాబాద్‌లో ఎన్ని అడ్డాలుంటాయంటారు?
శ్రీనివాస్: యాభైదాకా ఉంటయి సార్. అన్నిదిక్కులా ఇదే పరిస్థితి. కాకపోతే రియల్ ఎస్టేట్ ఎక్కువ నడిచే దగ్గర పనోళ్లకు గిరాకీ బాగుంటది.
సునీత: నాలుగైదు నెలల సంది బిల్డింగులు కట్టేది బాగా తగ్గింది. గప్పట్నుంచి మాకు మస్తు తిప్పలైతాంది.
సోమయ్య: పనుల కోసం ఊళ్లకెళ్లి జనాలు వచ్చిపడుతున్నరు. ఈడ చూస్తే అంత పని లేద్సార్.
పృథ్వీరాజ్: ఆ మాట నిజమే! ఊళ్లలో జనమంతా పని పేరుతో హైదరాబాద్‌కి వచ్చేస్తున్నారు. అక్కడ రైతులకు కూలీలు దొరకడం గగనం అయిపోయింది.
రాములు: ఏం చేస్తం సార్. ఊళ్ల పంటల్లేవు.
ఊకే కూర్చుని తినేటన్ని సొమ్ముల్లేక.. ఇట్ల రోడ్డు మీద పడ్డం.
పృథ్వీరాజ్: మీకు ఊళ్లో పొలం ఉందా?
రాములు: ఎందుకు లేదు సార్. మాది బాన్సువాడ దగ్గర చిన్న పల్లెటూరు. నేనూ రైతునే. నాకు నాలుగెకరాల పొలముంది. రెండు మూడు బోర్లేసినా.. నీళ్లు పడలే.. ఈడికొచ్చిన చాలా మంది పరిస్థితీ ఇదే. ఏం చేస్తం పొట్టచేత పట్టుకుని పట్నం వచ్చినం.
పృథ్వీరాజ్: చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. మన నగరంలో చాలాచోట్ల పనోళ్లు దొరకడం లేదని అంటుంటారు. ఇక్కడ చూస్తే పనిలేక వందలమంది రోడ్లపై కూర్చుంటారు. దీని గురించి మీరేమంటారు.
పరమేష్: మీరనేది.. ఇంట్ల పని గురించా సార్?
పృథ్వీరాజ్: అవును.
పరమేష్: ఇండ్లళ్ల పనంటే ఎవ్వర్నివడితే వాళ్లను పెట్టుకోరు కదా సార్. ఇంటి చుట్టుపక్కల ఉన్నోళ్లనే పెట్టుకుంటరు. నమ్మకం ఉండదు. యాడికెళ్లో వచ్చి నోళ్లను నమ్మి నౌకరీ ఎవరిస్తరు సార్.
పృథ్వీరాజ్: మరి మీ ఇబ్బందుల గురించి ఈ ప్రాంత నాయకులకు ఎప్పుడైనా చెప్పారా?
ఈశ్వరమ్మ: మీకు తెల్వని ముచ్చటేముంటది సార్. ఐదేళ్లకోసారి కనిపిస్తరు.కష్టమొచ్చినప్పుడల్లా కనిపిస్తే నాయకుడెట్లయితడు. ఓట్లొచ్చినప్పుడు మా గుడిసెల చుట్టూ తెగ తిరుగుతరు.
శ్రీనివాస్: గా రోజులనెందుకు యాదికి తెచ్చుకోవాలే సార్. మస్త్ మజా జేస్తం.
పృథ్వీరాజ్: అవునా (నవ్వుతూ..) బిర్యానీ, డబ్బులు.. ఇంకా చాలా ఉంటాయి కదా!
శ్రీనివాస్: ఒక్క వారం రోజులు సార్. మమ్మల్ని నేలపై నడవనివ్వరు. ఓట్లేసిన తెల్లారి నుంచి మా దిక్కు చూస్తే ఒట్టు.
పృథ్వీరాజ్: రోజురోజుకీ కూలీలకు పని తగ్గిపోతుందని విన్నాను. కారణం గ్రామాల్లో పంటలు పండకపోవడమే అంటారా?
రాములు: అట్లేంలేదు సార్. మిషన్లు పెరిగిపోవడమే పెద్ద కారణం. అన్ని పనులు మిషన్లే చేస్తున్నయి.
పృథ్వీరాజ్: అది కూడా నిజమే. బిల్డింగ్‌లు కట్టే దగ్గర చూస్తున్నాం కదా! టెక్నాలజీని, కొత్తగా వచ్చే మెషనరీస్‌ని బాగా వాడుకుంటున్నారు.
రాములు: మనుషులకయితే చెప్పి చేయించుకోవాలే! అదే మిషన్ అయితే బటన్ నొక్కితే పనైపోతుంది.
పృథ్వీరాజ్: చెప్పి చేయించుకోవాలంటే ఒకటి గుర్తొచ్చింది. అడ్డామీద కూలోళ్లకు బాస్ అంటూ ఎవరూ ఉండరు. దాంతో పని సరిగ్గా చేయరని.. మాటలు చెబుతూ రోజు గడిపేస్తారని అంటారు. నిజమేనా?
శ్రీనివాస్: అందరు అట్లుంటరా సార్. పనిదొంగలు అట్లుంటరు.
పృథ్వీరాజ్: ఓకే. చాలా రోజుల నుంచి మీ జీవితాల గురించి తెలుసుకోవాలని అనుకునేవాణ్ని. ఈ రోజు ఇలా సాక్షి స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని పలకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది.

పృథ్వీరాజ్: అవునూ.. మీరంతా గుడిసెల్లోనే ఉంటారా?
లక్ష్మమ్మ: వందకు తొంభై మంది గుడిసెల్లోనే ఉంటం.
పృథ్వీరాజ్: అవును మరి. గ్యారంటీ లేని సంపాదనతో ఇళ్లలో ఉండడం కష్టమే!
లక్ష్మమ్మ: అంటే గుడిసెలల్ల ఊకనే ఉండనిస్తరనుకుంటున్నరా సార్. గుడిసెకు 500 రూపాయలు. కరెంటుకి వంద. నీళ్లకు వంద తీస్కుంటరు.
ఐలయ్య: ఈ పైసలు టైమ్‌కి కట్టకపోతే గుడిసె ఖాళీజేయాలె.
పృథ్వీరాజ్: ఎవరు ఖాళీ చేయిస్తారు?
ఐలయ్య: ఆ జాగ ఎవరిది అయితే వాళ్లు సార్.
పృథ్వీరాజ్: ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకోవచ్చు కదా!
ఐలయ్య: అక్కడయితే మేం కబ్జా చేస్తామని డౌట్‌తోని అడుగు పెట్టనియ్యరు సార్.
పృథ్వీరాజ్: ఊరే నయం కదయ్యా. ఉంటే తింటాం. లేదంటే పస్తుంటాం. ఇక్కడ ఉన్నా లేకపోయినా గుడిసెకు కూడా అద్దె కట్టడం అంటే అన్యాయం కదా!
సాయిలు: అవే కదా సార్ మా తిప్పలు.

మరిన్ని వార్తలు