కాలేజీ నుంచి కొలువు దాకా! ఓ ఇంజినీరింగ్ విద్యార్థి స్వగతం

28 Jun, 2013 02:36 IST|Sakshi
కాలేజీ నుంచి కొలువు దాకా! ఓ ఇంజినీరింగ్ విద్యార్థి స్వగతం
అరె! పాపం ఒక చిన్నపిల్లవాడు, ఆకలేసి అడుక్కుంటున్నాడే! ఒక్కరికి కూడా పట్టింపులేదు. అవును! వాళ్లననే బదులు, నేనే పట్టించుకోవచ్చు కదా! కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఎన్‌జీవోలలో పనిచేశాను కదా! ఇప్పుడు కూడా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థలో చేరదాం. చేరి, చేతనైనంత సాయం చేద్దాం! 
 
ఉదయం అయ్యింది. కాని నిన్నటికి ఈ రోజుకీ చాలా తేడా ఉంది. ఓహ్! కాలేజీ అయిపోయింది కదా! ఇక బ్రష్, స్నానం ఒకేసారి చేయడం, ఏదో ఒక టిఫిన్ మింగడం, బ్యాగ్ తగిలించుకుని పరిగెత్తి బస్ ఎక్కడం, క్లాస్ - క్లాస్‌కీ మధ్యన క్యాంటీన్‌లో సమోసా బ్రేక్, లంచ్ అవర్‌లో రికార్డ్ కంప్లీషన్, బెంచ్ కింద జరిగే సబ్‌వే సర్ఫర్ గేమ్‌లు, ఇంటర్నల్స్‌కి స్లిప్‌లు, కాలేజీ ఫెస్ట్‌లు, ప్రాజెక్ట్ కోసం చిందులు, కనువిందు చేసే అందాలు, నాలుగేళ్ల ఈ బంకలో ‘బంక్’ లతో సాగిన బంధాలు, పార్కింగ్ లాట్‌లో జరిగిన మినీ యుద్ధాలు, ఎగ్జామ్స్ ముందు ఒన్‌డే బ్యాటింగ్... ఏదో సడెన్‌గా ఆగిపోయిన ఇంటర్నెట్ కనెక్షన్‌లా, ఒక్కసారిగా కళాశాలాకాశం నుండి ఖాళీ పాతాళానికి పడ్డట్టుంది. 
 
‘ఆఁ ఏముందిలే కాలేజీలో! ఆ రాజేశ్ (గొడవపడ్డవాడు) ముఖం చూడాలి, వెంకటేశ్వరరావు సార్‌తో తిట్లు తినాలి. ఐడీ కార్డ్ వేసుకుని సెక్యూరిటీ గార్డ్‌కి చూపించాలి. క్యాంటీన్‌లో ఉప్పు లేని సాంబార్, చల్లారిపోయిన ఇడ్లీ... ఈ పన్లేమీ చేయక్కర్లేదు. ఫ్రీబర్డ్స్... అవును ఫ్రీబర్ట్స్, ఖాళీగా అయిపోతాం. ఓ! ఫేస్‌బుక్ ఉందిగా! అందరికీ మెసేజ్‌లు పెడదాం. కాలేజీలో దిగిన ఫొటోలు అప్‌లోడ్ చేసే ఉంటారుగా! వాటన్నిటికీ లైకులు కొడదాం! 
 
కాని ఎంతసేపలా? సినిమా చూద్దాం! కాని సినిమాలన్నీ ఎప్పుడో కవర్ చేసేశామే! రోజుకో కొత్త సినిమా కూడా రాదాయే! పేపర్ చదువుదాం! ఈసారి బిజినెస్ పేజ్ కూడా... కాస్త కంపెనీల గురించి నాలుగు విషయాలు తెలుస్తాయి. అసలు పోస్టింగ్ వేరేచోట వస్తే, ‘అమ్మా! నాతో వచ్చెయ్యి! నేను అక్కడ ఒంటరిగా ఉండాలి’ అని అనలేం కదా! సో...ముందుగా మన బట్టలు మనమే ఉతుక్కోవడం, రెండు మూడు ఎమర్జెన్సీ కూరలు తయారు చేయడం నేర్చుకుందాం. కానీ ఈ పనులన్నీ మహా అయితే మూడు గంటల్లో అయిపోతాయి. తరవాత ఏం చేద్దాం? కెమెరా ఎలాగూ ఖాళీగానే ఉంది! ఎప్పుడో ఫేస్‌బుక్‌లో మనకంటూ ఒక ఫొటోగ్రఫీ పేజ్ స్టార్ట్ చేశాం కదా! అహ్హహ్హా... ఆ కెమెరాతో ఫొటోలు తీసి, జాబ్‌లెస్ అనే ఆల్బమ్ క్రియేట్ చేసి, అందులో అప్‌లోడ్ చేద్దాం. దీనికో రెండు గంటలు సరిపోతుంది. ఇంకా ఎన్ని గంటలు మిగిలాయో!
 
(ఇలా అనుకుంటూ రోడ్ మీద నడుస్తూ ఉండగా...) ఆ కాళ్లు చూడు ఎలా పరిగెడుతున్నాయో, కాలం కన్నా వేగంగా. రేపు మనం కూడా ఇలాగే పరిగెత్తాలేమో! అరె! పాపం ఒక చిన్నపిల్లవాడు, ఆకలేసి అడుక్కుంటున్నాడే! ఒక్కరికి కూడా పట్టింపులేదు. అవును! వాళ్లననే బదులు, నేనే పట్టించుకోవచ్చు కదా! కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఎన్‌జీవోలలో పనిచేశాను కదా! ఇప్పుడు కూడా ఏదో ఒక స్వచ్ఛందసంస్థలో చేరదాం. చేరి, చేతనైనంత సాయం చేద్దాం! 
 
హమ్మయ్య! ఇంకొక అయిదు గంటలు! వీటినేం చేద్దాం... ‘నాలుగేళ్లుగా చదువుతున్నావు. చిన్న ఫ్యాన్ బిగించడం కూడా రాదు’ అన్నారుగా నాన్న. ఏకంగా మెకానిక్ షాప్‌లోనే జాయిన్ అయిపోయి, పెద్ద షాక్ ఇద్దాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారేమో! కంపెనీదేముందిలే! అయిదు నెలలకో కొత్తబండి వస్తుంది. అదే మెకానిక్ షెడ్ అయితే రోజుకి వంద బండ్లు రిపేర్‌కి వస్తాయి. అక్కడి కన్నా ఇక్కడే ఎక్కువ నేర్చుకోవచ్చు. అక్కడ డిగ్నిటీ ఒక్కటే ఉంటే, ఇక్కడ డిగ్నిటీతోపాటు డిమాండ్ కూడా ఉంది అని నచ్చచెప్పచ్చులే! ఎంత చేసినా ఓ రెండు గంటలు మిగిలిపోతున్నాయి. ఏం చేద్దాం! గుడికెళ్తే సరి. ‘ఎగ్జామ్స్ అయితే తప్ప గుర్తు చేసుకోనివాళ్లు, ఏంటి ఈ రోజు ఏకంగా గుడికి వచ్చేశారు’ అని షాక్ అయినా అవ్వొచ్చు దేవుడు. వద్దులే! కథలు, కవితలు రాద్దాం. ‘మడిసన్నాక కూసంత కళాపోసణుండాలి కదా!’ హమ్మయ్య, మళ్లీ బిజీ అయిపోతాం. ముందుగా ఇవన్నీ ఒక పేపర్ మీద రాద్దాం. చాలు. ఈ రోజు చాలా చేసేశాం. నిద్ర కూడా వస్తోంది. పడుకోవడానికి వీలుగా ఇంట్లో కూడా క్లాస్‌రూమ్ బెంచ్ ఉంటే బాగుండు. 
 
- జాయ్
మరిన్ని వార్తలు