బావను భయపెడుతున్న బాలయ్య!

21 Mar, 2014 13:18 IST|Sakshi
బావను భయపెడుతున్న బాలయ్య!

బావ హరికృష్ణ, బాబు జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే సంబంధాలు బెడిసి కొట్టిన చంద్రబాబు నాయుడును ఇప్పుడు పిల్లనిచ్చిన బావమరిది బాలయ్య వ్యవహారం భయపెడుతోంది. కొన్నాళ్ళుగా బాలకృష్ణ మౌనం పాటిస్తున్నారు. ఎలా సముదాయించాలో తెలియని బాబు టెన్షన్ పడుతుంటే.. తెలుగు తమ్ముళ్ళు పెట్టిన డిమాండ్ మరింత ఇరకాటంలో పడేసింది..

అదును చూసి దెబ్బ కొట్టాలి. సినిమాల్లో హీరోలు చేసే పని ఇది. సరిగ్గా ఇదే చేస్తున్నారు హీరో బాలకృష్ణ.. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి.. ఎన్నికల సెగలో పార్టీలు రగులుతున్న వేళ.. హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. సరాసరి ఎన్నికల బరిలో దిగాలని ఉన్నా.. ఆ మాట చెప్పకుండా నిశ్శబ్దం అయిపోయారు. ఇప్పటికే పెద్దబావ హరికృష్ణ, బాబు జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధాలు బెడిసి కొట్టిన చంద్రబాబుకు...ఇప్పుడు బాలయ్య వ్యవహారం ఊపిరి సలపనీయ లేదు. అసలే ఎన్నికలు, ఈ సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీని దూరం చేసుకుంటే.. ఎంతో కొంత నష్టం తప్పదన్నది బాబు భయం. అందుకే బాలయ్య మనసులో మాట తెలిసినా.. ఎలా నరుక్కు రావాలో అర్ధం కాక తల పట్టుక్కూర్చున్నారంట. ఇదే  సమయంలో బాలయ్య అభిమానులైన తెలుగు తమ్ముళ్ళు పెట్టిన డిమాండ్‌ బాబును మరింత ఇరకాటంలో పడేసింది.
                        
సీమాంధ్రలో ఏదో ఓ రకంగా తెలుగుదేశం నెగ్గుకొస్తే బాలయ్యను ముఖ్యమంత్రిని చేయాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ పెట్టారు. పార్టీ వర్గాలను సముదాయించి బాలకృష్ణను ఎక్కణ్ణుంచి పోటీ చేయించాలని ఇప్పటికే సతమవుతున్న బాబుకు.. ఈ డిమాండ్ ముందు కాళ్ళకు బంధం వేసింది. ఎందుకంటే హరికృష్ణతో బాబుకు సంబంధాలు బెడిసి కొట్టినా.. ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఏకమైతే.. చేతులెత్తేయడం తప్ప మరో మార్గం లేదని బాబుకు బాగా తెలుసు. పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారడంతో మెట్టు దిగిన బాబు.. బాలయ్యకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. రాష్ట్రంలో  ఏ నియోజకవర్గం నుంచైనా బాలకృష్ణ పోటీ చేయవచ్చంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
                    
వాడుకొని వదిలి పెట్టడం.. స్వ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయాలకు పాల్పడడం.. బాబు నైజమని బాగా తెలిసిన బాలకృష్ణ వ్యూహాత్మకంగానే ఎన్నికల ముందు సైలెంట్ అయ్యారని టిడిపి వర్గాలు గుసగులలాడుతున్నాయి. తన అభిమానులైన తెలుగుతమ్ముళ్ళతో డిమాండ్ పెట్టించి తన పని కానిచ్చుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది.

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా