నిత్యకల్యాణ దాయకుడు

27 Jul, 2013 03:03 IST|Sakshi
నిత్యకల్యాణ దాయకుడు
సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలు సామాన్య మానవుల వరకు కలియుగదైవాన్ని ఉత్సవాలు, ఊరేగింపులు, ఆరాధనలు, నివేదనలు, పూజలతో సేవిస్తున్నారు. జగత్కల్యాణం కోసం స్వామికి ఏటా 450కిపైగా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తున్నారు. అందులో నిత్య కల్యాణోత్సవానికి ఎనలేని విశిష్టత ఉంది. అందుకే తిరుమలక్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. 
 
 సంతానం, వివాహం, ఉద్యోగం, గృహనిర్మాణం, శుభకార్యం... ఇలా ఏదో ఒక కార్యమో, కష్టమో తీరినందుకు ప్రతిఫలంగా స్వామికి ఏదో ఒక ఉత్సవం, సేవ చేస్తూ తమ భక్తితత్పరతను చాటుతున్నారు భక్తులు. ఎన్నోరకాల విశిష్టసేవలు ఉన్నప్పటికీ చాలామంది భక్తులు శ్రీ పద్మావతి శ్రీనివాసుడి (ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్ప)కి నిత్యకల్యాణోత్సవం నిర్వహించడానికే తొలిప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి చేసుకుని దర్శనానికి వచ్చే కొత్త దంపతులు శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి ఆలయంలో ఐదు శతాబ్దాల ముందు ప్రారంభమైన శ్రీవారి కల్యాణోత్సవం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు 800 జంటలు ఈ కల్యాణోత్సవంలో పాల్గొంటున్నాయి. 
 
 అభిజిత్‌లగ్నంలోనే అన్నీ...
 
 నిత్యం శ్రీవారి ఆలయంలో సుప్రభాతం, తోమాల,  కొలువు, సహస్రనామార్చన తర్వాత మొదటి నైవేద్యం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన, నైవేద్యం ముగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆనందనిలయం నుంచి ఊరేగింపుగా ఛత్ర చామర మంగళవాద్య సహితంగా సంపంగిప్రాకారంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య శుభఘడియల్లో మేళతాళాలు, పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ  వైఖానస ఆగమోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకుర్పారణతో జగత్కల్యాణ చక్రవర్తి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆర ంభిస్తారు. అర్ఘ్య పాద్యాచమనాది ఉపచారాలు, నూతన వస్త్ర సమర్పణ, కంకణాల ప్రతిష్ట, తర్వాత ఉత్సవవర్లకు కల్యాణ కంకణధారణ చేస్తారు. వేదోక్తంగా అగ్నిహోమం చేస్తారు. ఆర్జితసేవలో పాల్గొనే గృహస్తులకు సంకల్పం చేయిస్తారు. తర్వాత తాళ్లపాక వంశీయులు కన్యాదాన కార్యక్రమాన్నిపూర్తి చేస్తారు. 
 
అనంతరం అభిజిత్ లగ్న శుభఘడియల్లో మాంగల్య ధారణ చేయిస్తారు. భక్తుల సమక్షంలో అర్చకస్వాములు రెండు మంగళసూత్రాలను మలయప్పస్వామి చేతులకు తాకించిన తర్వాత ఒకటి శ్రీదేవిమెడలో, మరొకటి భూదేవిమెడలో అలంకరిస్తారు. అనంతరం లాజహోమం, పూర్ణాహుతి తర్వాత కన్యాదాతలకు తాంబూలం సమర్పిస్తారు. అమ్మవారి తరపున అన్నమయ్య వంశీయులు, స్వామి తరపున అర్చకులు పూలబంతులకు బదులు కొబ్బరికాయలను మూడుసార్లు దొర్లిస్తారు. తర్వాత ఉత్సవమూర్తుల పుష్పమాలల్ని మూడుసార్లు మార్చుతూ అలంకరిస్తారు. ఇక చివరగా పసుపు కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు పోసిన తర్వాత నిత్య నూతన వధూవరులకు ప్రత్యేక హారతులు, నివేదనలు చేసి కార్యక్రమాన్ని ముగిస్తారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్నవారిని గర్భాలయమూలమూర్తి దర్శనానికి అనుమతిస్తారు. 
 
 అన్నమయ్య వంశీకులదే ఆ అదృష్టం!
 
 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా, పద్మావతి అమ్మవారు ఇంటి అడబిడ్డగా తాళ్ళపాక అన్నమయ్య స్వామివారికి నిత్య కల్యాణోత్సవం నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. అదే ఆచారం నేటికీ అన్నమయ్య వంశీయులు నిర్వహిస్తున్నారు.   ప్రస్తుతం రూ. 1000 చెల్లిస్తే ఇద్దరు భక్తులను అనుమతిస్తారు. ఉదయం 11.30  నుండి 1.30  మధ్యాహ్నం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం దంపతులకు ఉత్తరీయం, రవికెలముక్క, లడ్డూ, వడలు, అప్పాలు ప్రసాదంగా ఇస్తారు. నిత్య కల్యాణ చక్రవర్తికి వేకువజాము సుప్రభాతం మొదలు, రాత్రి ఏకాంతసేవ వరకు నిర్విరామంగా ఉత్సవాలు, సేవలు సాగుతూనే ఉంటాయి. అందుకు చిహ్నంగా ఆలయ మహద్వారం, కల్యాణ మండపంలో ప్రతిరోజూ అరటిమాకులు,  మామిడి తోరణాలు అలంకరిస్తారు. అందుకే కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ భక్తులను కటాక్షిస్తోంది. 
 
 - సహదేవ కేతారి, సాక్షి, తిరుమల
 
 - ఫొటోలు: కె.మోహన్‌కృష్ణ, సాక్షి,తిరుమల
 
 గతంలో భక్తులు నగదు చెల్లించిన రోజుల్లో మాత్రమే ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు. 
 
 టీటీడీ ఏర్పడిన తొలినాళ్లలో రూ.500 చెల్లిస్తే శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించేవారు.
 
 1979లో అప్పటి ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ హయాంలో  ఇద్దరు దంపతుల కోసం రూ.750 చిన్న కల్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టారు.ఈ ఉత్సవాలలో పాల్గొన్న వారికి వస్త్ర బహుమానం, ఒక్క లడ్డు, వడ ఇచ్చేవారు. 
 
మరిన్ని వార్తలు