ఫ్రీ సోలార్ సెల్‌ఫోన్ చార్జింగ్ స్టేషన్లు

1 Jul, 2013 04:34 IST|Sakshi
ఫ్రీ సోలార్ సెల్‌ఫోన్ చార్జింగ్ స్టేషన్లు
మనదేశంలో వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లే,  అమెరికాలో ఛార్జింగ్ అయిపోయిన సెల్‌ఫోన్లకు ఫ్రీగా ఛార్జింగ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఒక టెలికామ్ సంస్థ న్యూయార్క్‌లో తాజాగా  ‘సోలార్ చార్జింగ్ స్టేషన్’ను ఏర్పాటు చేసింది. ఇక్కడ సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌లకు ఉచితంగా చార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చార్జింగ్ స్టేషన్లు సోలార్‌తో పనిచేయడం విశేషం. ఇలా ఈ ఉచిత సౌకర్యంలో ఆదర్శం కూడా మిళితమైంది. టెలికామ్ ప్రొవైడర్ ఏటీ అండ్ టీ ఈ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఒక స్టేషన్ మాత్రమే ప్రారంభం అయ్యింది. త్వరలో న్యూయార్క్ నగరం నలుమూలలా ఇలాంటి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. 
 
ఈ చార్జింగ్‌స్టేషన్లలో కాసేపు కూర్చుని  ఇ-డివైజ్‌ల బ్యాటరీఫిల్ చేసుకోవడం బాగుందని న్యూయార్క్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో యూనివర్సిటీలు, స్కూళ్లు, బస్టాండ్‌లు, ఎయిర్ పోర్టుల్లో కూడా ఇలాంటి ఉచిత సోలార్ చార్జింగ్‌స్టేషన్‌లు ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. మనదేశంలో కూడాఇంచుమించు ప్రతి చేతిలోనూ సెల్‌ఫోన్, కొన్ని ఖరీదైన చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లూ ఉపయోగించే విద్యార్థులున్నారు. ఇలాంటి ఆదర్శవంతమైన ప్రయోగం ఇక్కడ కూడా జరిగితే బావుంటుందేమో...!
>
మరిన్ని వార్తలు