స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా..!

21 Dec, 2017 18:41 IST|Sakshi

లండన్: పొగతాగడం (స్మోకింగ్) పలు వ్యాధులకు దారితీస్తుందని అందరికీ తెలిసిందే. జీర్ణాశయం వాపు లాంటి పలు సమస్యలు స్మోకింగ్ వల్ల ఎదురవుతాయి. పొగతాగడం బాగా అలవాటున్న వారికి ఈ వ్యసనాన్ని మానుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే స్మోకింగ్ చేసేవాళ్లు ప్రతిరోజు కొద్దిసేపు రన్నింగ్ చేస్తే ఆ అలవాటు నుంచి బయడపడే అవకాశం ఉందంటున్నారు లండన్ నిపుణులు.

సెయింట్‌ జార్జ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌కు చెందిన కొందరు రీసెర్చర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ అలెక్సిస్ బెయిలీ అనే రీసెర్చర్ తన బృందంతో స్మోకింగ్ పై చేసిన పరిశోధన ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించారు. ప్రతిరోజు కొద్దిదూరం పరుగెడితే పొగతాగాలన్న ఆలోచన వారిలో తగ్గిపోతుందన్నారు. రీసెర్చర్ల బృందం కొన్ని ఎలుకలపై నికోటిన్ ను ప్రయోగించి చూశారు. ఆ ఎలుకలలో కొన్నింటిని పరుగెత్తించడం, వ్యాయామం చేయించడం లాంటి పనులు చేయించి చూడగా వాటిలో నికోటిన్ ప్రభావం చాలా మేరకు తగ్గినట్లు గుర్తించారు. మనుషుల్లో అయితే ఎక్కువ సమయం వ్యాయామం చేయడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనుల కంటే కాసేపు పరుగెత్తే వారిలో నికోటిన్ ప్రభావం తగ్గి, ధూమపానానికి దూరంగా ఉండాలని స్మోకర్స్ భావిస్తారని లండన్ నిపుణుల బృందం వెల్లడించింది.

మరిన్ని వార్తలు